Vizag Steel Plant: కూడు పెట్టే ఉక్కు గూడు కూల్చిన నిప్పు | Vizag Steel Plant Fire Accident | Sakshi
Sakshi News home page

Vizag Steel Plant: కూడు పెట్టే ఉక్కు గూడు కూల్చిన నిప్పు

Jun 9 2026 7:59 AM | Updated on Jun 9 2026 8:44 AM

Vizag Steel Plant Fire Accident

తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు 

నాన్న ఎప్పుడు వస్తారు? అని అడుగుతున్న చిన్నారులు 

మార్చురీ వద్ద గుండెలవిసేలా రోదనలు  

స్టీల్‌ప్లాంట్‌ దుర్ఘటనతో ఎనిమిది కుటుంబాల్లో తీరని విషాదం

రెక్కలొచ్చిన ఆశలతో పొద్దునే కర్మాగారంలోకి అడుగుపెట్టిన పాదాలు.. సాయంత్రానికి కరిగిన ఉక్కులో కలిసిపోయాయి. దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించే శ్రామికుడి రక్తం.. 1600 డిగ్రీల అగి్నప్రళయంలో ఆవిరైపోయింది. ఒక్కటంటే ఒక్క క్షణం.. విశాఖ ఉక్కునగరాన్ని శోకసముద్రంగా మార్చేసింది. నవ్వుతూ వెళ్లిన నాన్న నల్లటి ముద్దగా మారిన వేళ.. గుండెలు పగిలేలా రోదిస్తున్న కుటుంబాల ఆక్రందనలతో ఉక్కునగరం అట్టుడుకుతోంది.

సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం/అక్కిరెడ్డిపాలెం: ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భార్యతో ‘సాయంత్రం త్వరగా వచ్చేస్తా’ అన్నారో కారి్మకుడు.. ‘నాన్న వచ్చేటప్పుడు స్వీట్లు తీసుకురావా’ అని అడిగిన కూతురి తల నిమిరి ముద్దాడి వెళ్లారో తండ్రి.. ‘జాగ్రత్త నాయనా’ అని వెన్నుతట్టిన ముసలి తల్లికి ధైర్యం చెప్పి డ్యూటీకి బయలుదేరాడో కొడుకు.. రక్తాన్ని చెమటగా మార్చి, దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించేందుకు ఆ చేతులు విశాఖ ఉక్కు కర్మాగారంలోకి అడుగుపెట్టాయి. కానీ, కాలం ఇంత క్రూరంగా మారుతుందని.. తాము నమ్ముకున్న కర్మాగారమే తమకు అగ్ని సమాధి అవుతుందని ఆ కార్మికులు ఊహించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క క్షణం.. కేవలం ఆ ఒక్క క్షణంలో సంభవించిన అగ్ని  ప్రళయం ఎనిమిది మంది కార్మికులను మాంసపు ముద్దలుగా మార్చేసింది. కళ్లెదుటే ప్రాణాలు కరిగిపోతుంటే, కాపాడుకోలేక మిగిలిన శోకం.. ఉక్కునగరాన్ని కన్నీటి సముద్రంగా మార్చింది. 



1600 డిగ్రీల అగి్నప్రళయం 
సోమవారం సాయంత్రం 4,15 గంటల సమయం.. ‘బీ’ షిఫ్ట్‌ విధులు సాఫీగా సాగిపోతున్నాయి. స్టీల్‌ మెల్ట్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌–1) విభాగంలో, నేలమట్టానికి దాదాపు 9 మీటర్ల ఎత్తున ఉన్న సీసీడీ సెక్షన్‌ అంతా కార్మికులు, అధికారుల అలికిడితో సందడిగా ఉంది. బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ఎర్రగా కాగిన హాట్‌మెటల్‌ను భారీ లేడిల్‌లో ఎస్‌ఎంఎస్‌కు తరలించి, ద్రవపు ఉక్కుగా మార్చే కీలక ప్రక్రియ జరుగుతోంది. ఉత్పత్తి లక్ష్యాలను అందుకునే క్రమంలో సీసీడీ మిషన్‌–2 పై లేడల్‌ను ప్లేస్‌ చేసి, రొటేట్‌ చేయడం ప్రారంభించారు. అంతా సజావుగానే ఉందనుకున్న మరుక్షణమే.. ఊహకందని కాలసర్పంలా ఆ ఘోర విస్పోటనం సంభవించింది. ద్రవరూపంలో ఉన్న ఆ నిప్పుల నరకం షాప్‌ ఫ్లోర్‌పై సునామీలా దూసుకురావడంతో, చుట్టుపక్కల ఉన్న భారీ యంత్రాలు సైతం మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కనీసం కళ్లు తెరిచి చూడడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు పరుగెత్తాలో కూడా తెలియని ఓ నరకప్రాయ వాతావరణం అక్కడ ఏర్పడింది. 



ఊహకే అందని నరకయాతన! 
100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద మరిగే నీరు తగిలితేనే చర్మం ఊడిపోతుంది. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్‌ అంటే పటిష్టమైన ఇనుము, రాళ్లు సైతం నీరులా కరిగిపోతాయి. ఈ అగ్ని ద్రవం మనిషి శరీరంపై పడితే.. కనీసం రక్తం కారడానికి, లేదా చర్మం కాలడానికి కూడా సమయం ఉండదు. క్షణాల వ్యవధిలో మాంసము, ఎముకలు సైతం బూడిదగా మారిపోతాయి. ఆ వేడి నుంచి వెలువడే శ్వాస గొంతులోకి వెళ్తే ఊపిరితిత్తులు క్షణంలో మాడిపోతాయి. ప్రమాద స్థలంలో కార్మికులు అనుభవించిన ఆ క్షణ కాల నరకయాతన వర్ణనాతీతం, హృదయవిదారకం. 

కళ్లెదుటే కరిగిపోయిన మనుషులు 
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు, సహచర కార్మికులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి కన్నీరు ఆగలేదు. నిలువెత్తు మనుషులు క్షణాల వ్యవధిలో బొగ్గు ముద్దలుగా మారిపోయారు. కనీసం వారు ధరించిన దుస్తులు గానీ, ముఖాలు గానీ ఆనవాళ్లు లేకుండా పోయిన స్థితి వర్ణనాతీతం. మరోవైపు శరీరమంతా కాలిన గాయాలతో, ప్రాణ రక్షణ కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఉక్కునగర వాతావరణాన్ని శోకసంద్రంగా మార్చాయి. వారిని వెంటనే ప్లాంట్‌ జనరల్‌ ఆసుపత్రికి, నగరంలోని కిమ్స్, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు, ఆసుపత్రుల వద్దకు పరుగున చేరుకున్నారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలియక, లోపలికి వెళ్లనివ్వక వారు ఆసుపత్రి కారిడార్లలో గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని ద్రవింపజేసింది. 

బతుకులు.. బుగ్గయ్యాయి 
ఈ ఘోర ప్రమాద బాధితుల్లో మేనేజర్‌ స్థాయి అధికారి గోల్డ్‌ కుమార్‌ నుంచి.. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కాంట్రాక్ట్‌ కార్మికుల వరకు ఉన్నారు. నక్క వెంకటరమణ, త్రినాథ్, అప్పలరాజు వంటి కాంట్రాక్ట్‌ కార్మికుల ఇళ్లల్లో ఈ ప్రమాదం కోలుకోలేని చీకట్లను నింపింది. అరకొర జీతాలు, కనీస భద్రత లేని వాతావరణం.. అయినా సరే, కేవలం కుటుంబ పోషణ కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధుల్లో చేరిన ఆ పేద బతుకులు.. కరిగిన ఉక్కు సముద్రంలో కలిసిపోయాయి. 

మార్చురీ వద్ద ఉద్రిక్తత 
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించాలని అధికారులు ప్రయతి్నంచగా, క్షతగాత్రుల కుటుంబీకులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ‘మా వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమేంటో చెప్పాలి.. మాకు ఏం న్యాయం చేస్తారో తేల్చాలి’ అంటూ మార్చురీ ముందే బైఠాయించారు. 

యాజమాన్యం నిర్లక్ష్యమేనా?  
ఈ ఘోర దుర్ఘటనపై ఉక్కు కారి్మక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కీలకమైన విభాగాల్లో కాలానుగుణంగా యంత్రాల ఫిట్‌నెస్‌ పరీక్షించకపోవడం వల్లే లాడిల్‌ పేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు భారీ పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కలి్పంచాలని డిమాండ్‌ చేశారు.  

అమ్మని బాగా చూసుకోరా

కంటతడి పెట్టిస్తున్న క్షతగాత్రుడి వీడియో 
వర్మా.. తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే.. తమ్ముడిని బాగా చదివించురా...నువ్వు కూడా బాగా చదువుకోమ్మా... అమ్మని బాగా చూసుకోండి...ఉంటాను డాడీ...అంటూ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు వీడియో అందర్నీ కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. ఒంటినిండా గాయాలతో చికిత్స పొందుతున్న ఆ బాధితుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.  

కన్నీరుమున్నీరు 
‘నువ్వే పోతే మాకు దిక్కెవరు నాన్నా?‘ అని పిల్లలు, ‘పొద్దునే కదా కళ్లముందు తిరిగావు.. ఇంతలోనే శవమయ్యావా?‘ అంటూ మృతుల భార్యలు ఆసుపత్రి నేలపై పొర్లి ఏడుస్తుంటే.. అక్కడ ఉన్న పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. ఇప్పుడు ఆ అభాగ్య కుటుంబాలను ఆదుకునే నాథుడెవరు? తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పిల్లల భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.

ప్రమాదంపై సమగ్ర విచారణ జరగాలి
గాజువాక : స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఉక్కు ప్రమాద మృతులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లుగా వీఆర్‌ఎస్, రిటైర్‌మెంట్‌వాళ్లతో కలుపుకొని సుమారు 9,500 మంది కార్మికులను తొలగించారన్నారు. ఉన్న కార్మికులపై విపరీతమైన ఒత్తిడి పెంచారని, ఉత్పత్తి ఆధారితంగా జీతాలు చెల్లిస్తామని షరతు పెట్టారని అన్నారు. దీనివల్ల కార్మికులపై అదనపు భారం పడిందన్నారు. మొన్నటివరకు పది మంది చేయాల్సిన పనిని ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారన్నారు. కార్మికులపై అంత భారం పడినప్పుడు వారికి కల్పించాల్సిన భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు తీసుకోకపోవడమే కాక, సీనియర్‌ ఉద్యోగులను బలవంతంగా వీఆర్‌ఎస్‌ పెట్టించేసి, ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు యాజమాన్యం ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఇంతమంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 

యాజమాన్య వైఫల్యమే..  :  కేకే రాజు  
స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ ఆస్పత్రివద్ద మృతదేహాలను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించలేదన్నారు. ముఖ్యంగా 30, 40 మంది పని చేయాల్సిన చోట పది, పదిహేను మందితో పని చేయిస్తున్నారన్నారు. సీనియర్‌ కార్మికులను ఒత్తిడి పెట్టి నయానో, భయానో వీఆర్‌ఎస్‌ తీసుకొనేలా చేశారన్నారు. దశాబ్దాలుగా పని చేసిన కాంట్రాక్టు కార్మికులను నిర్ద్వందంగా తొలగించారన్నారు. ఇలాంటి నిర్ణయాలవల్ల ఈరోజు భారీ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదం చాలా దురదృష్టకరమని, దీనికి స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం బాధ్యత వహించాలని అన్నారు.    

కనకమహాలక్ష్మి నగర్‌లో విషాదం 
గోపాలపట్నం: స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో జీవీఎంసీ 90వ వార్డు కనకమహాలక్ష్మి నగర్‌కు చెందిన ఎం. కృష్ణ నాగు (55) మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇటీవలే సీఎంఎం విభాగం నుంచి ఎస్‌ఎంఎస్‌కు బదిలీ అయిన ఆయన ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.  మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.  

సరైన నిర్వహణ లేకే..
డాబాగార్డెన్స్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని íసీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్, అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. కాలం చెల్లిన యంత్రాలు వాడడం, నాసిరకం ముడిసరుకు, సరైన మెయింటెనెన్స్‌ లేకపోవడం వల్లే లాడిల్‌ పేలి 8 మంది కారి్మకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 

ప్రమాదానికి మోదీ, బాబులదే బాధ్యత  
ఉక్కు ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం, ప్రైవేటీకరణ విధానాలే కారణమని సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు ఆరోపించారు. మృతి చెందిన కారి్మక కుటుంబాలకు రూ.కోటి,గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున సాయం అందించాలన్నారు.    

 

Advertisement
 
Advertisement
Advertisement