‘రైల్వేకోడూరు’ నుంచి పథకాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీఎం, డిప్యూటీ సీఎం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వీబీ జీ రామ్ జీ పథకం ఏపీలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి నుంచి గురువారం ప్రారంభమైంది. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవికా మిషన్’ ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనులకు ముగ్గురు నేతలూ లాంఛనంగా శ్రీకారం చుట్టారు.
సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వీబీజీ రామ్ జీ జాబ్‌కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ వీబీ జీ రామ్ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద సమాచార బుక్‌లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ విడుదల చేశారు. వీబీజీ రామ్ జీ పోర్టల్‌ను నేతలు ప్రారంభించారు. అనంతరం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఏమన్నారంటే..
ఏపీకి నేను మేనమామను..
దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయంచేయాలని నిర్ణయించాం. ఈ తొమ్మిది నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తాం. నన్ను మధ్యప్రదేశ్‌లో అంతా మామాజీ అని పిలుస్తారు.. ఇప్పుడు ఏపీకి కూడా నేను మేనమామనే అయ్యా. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడు. ఏపీకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇస్తాం. అలాగే, 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది.
అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు..
సీఎం చంద్రబాబు, పవన్ మాట్లాడుతూ.. ‘వీబీ జి రామ్‌జీ పథకం రాష్ట్రం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రాత్మకం. గతంలో ‘నరేగా’ కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతమైంది. ఈ పథకంతో గ్రామాల రూపురేఖలు మారతాయి. పొలాలకు వెళ్లే డొంక రోడ్లు ఈ పథకం కింద నిర్మించవచ్చు. గాలేరు–నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకొస్తాం. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే సమస్యల్ని పరిష్కరించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. కేంద్ర నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది.’ అని చెప్పారు.


