
పశ్చిమగోదావరి జిల్లా: ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ చేసిన దాడి కేవలం ఉగ్రస్థావరాలపై మాత్రమేనని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. పాకిస్తాన్ దేశంపై దాడి చేయలేదని, అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉగ్రవాదులపై దాడి మాత్రమేనన్నారు. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ పాలకులు నోటికి వచ్చినట్లు ప్రేలాపన ప్రేలుతున్నారని మండిపడ్డారు.
‘భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ పెద్ద ఇష్యూ కాదు. పహల్గాంలో పర్యాటకుల పై దాడి చేసి 26 మంది మరణించడానికి కారణమైన ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేశాం. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక దేశ రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేశాం. ఆర్టికల్ 35 ఏ రద్దు చేసాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపి ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీదే. కాశ్మీర్లో పెద్ద ఎత్తున పర్యాటకులు పెరిగారు.
పర్యాటకల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. కాశ్మీర్లో ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు కాశ్మీర్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రజలపై ఉగ్రవాదులు ఉద్దేశ్య పూర్వకంగా అభద్రత భావం భావం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక దేశాలు భారతదేశానికి మద్దతు ఇచ్చాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం పోరాటం చేస్తుంది. పాకిస్తాన్ కు ఏ సమయంలో అయినా బుద్ధి చెప్తాం.పాకిస్తాన్ ను అన్ని రకాలుగా దిగ్బంధనం చేసాం’ అని మంత్రి స్పష్టం చేశారు.