రోడ్డు నిర్మాణానికి భూములిస్తే మొత్తం భూములు లాక్కుంటారా? | Undavalli farmers ready for legal and direct struggles against forced land acquisition | Sakshi
Sakshi News home page

రోడ్డు నిర్మాణానికి భూములిస్తే మొత్తం భూములు లాక్కుంటారా?

Oct 7 2026 4:20 AM | Updated on Oct 7 2026 4:20 AM

Undavalli farmers ready for legal and direct struggles against forced land acquisition

గుంటూరు జిల్లా ఉండవల్లిలో గ్రామ సభకు హాజరైన రైతులు

2014కు ముందే ఉండవల్లి–పెనుమాక భూముల విలువ రూ.కోట్లలో ఉంది 

బలవంతపు భూసేకరణపై న్యాయ, ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం 

ఉండవల్లి ప్రాంత రైతుల అల్టిమేటం

తాడేపల్లి రూరల్‌: రైతులంతా నష్టపోతున్నప్పటికీ ఉండవల్లి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చారని.. ఇప్పుడు ఉండవల్లిలో ఉన్న మిగిలిన భూములను కూడా లాక్కునేందుకు ప్రయత్ని­స్తూ ప్రభుత్వం భూ సేకరణ నోటీసులు అందజేసిందని గుంటూరు జిల్లా ఉండవల్లి ప్రాంత రైతులు మండిపడ్డారు. మంగళవారం రాత్రి ఉండవల్లి సెంటర్‌లో రైతులంతా సమావేశమయ్యారు. అనంతరం రైతు ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. గతంలోనూ మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములిస్తే మిగిలిన భూములు వదిలేస్తామని చెప్పారని గుర్తు చేశారు. దీంతో తామంతా నష్టపోతున్నప్పటికీ రోడ్డు నిర్మాణానికి సహకరించి భూములిచ్చామని గుర్తు చేశారు. 

ఇప్పుడు అదే మంత్రి ఉండవల్లిలో మిగిలిన భూములను కూడా లాక్కునేందుకు ప్రయత్నిస్తూ భూసేకరణ నోటీసులు అందజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లిలో ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఎల్‌ఎఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, రిటర్నబుల్‌ ప్లాట్లు, పంపింగ్‌ స్కీమ్‌కు భూములు కావాలని చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఉండవల్లి ప్రాంతంలో సారవంతమైన భూములున్నాయని ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములనే కాంక్రీట్‌ జంగిల్‌ చేయడానికి ప్రయత్నించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడి రైతులకు 10 సెంట్ల నుంచి అర ఎకరంలోపు భూములున్నాయని చెప్పారు. 

రాజధాని రాకముందే ఉండవల్లి–పెనుమాక భూముల ధర రూ.కోట్లు పలికాయని, అప్పుడే రైతులెవరూ భూములు అమ్ముకోలేదని చెప్పారు. ఈ భూముల్నే నమ్ముకుని రైతులంతా తమ కుటుంబాలను ఎంతో గౌరవంగా బతికించుకుంటున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి బలవంతపు భూసేకరణ జరిపేందుకు యత్ని­స్తూ రైతులను భయభ్రాంతుల్ని చేయడం నిలిపివేయాలన్నారు. గ్రామంలో ఇప్పటివరకు ఒక్క రోడ్డు కూడా నిర్మించలేదని, పెద్దపెద్ద రోడ్లు వేస్తామంటూ భూ సేకరణకు వెళ్తామని బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో పాటు ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. 

ఈ నెల 23న ఉండవల్లిలో జరిగే గ్రామసభకు మంత్రి నారా లోకేశ్‌ హాజరై తమ కష్టాలను వినాలని రైతులు కోరారు. కార్యక్రమంలో మున్నంగి వీర శ్రీధర్‌రెడ్డి, రాజధాని రైతు సంఘం అధ్యక్షుడు కొర్రప్రోలు ఈశ్వర్‌రెడ్డి, రైతు నేతలు దండమూడి సాంబశివరావు, జొన్న శ్రీను, శిగిరిశెట్టి అనంత శివరావు, పల్లపోలు అశోక్‌రెడ్డి, ఆళ్ల శివాంజనేయులు, బుర్రముక్కు పద్మారెడ్డి, గుదిబండ శివశంకర్‌రెడ్డి, పోలిశెట్టి మాణిక్యాలరావు, మున్నంగి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement