
సాక్షి,తిరుపతి: తిరుపతిలో రైలు ప్రమాదం జరిగింది. హిస్సార్ టూ తిరుపతి (04717) ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. మంటల తీవ్రతతో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. మంటలు మరో ట్రైన్ భోగీకి వ్యాపించాయి. రైలు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిప్రమాపక సిబ్బంది ఎగిసి పడుతున్న మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఆగి ఉన్న ట్రైన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో హిస్సార్ టు తిరుపతి జనరల్ కోచ్ పూర్తిగా దగ్ధం కాగా.. ట్రాక్ మీద ఉన్న ఉన్న రాయలసీమ ఎక్స్ ప్రెస్ పవర్ కార్ కోచ్‌కు కూడా అగ్నికీలలు వ్యాపించాయి. ఆ ట్రైన్ భోగి సైతం స్వల్పంగా కాలింది. ఇక ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ట్రైన్‌లో అగ్నిప్రమాదానికి గల కారణాల్ని రైల్వే అధికారులు అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే
తిరుపతి టూ హిస్సార్ రైలు ప్రమాదంపై తిరుపతి స్టేషన్ మేనేజర్ చిన్నప్పరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘జనరల్ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తిరుపతి హిస్సార్ మధ్య నడిచే హిస్సార్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు.ప్రమాద నష్టం అంచనా వేస్తున్నాం.రాయలసీమ ఎక్స్ ప్రెస్ పవర్ కోచ్‌కు మంటలు వ్యాపించాయి, వాటిని అదుపు చేశాం’అని తెలిపారు.
