కార్పొరేటర్లకు అడుగడుగునా అవమానం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేటర్లకు అడుగడుగునా అవమానం

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

కార్పొరేటర్లకు అడుగడుగునా అవమానం

కార్పొరేటర్లకు అడుగడుగునా అవమానం

గ్రేటర్‌ తిరుపతిగానే ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాం మేయర్‌ శిరీష మున్సిపల్‌ కార్పొరేషన్‌ బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం... కార్పొరేషన్‌కి పెరిగిన రాబడి వెనుక గత ప్రభుత్వ అభివృద్ధి కార్పొరేటర్లు వెల్లడి

తిరుపతి తుడా: గ్రేటర్‌ తిరుపతిగా తీర్మానిస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపి ప్రకటన చేయాలని నగర మేయర్‌ డాక్టర్‌ ఆర్‌ శిరీష విజ్ఞప్తి చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వార్షిక బడ్జెట్‌, సాధారణ కౌన్సిల్‌ సమావేశం మేయర్‌ డాక్టర్‌ శిరీష అధ్యక్షతన ఎస్వీ యూనివర్సిటీ సెనేట్‌ హాల్లో మంగళవారం నిర్వహించారు. కార్పొరేషన్‌ 2026 –27 వార్షిక ఏడాది రూ. 350 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అలానే 44 అంశాలతో కూడిన పరిపాలన, అభివృద్ధి అజెండాలకు ఆమోదం తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్‌ మౌర్య హాజరయ్యారు. మేయర్‌ శిరీష మాట్లాడుతూ వరుసగా ఐదో బడ్జెట్‌ ప్రవేశపెట్టే కౌన్సిల్‌కి మేయర్‌గా ఉండే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి తొలి మేయర్‌గా సేవలందించే అరుదైన గౌరవం లభించిందన్నారు. గత కౌన్సిల్‌లో తిరుపతిని మహానగరంగా విస్తరించాలని ఏకగ్రీవంగా తీసుకున్న తీర్మానాన్ని ప్రభుత్వం గౌరవించి, వెంటనే గ్రేటర్‌ తిరుపతిని ప్రకటించాలని ఆమె కోరారు. తిరుపతి ప్రజలు అభిప్రాయం, కౌన్సిల్‌ నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. తదుపరి ఎన్నికలు గ్రేటర్‌ తిరుపతికే జరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ బడ్జెట్‌ను ఖర్చులను తగ్గించుకుని, పొదుపును పెంచుకునేలా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదాయ వ్యయాల సమతుల్యత అవసరమని సూచించారు. మనం ఆమోదించబోయే బడ్జెట్‌ తిరుపతి నగర భవిష్యత్తుకు దిక్సూచిగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తిరుపతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

పెరిగిన రాబడికి అభివృద్ధే మూలం

భవన అనుమతులు, పన్నులు వంటి రూపంలో కార్పొరేషన్‌కు రూ. 20 కోట్లకు మేర రాబడి పెరగడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి మూలమని కార్పొరేటర్‌ రామస్వామి వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. 22 మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధితో నగర విస్తరణ శరవేగంగా జరుగుతోందన్నారు. తద్వారా కార్పొరేషన్‌కు భవన అనుమతులు ఆస్తి పన్నులు రూపంలో ఆదాయం విస్తారంగా పెరిగిందన్నారు. రాబోవు రోజుల్లో నగర తూర్పు ప్రాంతం ఆదాయ వనరుగా మారుతుందన్నారు. తిరుపతి అభివృద్ధిలో భూమన అభినయ్‌ చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ఈట్‌ స్ట్రీట్‌ ప్రతిపాదన తమ ప్రభుత్వానిదేనని, అయితే ఇందుకోసం మాస్టర్‌ పాన్‌ రోడ్లలో శాశ్వత నిర్మాణం చేపట్టడం సరైనది కాదన్నారు.

గ్రేటర్‌ తిరుపతి తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్‌

44 అజెండాలకు ఆమోదం

కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో 44 అజెండాలకు ఆమోదం లభించింది. ఇందులో పరిపాలన అంశాలతోపాటు ఉద్యోగుల పదోన్నతులు, అభివృద్ధికి సంబంధించిన పలు అజెండాలు ఉన్నాయి.

కౌన్సిల్‌ సమావేశానికి వచ్చే వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్లకు తనిఖీల పేరుతో అడుగడుగున అవమానం చేశారని కోఆప్షన్‌ సభ్యులు ఇమామ్‌ సాహెబ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కులను కాలా రాసేలా తనిఖీలు నిర్వహించారని ఆయన మండిపడ్డారు. ఇది ముమ్మాటికి చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. కార్పొరేటర్లతో పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరమని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తారని ఆయన గుర్తు చేశారు. అయితే కౌన్సిల్లోకి వెళ్లేందుకు కార్పొరేటర్లకు పోలీసులు తనిఖీల పేరుతో చుక్కలు చూపించడం సరైంది కాదన్నారు. అంతకుముందు కార్పొరేటర్లను మూడు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు, నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement