‘నవ’ మోసాలు | Teachers are concern through social media | Sakshi
Sakshi News home page

‘నవ’ మోసాలు

May 31 2025 4:46 AM | Updated on May 31 2025 4:47 AM

Teachers are concern through social media

సామాజిక మాధ్యమాల వేదికగా ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులు

తెరపైకి తొమ్మిది రకాల పాఠశాలలు  

ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని మంత్రి నారా లోకేశ్‌కి లేఖలు 

తొమ్మిది అంశాలతో సంతకం చేసిన లేఖలతో మెయిల్స్, వాట్సాప్‌  సందేశాలు

అవనిగడ్డ: జీవో 117ని రద్దు చేయకుండా రెక్టిఫికేషన్‌ పేరుతో పాఠశాలల సంఖ్యను తొమ్మిది రకాలుగా మార్చడాన్ని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న చేతలకు పొంతన లేని తీరుపై వారు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యమమే సరైన మార్గమని, లేకపోతే భవిష్యత్‌ లేదని ఉపాధ్యాయులంతా ఏకమవుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఉద్యమబాటకు సై అంటున్నారు.   

నాటి లోకేశ్‌ వీడియో వైరల్‌ 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడిన వీడియోని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ చేస్తున్నారు. గౌరవ శ్రీనారా లోకేశ్‌ గారు ఎన్నికలకు ముందు..అంటూ ఇంగ్లిష్, తెలుగు మీడియం ఆప్షన్‌పై మాట్లాడిన వీడియో ఉపాధ్యాయ సంఘాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది. అలాగే తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంపై ఆనాడు పవన్‌ కళ్యాణ్‌ ఎలా మాట్లాడారు? ఇప్పుడెలా స్పందిస్తున్నారనే వీడియో సైతం అందరి గ్రూపుల్లో ప్రత్యక్షమవుతోంది.   

సంతకాలతో మంత్రి లోకేశ్‌కు లేఖలు
ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(ఏపీటీఎఫ్‌) యూని­యన్‌ నేతలు ఒకడుగు ముందుకేసి 9 అంశాలపై సంతకాలు చేసిన లేఖలను మంత్రి నారా లోకేశ్‌కు మెయిల్స్, వాట్సాప్‌ల ద్వారా పంపిస్తున్నారు.  

ప్రకాశం జిల్లా ఉపాధ్యాయుల వాట్సాప్‌ లేఖ 
సీఎస్‌పురం(పామూరు): ప్రభుత్వ పాఠశాలల పరి­రక్షణ కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యా­శాఖ మంత్రి నారాలోశ్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వాట్సాప్‌ ద్వారా విజ్ఞప్తులశ్‌పంపారు. అన్ని గ్రామాల్లో 1 నుంచి 5 తరగతులకు ప్రాథమిక పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలంటూ పలు అంశాలపై ఏకరువుపెడుతూ వాట్సాప్‌ చేశారు.  విద్యార్థులకు తెలుగు, ఇంగ్గిష్‌ మాద్యమాలను కొనసాగించాలని కోరారు. 

ఎస్‌జీటీలకు పీఎస్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు, ఉన్నతపాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఉన్నత పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలంటూ వాట్సాప్‌ ద్వారా మంత్రికి వినతులు పంపినట్లు ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌.నాయబ్‌రసూల్, సీఎస్‌పురం మండలశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాసులు, జె.ఎస్‌.ఆనంద్‌బాబు పేర్కొన్నారు.  

ఆ తొమ్మిది అంశాలివే
1. ప్రతి గ్రామంలో ప్రతిపాదిత ఫౌండేషన్‌ స్కూల్‌ స్ధానంలో 1 నుంచి 5 తరగతు­లుండేలా ప్రాథమిక పాఠశాలలు విధిగా కొనసాగించాలి. విద్యార్థుల సంఖ్యతో నిమి­త్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండాలి. 
2. విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం కోసం తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాలను కొనసాగించాలి. మైనారిటీ భాషల మాధ్యమాలను కొనసాగించాలి. 
3. ఎస్‌జీటీలకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి కల్పించాలి.  
4. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులు దాటితే 5 ప్లస్‌ 1 ఉపాధ్యాయులను నియమించాలి.
5. ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులను విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలి. 
6. ప్రతిపాదిత ప్రభుత్వ ఉత్తర్వు 21లో ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పడనున్న 40 పీరియడ్ల భారాన్ని 32 పీరియడ్‌లకు మించకుండా చూడాలి. 
7. ఉన్నత పాఠశాలలో 45 మంది విద్యార్థులు దాటిన చోట రెండో సెక్షన్‌ ఏర్పాటు చేయాలి. 
8. క్లస్టర్లలో ఉపాధ్యాయులు మిగులు చూపించకుండా వారిని విద్యార్థుల  సంఖ్యను బట్టి అవరోహణ క్రమం 
(ఎక్కువ నుంచి తక్కువ స్థాయి)లో పాఠశాలలకు కేటాయించాలి. 
9. పెరిగిన జనాభా మేరకు మునిసిపాలిటీ, కార్పొరేషన్, నూతనంగా వెలిసిన ఆవాసాలతో నూతన పాఠశాలలను ఏర్పాటు చేయాలి.   

Advertisement
 
Advertisement
Advertisement