సమావేశానికి హాజరైన పెనుమాక రైతులు
రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూపించాలని మేమే పిలిచాం
అమరావతిలో అక్రమాలు, దోపిడీ బయటపడతాయనే వారిని అడ్డుకున్నారు
అవసరమైతే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా రమ్మని కోరతాం
మా పొలాలను అన్యాయంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది
అందుకోసం చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తోంది
పొలాలు ఇవ్వకపోతే గోతులు తీస్తున్నారు.. దారులు మూసేస్తున్నారు
ప్రభుత్వ అరాచకాలపై వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు.. న్యాయస్థానాల్లో పోరాడుతాం
వైఎస్సార్‌సీపీ కమిటీని మళ్లీ రప్పిస్తాం
దాడి నేపథ్యంలో గట్టిగా బదులిచ్చిన అమరావతి రైతులు
తాడేపల్లి రూరల్: పొలాలకు దారులు మూసేయడం, రిజర్వాయర్ల పేరిట 30 నుంచి 40 అడుగుల లోతున గోతులు తవ్వి పంటలను ముంచేయడం వంటి ప్రభుత్వ అరాచకాలను చూపించడానికి తామే వైఎస్సార్‌సీపీ ప్రతినిధులను పెనుమాక గ్రామానికి ఆహ్వానించామని అమరావతి రైతులు స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. తమ సమస్యలు దేశానికే కాదు, ప్రపంచానికి తెలియాలంటే ఇలాంటి వారి సహకారం అవసరమని చెప్పారు.
అమరావతిలో ప్రభుత్వ అరాచకానికి గురవుతున్న రైతుల పొలాలను పరిశీలించడానికి బాధిత రైతుల ఆహ్వానం మేరకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను శనివారం ఉండవల్లి సెంటర్‌లో టీడీపీ గూండాలు అడ్డుకుని దాడి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు ప్రభుత్వం తమను ఏ విధంగా వేధిస్తోందో వివరించారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదని, తమకు న్యాయం చేసే ఏ పార్టీ వారినైనా కలుస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కమిటీని అధికార పార్టీ అడ్డుకుని దాడులకు తెగబడటం అమానుషం, అప్రజాస్వామికమని మండిపడ్డారు.
అమరావతిలో జరుగుతున్న దారుణాలు బాహ్య ప్రపంచానికి తెలియకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడిందన్నారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు 2015 ఫిబ్రవరి 28 నాటికే ముగిసిందని, ఆ తర్వాత భూ సేకరణ మాత్రమే చేయాలని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా ఇప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ కిందే భూములు లాక్కుంటామని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. పరిహారం రూ.5 లక్షలు, రూ.10 లక్షలే వస్తుందని భయపెడుతున్నారని, భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు.
రిజిస్ట్రేషన్లు ఆపేశారని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ అందకుండా చేసి రైతులను ఆర్థికంగా, సామాజికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి ప్రభుత్వ సాయం లేకపోయినా 60 ఏళ్లుగా మూడు పంటలు పండించే అద్భుతమైన భూమిని ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, బెదిరింపులకు పాల్పడినా, అలైన్‌మెంట్లు మార్చినా తగ్గేదే లేదని, ప్రభుత్వ చట్టవిరుద్ధ విధానాలపై పోరాడతామని గట్టిగా చెప్పారు. వైఎస్సార్‌సీపీ అమరావతి రైతు పరిరక్షణ కమిటీని మళ్లీ ఇక్కడికి రప్పించి మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. రైతులు ఇంకా ఏం మాట్లాడారంటే..
రోడ్ల అలైన్‌మెంట్లు మారుస్తూ కుట్రలు
రోడ్ల అలైన్‌మెంట్లు మా పొలాల మీదుగా మార్చేస్తూ కుట్రలు చేస్తున్నారు. ఒక వ్యక్తి పొలం ఇవ్వగానే దాన్లో రోడ్డు వేస్తున్నారు. ఆ రోడ్డును పక్క భూమిలోకి జరిపేస్తున్నారు. ఆ రైతును బెదిరించి పొలం తీసుకోగానే, దాని పక్కన ఎవరైతే భూమి ఇవ్వలేదో వారి పొలంలోకి వెళ్తున్నారు. ఇలా రైతుల భూమి ఇవ్వక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. వందల ఏళ్ల నాటి పాత రోడ్లను మూసేశారు. కరెంట్ స్తంభాలు పడగొట్టారు. అమరావతిలో ఏదో జరుగుతోందని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగేది రెండే రెండు... ఒకటి కంప చెట్లు కొట్టడం, రెండోది నీళ్లు ఎత్తి పోయడం. వేరే ఏమీ లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటూ ఇటూ తప్ప లోపల ఎక్కడా ఎటువంటి అభివృద్ధీ లేదు.
అంతా మోసపూరితం
ప్రభుత్వం తీరు అంతా మోసపూరితమే. పొలాలు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ప్లాట్లు ఎక్కడిస్తారో క్షేత్రస్థాయిలో చూపించరు. అంతా కాగితాల మీదే. పైగా ల్యాండ్ పూలింగ్ నిబంధనల్లో ‘అవసరమైతే ఈ ఇచ్చిన భూమిని కూడా మళ్లీ గవర్నమెంటే తీసుకుంటుంది‘ అని ఉంది. అంటే 70 శాతం ఉచితంగా తీసుకుని, మిగిలిన 30 శాతం కూడా ఇవ్వకుండా లాగేసుకుంటారా? ఈ విషయాన్ని నిబంధనల్లో ఎందుకు స్పష్టంగా పెట్టలేదు? గ్రామసభలు పెడితే అవి భూములు ఇవ్వని రైతుల కోసమా, ఇచ్చిన వారి కోసమా అనే క్లారిటీ అధికారులకే లేదు.
సాయంత్రం 6 గంటలకు నోటీసు ఇచ్చి, మరుసటి రోజే మీటింగ్ అంటే అభ్యంతరాలు ఎలా చెప్పగలుగుతారు? ఏదైనా సమస్య వస్తే డిప్యూటీ కలెక్టర్‌ను అడిగితే ఆయనకేం తెలియదని, పొలం ఇస్తే తీసుకుంటామని అంటారు. కమిషనర్‌ను అడిగితే ఆయనకేమీ తెలియదని అంటారు. ఏమీ తెలియని కమిషనర్ ఇక్కడికి వచ్చి రైతులకు ఏం చెబుతారు? పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇష్టం వచ్చినట్లు భూములు లాక్కోవడానికి వీల్లేదు.
ఆ చట్టాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించి, మమ్మల్ని వేధింపులకు గురిచేస్తోంది. స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన భూములే తీసుకుంటానని, ఇవ్వని వారి జోలికి పోనని చంద్రబాబు ప్రమాణం చేశారు. మరి ఇప్పుడు అధికారులు ఆయనకు తెలియకుండానే నోటీసులు ఇస్తున్నారా? వీటిపై పాలకులు, కలెక్టర్, సీఆర్డీఏ కమిషనర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – కొండమడుగుల రాఘవరెడ్డి, పెనుమాక
క్షేత్రస్థాయిలో మా సమస్యలు చూపించాలని రమ్మన్నాం
ఉండవల్లి, పెనుమాక, ఎర్రపాలెం, నిడమర్రు గ్రామాల రైతులమంతా కలిసి 25 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మా సమస్యలన్నీ వివరించాం. అండగా నిలవాలని అభ్యర్థించాం. మాకు అండగా ఉండటానికి లీడర్లు, లాయర్లతో ఒక టీమ్ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
వైఎస్ జగన్ 2024లోనే రోడ్లకి క్లియర్ చేసి మా పొలం మాకు విడిచిపెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్లనీయడంలేదు. పొలాల చుట్టూ చెరువు తీస్తోంది. ఈ దారుణాలన్నీ చూపించాలనే మేము వైఎస్సార్‌సీపీ బృందాన్ని రమ్మన్నాం. కానీ వైఎస్సార్‌సీపీ నాయకులను అమరావతి రాకుండా అధికార పార్టీ అడ్డుకున్నదంటే ఇక్కడ జరుగుతున్న తప్పులు బయటపడకుండా, వాటిని కప్పిపుచ్చుకోవడానికే రానివ్వట్లేదని అర్థం. – మేకా వెంకటరెడ్డి, పెనుమాక
కోర్టు ఆదేశానుసారం పరిహారం ఇవ్వకపోగా, నోటీసులిచ్చారు
ల్యాండ్ పూలింగ్ యాక్ట్ 2015 ఫిబ్రవరి 28తో ముగిసిపోయినా, ఇప్పటికీ పూలింగ్‌లోనే తీసుకుంటాం అంటున్నారు. భూములు ఇవ్వని వాళ్లను వేధిస్తున్నారు. ప్రభుత్వం కోర్టులో కేసు ఉపసంహరించుకొనే సమయంలో 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లుగా రిజి్రస్టేషన్లు ఆపేసి, ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నష్ట పరిచినందుకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది.
కానీ ఆ పరిహారం ఇవ్వకపోగా మళ్లీ భూ సేకరణ నోటీసులు ఇచ్చారు. అసలు మొదటి డీపీఆర్ ప్రకారం ఉండవల్లి, పెనుమాక అమరావతి పరిధిలోనే లేవు. చివర్లో యాడ్ చేసి మా భూములను లాక్కుంటున్నారు. సీఆర్డీఏ అధికారులు అక్విజిషన్ గురించి చెప్పకుండా, మళ్లీ పూలింగ్ గురించే మాట్లాడుతున్నారు. –నవీన్, పెనుమాక
మా గొంతు నొక్కాలని చూస్తే భయపడం
మా పొలాల పక్కన రిజర్వాయర్ల పేరుతో 40 అడుగుల లోతున గుంతలు తవ్వేస్తున్నారు, రోడ్లు ధ్వంసం చేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్కీములు అందకపోయినా, ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వ్యవసాయం చేస్తున్నాం. కేవలం 10 అడుగుల్లోనే భూగర్భ జలాలు ఉన్న అత్యంత సారవంతమైన భూమి ఇది. 60 ఏళ్లుగా ఇక్కడ మూడు పంటలు పండిస్తూ అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పటికే రాజధాని కోసం 50 వేల ఎకరాలు తీసుకున్నారు. అక్కడ రాజధాని కట్టుకోండి. అంతేకానీ, సారవంతమైన భూములను ధ్వంసం చేయొద్దు. మా గొంతు నొక్కాలని చూసినా భయపడం. పోరాడుతూనే ఉంటాం. –శ్రీకాంత్, పెనుమాక


