Polavaram: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం నో | SC No Relief To Centre Over Polavaram Petition | Sakshi
Sakshi News home page

పోలవరంపై కేంద్రం పిటిషన్‌: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం కోర్టు నిరాకరణ

Dec 11 2023 2:53 PM | Updated on Dec 11 2023 3:08 PM

SC No Relief To Centre Over Polavaram Petition - Sakshi

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్‌ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

సాక్షి, ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పిటిషన్‌ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు సదరు పిటిషన్‌ను బదిలీ చేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీ హైకోర్టుకే వెళ్లాలని సూచిస్తూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సోమవారం కొట్టేసింది.  

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్రం 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ  పిటిషన్‌ను సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  

ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం ఏపీ హైకోర్టుకే వెళ్లాలని సూచిస్తూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement