సాక్షి,గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని బీబీ గూడెం వద్ద విజయవాడ పశ్చిమ బైపాస్‌పై మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల కుమారుడు సహా తల్లి, మరో వ్యక్తి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలపర్రు గ్రామానికి చెందిన జయమంగళ వెంకటవిజయ్‌కుమార్, వెంకటరాజు సోదరులు పొక్లెయిన్లు నడుపుతుంటారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి తల్లి రమాదేవి చూసేందుకు కుటుంబ సభ్యులతో కారులో వచ్చారు.
వెంకరాజు భార్య, పిల్లలు ఆస్పత్రి వద్ద ఆగిపోగా, మిగిలిన వారు కైకలూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతీయ రహదారి పశ్చిమ బైపాస్‌పై బీబీ గూడెం సమీపంలోకి రాగనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ముందు టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ట్యాంకర్ లారీతో పాటు వీరి కారును ఢీకొట్టి కొంత దూరం పాటు ఈడ్చుకువెళ్లింది.
ఈ ప్రమాదంలో కంటైనర్, ట్యాంకర్ మధ్య కారు ఇరుక్కుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో వెనుక సీటులో కూర్చోన్న వెంకటవిజయ్‌కుమార్ భార్య బాలవెంకటనాగదుర్గ (28), కుమారుడు కారుణ్య నాగసాయి(4) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలోనే ట్యాంకర్ లారీ ఢీకొని స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన హోటల్ కార్మికుడు దాసరి వెంకటేశ్వరరావు (49)కు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు.
కారు నడుపుతున్న వెంకటరాజు, ముందు సీట్లో కూర్చున్న వెంకటవిజయ్‌కుమార్ గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న గన్నవరం సీఐ బి.వి.శివప్రసాద్, పలువురు ఎస్‌ఐలు, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంకటేశ్వరరావుతో పాటు కారులో ఇరుక్కుపోయిన తల్లి, కుమారుడి మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ సంఘటనతో పశ్చిమ బైపాస్‌పై గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాలను పోలీసులు, హైవే సిబ్బంది పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.


