చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు! | The Rising Trend of Putting Everything in Order Before Suicide | Sakshi
Sakshi News home page

చివరి క్షణాల్లో.. ‘అన్నీ సర్దేసి’ వెళ్లిపోతున్నారు!

Jun 22 2026 11:22 AM | Updated on Jun 22 2026 11:46 AM

The Rising Trend of Putting Everything in Order Before Suicide

ఆత్మహత్యకు ముందు ఆస్తుల పంపకం, అప్పుల వివరాలు, బ్యాంక్‌ ఖాతాల వివరాలు.. అంతెందుకు ఏటీఎం, ఫోన్‌పే పిన్‌ల సమాచారం.. డెత్‌నోట్‌లో రాసేసి మరీ వెళ్లిపోతున్న ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఆఖరికి అంత్యక్రియల ఖర్చులు కూడా కుటుంబమో, బంధువులకు భారం కాకూడదనే ఆలోచనతో చివరి క్షణాలకు ముందే అన్నీ ముందుగానే సర్దేసి వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి!. ఎందుకిలా?.. మానసిక నిపుణులు ఏమంటున్నారంటే..

చిత్తూరు జిల్లాలోని బంగారెడ్డి పల్లి ప్రాంతంలో దాము అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్య అనారోగ్యం కారణంగా కుటుంబం ఆర్థికంగా కుంగిపోయిన పరిస్థితుల్లో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మరణానికి ముందు ఆయన ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు ఏటీఎం పిన్‌ నెంబర్‌ వంటి వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని కూడా డెత్‌నోట్‌లో నమోదు చేసినట్లు సమాచారం. దానిని టీవీ స్క్రీన్‌కు అంటించారాయన.

ఇలాంటి ఘటన ఒక్కటే కాదు. ఇటీవల నెల్లూరు జిల్లాలో రిటైర్డ్ టీచర్ దంపతులు కొడుకుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. తాము లేకుండా చెట్టంత కొడుకు బతకలేడనే ఉద్దేశంతో అతన్ని కూడా వాళ్లు తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబానికి భారంగా మారకూడదనే ఆలోచనతో వారు అంత్యక్రియల ఖర్చుల కోసం ముందుగానే ఏర్పాట్లు చేయడం, కొంత ఆస్తిని దానం చేయడం, బ్యాంక్‌ లావాదేవీల వివరాలు సైతం రాసి పెట్టడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.

విజయవాడ సహా కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. నార్త్‌ ఇండియాలోనూ ఈ తరహా ఘటనలు నమోదవుతుండటంతో ఇది ఒక “కొత్త ధోరణి”గా మారుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ఘటనల్లో ఒక సాధారణ మానసిక నమూనా కనిపిస్తోంది.. తాము లేకపోయినా కుటుంబం/తమకు మేలు చేసిన వాళ్లు ఇబ్బంది పడకూడదు అనే భావన. ఇదే ఆలోచనలో వ్యక్తులు తమ ఆర్థిక వ్యవహారాలను చివరి క్షణాల్లో పూర్తిగా క్రమబద్ధం చేసి వెళ్తున్నారు. ఇది బయటకు చూసేందుకు బాధ్యతగా కనిపించినా, నిపుణులు మాత్రం దీన్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తున్నారు.

ఈ తరహా ధోరణిపై మానసిక నిపుణులు స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా దీర్ఘకాలిక నిరాశ (depression), తీవ్ర ఆందోళన (anxiety), “నిరాశాత్మక ఆలోచనా విధానం” (hopeless thinking pattern) వల్ల వస్తాయి. సమస్యలకు పరిష్కారం కనిపించకపోవడం, అప్పుల భారం, అనారోగ్యం, కుటుంబ బాధ్యతల ఒత్తిడి.. ఇవన్నీ కలిసి వ్యక్తిని “తప్పించుకోవడమే మార్గం” అనే భావన వైపు నెట్టేస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇది ఒక రకమైన కాగ్నిటివ్ టన్నెల్ విజన్ అని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యక్తి తన సమస్యలకు ఒక్కటే పరిష్కారం కనిపించడం, ఇతర సహాయ మార్గాలు కనిపించకపోవడం. ఈ దశలో సహాయం కోరే అవకాశం ఉన్నా, దాన్ని ఉపయోగించలేని స్థితి ఏర్పడుతుందని వారు వివరిస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక ఏంటంటే..  ఆత్మహత్యకు ముందు ఇలా అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోవడం బయటకు బాధ్యతగా కనిపించినా, వాస్తవానికి అది తీవ్రమైన మానసిక సంక్షోభానికి చివరి సంకేతమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ దశలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం త్వరగా స్పందించడం చాలా కీలకమని సూచిస్తున్నారు.

ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, జీవన ఒత్తిడులు ఏవైనా కావొచ్చు. కానీ, వాటికి పరిష్కారం జీవితం ముగించడం కాదు. “అన్నీ సర్దేసి వెళ్లిపోవడం” వెనుక కనిపించని మానసిక పోరాటం ఉంటుంది. ఆ సంకేతాలను ముందుగానే గుర్తించి సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement