
ఈ చిత్రంలోని వ్యక్తి విశాఖ జిల్లా ముచ్చర్లకు చెందిన చెరుకూరి గున్నేష్ 23 ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఇతనికి సైతం కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ నిలిపేసింది.
అనర్హులంటూ దాదాపు లక్ష మంది దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు
వీటిని అందుకున్న వారిలో పెన్షన్ కోసం తీవ్ర ఆందోళన
వారికి సొమ్ము పంపిణీపై రోజుకో రీతిలో సర్కారు వైఖరి..
పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామంటూ అనుకూల మీడియాలో లీకులు
దివ్యాంగులు కాని వారికి, దొంగలకు పింఛన్లు ఇస్తున్నారంటూ స్వయంగా ప్రచారానికి తెర తీసిన సీఎం చంద్రబాబు
నెల రోజులుగా కునుకు కరువైన దివ్యాంగ లబ్ధిదారులు
సాక్షి, అమరావతి: అనర్హుల పేరుతో నెల రోజులుగా కూటమి ప్రభుత్వం లక్షల సంఖ్యలో పంపుతున్న నోటీసులతో పింఛన్ లబ్ధిదారుల్లో కలకలం రేగుతోంది. నేడు పింఛన్ డబ్బులు అందుతాయో లేదో అంతు చిక్కక నోటీసులు అందుకున్న వారిలో గందరగోళం నెలకొంది. దివ్యాంగులు కానివారికి, దొంగలకు పింఛన్లు ఇస్తున్నారని... పెన్షన్లు తొలగిస్తామని స్వయంగా సీఎం చంద్రబాబే ఈ ప్రచారానికి తెర తీయడంతో వాటినే నమ్ముకుని బతుకీడుస్తున్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
గతంలో వైద్యులే ధ్రువీకరించి ఇచ్చిన సర్టీఫికెట్లు ఇప్పుడు చెల్లవని చెప్పడం ఏమిటని నివ్వెరపోతున్నారు. ఆయా లబ్ధిదారుల పెన్షన్లు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వారికి పంపుతున్న నోటీసుల్లోనే తేల్చి చెబుతోంది. దీంతో ఒకటో తారీఖు వచ్చిందంటే.. గతంలో సంతోషంగా పెన్షన్ల కోసం ఆరాటంగా ఎదురు చూసిన గ్రామాల్లో ఇప్పుడు ఆందోళన తాండవిస్తోంది. ఈ ప్రభుత్వం ఎవరి పింఛన్ ఎగరగొట్టిందోననే ఆదుర్దా నెలకొంది.
లక్ష పింఛన్లపై కత్తి..!
నెలనెలా చేతికందే పింఛను డబ్బులనే నమ్ముకుని జీవిస్తున్న దివ్యాంగులతో టీడీపీ కూటమి సర్కారు పూటకో రకంగా ఆటలాడుకుంటోంది. రాష్ట్రంలో మొత్తం 7.86 లక్షల మంది దివ్యాంగ పింఛను లబ్ధిదారుల్లో 5.50 లక్షల మందికి కొత్తగా వైద్య పరీక్షలు నిర్వహించగా దాదాపు లక్ష మంది అనర్హులుగా నిర్ధారణ అయినట్లు చెబుతుండటంతో నెల రోజులుగా కంటిపై కునుకు లేకుండా గడుపుతున్నారు. నోటీసులు అందుకున్న వారంతా సోమవారం చేపట్టనున్న సెపె్టంబరు నెల పింఛన్ల పంపిణీలో తమ చేతికి డబ్బులు అందుతాయో లేదో అనే భయాందోళనలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ హయాంలో ఇచ్చిన పింఛన్లతో పోలిస్తే టీడీపీ కూటమి సర్కారు వచ్చాక గత 15 నెలలలోనే ఏకంగా దాదాపు నాలుగున్నర లక్షల మేర పెన్షన్లు తగ్గిపోవడం గమనార్హం.
2011 జన గణన ప్రకారమే 12.19 లక్షల మంది దివ్యాంగులు..
కేంద్ర ప్రభుత్వం చివరిసారి దేశవ్యాప్తంగా నిర్వహించిన జనగణన వివరాల ప్రకారం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 12,19,785 మంది దివ్యాంగులున్నారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుతం మొత్తం దివ్యాంగులకిచ్చే పింఛన్లు 7,86,091 మాత్రమే. గత జనగణన నాటికి నాలుగేళ్ల వయసులో ఉన్నవారికి ప్రస్తుతం 18 ఏళ్లు నిండి ఉంటాయి. అంటే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల్లో మూడో వంతు కంటే ఎక్కువ మందే ఇంకా పింఛన్లు పొందడం లేదని స్పష్టమవుతుంది. అయితే రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ సీఎం చంద్రబాబు స్వయంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. పింఛన్లను ఎగరగొట్టేందుకే రీ వెరిఫికేషన్ చేపట్టి దీన్ని ప్రచారంలోకి తెచ్చినట్లు స్పష్టమవుతోంది.
పంపిణీపై సందిగ్ధం..
అనర్హుల పేరిట దాదాపు లక్ష మంది దివ్యాంగ పింఛనుదారులకు నోటీసులు జారీ చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం సెపె్టంబరు నెలలో వారి పింఛన్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ప్రతి చోటా దివ్యాంగ పింఛన్‌దారులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతుండడంతో ఉలిక్కిపడింది. పింఛన్ల పంపిణీ చేపట్టే సెర్ప్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ నోటీసులిచ్చిన వారికి తిరిగి వైద్య పరీక్షలు జరిగి కొత్తగా అర్హులుగా తేలితే పింఛను పునరుద్ధరణ ఉంటుంది.. అప్పటిదాక ఆగిపోతుందని చెప్పారు. అయితే పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా పంపిణీ చేయనున్నట్లు టీడీపీ అనుకూల మీడియాకు లీకులిచ్చింది. దీంతో నోటీసులు అందుకున్న లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొంది.

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కొత్త వెంకటాపురంలో నివసించే గురజాల గోపినాయుడు చిన్నతనంలో పోలియో సోకడంతో రెండు కాళ్లు కోల్పోయాడు. ఊహ కూడా తెలియని వయసులో అతడి భవిష్యత్తుతో విధి ఆడుకుంది. తండ్రి దేవేంద్రనాయుడు పొలంలో పాము కాటుకు గురై రెండు కళ్లు కోల్పోయాడు. తల్లి జయమ్మకు వెన్నెముక సమస్యతోపాటు సరిగా వినపడదు.
ఆ కుటుంబంలో ముగ్గురి వద్దా వైద్యాధికారులు ధ్రువీకరించిన సదరం సర్టీఫికెట్లు ఉన్నాయి. దేవేంద్రనాయుడు, గోపినాయుడు దశాబ్దాలుగా పింఛన్‌లు పొందుతుండగా వాటిని తొలగిస్తున్నట్లు ఇటీవల అధికారులు నోటీసులు పంపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వద్ద చిన్నబంకు నిర్వహిస్తున్న దివ్యాంగుడు గోపినాయుడును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు బెదిరించి వెళ్లగొట్టారు. ఇటు బతుకు దెరువుకోల్పోయి.. అటు పింఛన్లు రద్దై ఎలా బతకాలో అంతుబట్టడం లేదని ఆ కుటుంబం చిత్రవధకు గురవుతోంది.
జగన్ హయాంలో సులభంగా సదరం సరిఫికెట్ల జారీ..
దివ్యాంగులకు అర్హత ఉండి పింఛను పొందాలంటే ముందుగా వైకల్యాన్ని నిర్ధారిస్తూ వైద్యులు సదరం సర్టీఫికెట్లు జారీ చేయాలి. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఇది పెద్ద ప్రహసనంగా ఉండేది. దీనికి హాజరు కాలేక, ఆ తిప్పలు పడలేక టీడీపీ పాలనలో చాలా మంది దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందలేకపోయారన్న విమర్శలున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యాంగ పింఛన్ల మంజూరులో కీలకమైన సదరం సర్టీఫికెట్ల జారీ ప్రక్రియను సరళతరం చేశారు. అర్హులైన వారికి సదరం సర్టీఫికెట్ల జారీకి వీలుగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి మూడు నెలలకు స్లాట్లను విడుదల చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల్లో బుకింగ్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది.
సదరం సర్టీఫికెట్ల జారీ పెరగడంతో అర్హులైన దివ్యాంగులు కొత్త పింఛను పొందడానికి వీలు ఏర్పడింది. దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల మంజూరు, ధ్రువపత్రాల జారీలో గత ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా 29.51 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) గతంలో ప్రకటించింది. ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ నిరంతర ప్రక్రియగా చేపట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 2.07 లక్షల మంది దివ్యాంగులకు కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం స్వయంగా విలేకరుల సమావేశంలోనే చెప్పారు.

తల్లిదండ్రులు లేరు ఆపై వైకల్యం
వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ఉంటున్న సాకె సాయిలక్ష్మి పుట్టుకతోనే మూగ, చెవుడు బాధితురాలు. కంటి చూపులో లోపాలున్నాయి. 15 ఏళ్ల క్రితమే ఆమె తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో చిన్నాన్న రామాంజనేయులు వద్ద ఉంటోంది. 2005 నుంచి ఆమెకు దివ్యాంగ పింఛన్ వస్తోంది. కూటమి ప్రభుత్వం సాయిలక్ష్మీ పింఛన్‌ను తొలగిస్తూ నోటీసు పంపింది. స్పష్టంగా మూడు శారీరక లోపాలు ఉన్నప్పటికీ రీ వెరిఫికేషన్ పేరుతో వైకల్యం 20 శాతమేనంటూ నిర్ధారించడం గమనార్హం.

కాలు తొలగించారు
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుడ్డంగి (గాలగొండ)లో నివసిస్తున్న గిరిజనుడు పూజారి నానాజీ నాయుడుకి ముల్లు గుచ్చుకుని సెప్టిక్ కావడంతో కాలు తొలగించారు. ఆయనకు 90 శాతం అంగవైకల్యం ఉన్నట్లు 2022 ఆగస్టులో వైద్యులు ధ్రువీకరిస్తూ సర్టీఫికెట్ జారీ చేశారు. అప్పటి నుంచి రూ.6 వేలు పెన్షన్ పొందుతున్నాడు. గత ప్రభుత్వంలోనే ఆ కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు కావడంతో కొంత భాగం నిర్మాణం కూడా జరిగింది. తాజాగా రీ వెరిఫికేషన్ అనంతరం ఆయనకు 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉందని, పింఛన్ తొలగిస్తున్నామంటూ ఆగస్టు 14న జి.మాడుగుల ఎంపీడీవో నోటీసు జారీ చేశారు.

కాలు తొలగించినా.. వైకల్యం తాత్కాలికమట..
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం సాతానువారిపాళేనికి చెందిన దివ్యాంగుడు అశోక్‌కుమార్‌కు ఓ ప్రమాదంలో కాలు పూర్తిగా దెబ్బ తినడంతో తొలగించారు. ఒంటి కాలిపై ఊత కర్ర సాయంతో కాలం వెళ్లదీస్తున్నాడు. ఆయనకు 59 శాతం వైకల్యం ఉందంటూ 2015లో జిల్లా ఆస్పత్రి నుంచి సదరం సర్టిఫికెట్ ఇవ్వడంతో దివ్యాంగ పింఛన్ పొందుతున్నారు. రీ వెరిఫికేషన్ అనంతరం ఆయన పింఛన్ రద్దు చేస్తున్నట్లు కూటమి సర్కారు ప్రకటించింది. మోకాలి వరకు ఒక కాలు పూర్తిగా తొలగించినా.. అది తాత్కాలిక వైకల్యమని నోటీస్‌లో పేర్కొనడం పట్ల ఆ కుటుంబం నివ్వెరపోతోంది. తానెలా బతకాలంటూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆక్రోశిస్తున్నాడు.

23 ఏళ్లుగా ఘనాహారం లే దు..
విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల పంచాయతీకి చెందిన చెరుకూరి గున్నేష్ పుట్టుకతోనే ఉలుకు పలుకు లేకుండా మంచానికే పరిమితమయ్యాడు. 23 ఏళ్లుగా ఘనాహారం తీసుకున్నది లేదు. ఆహారం గొంతు దిగని కారణంగా నిత్యం పాలే ఇస్తుంటారు. 2008లో వైఎస్సార్ హయాం నుంచి దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నాడు. ప్రస్తుతం రూ.6 వేలు వస్తుండగా దాన్ని హఠాత్తుగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రోజుకు నాలుగు లీటర్లు పాలు ఆహారం కింద ఇచ్చేందుకు నెలకు దాదాపు రూ.9 వేలు దాకా ఖర్చు అవుతోంది. ఇంట్లోవారినే గుర్తించలేక మంచాన పడ్డ పిల్లాడి పెన్షన్ ఆపడం ఈ ప్రభుత్వం చేస్తున్న పాపం కాదా? అని నానమ్మ సన్యాసమ్మ ప్రశి్నస్తోంది.

మంచంలోనే అన్నీ.. 40 శాతమే వైకల్యమంట!
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి బధిరుడు.. ఆపై అంగవైకల్యం.. మతిస్థిమితం లేదు. మల మూత్రాలు వచ్చినా చెప్పలేడు. మంచంలోనే అన్నీ.. నాలుగేళ్లుగా దివ్యాంగ పింఛన్ పొందుతుండగా 90 శాతం ఉన్న వైకల్యాన్ని ప్రభుత్వం ఇటీవల 40 శాతానికి మార్చేసింది. ఏకంగా పింఛన్‌ను ఎత్తివేస్తున్నట్లు నోటీసు ఇవ్వడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగపాలెం గ్రామానికి చెందిన మొగల్ షబ్బీర్, సోనీ దంపతుల దయనీయ పరిస్థితి ఇదీ! తమ కుమారుడు మొగల్ మహమ్మద్ రసూల్‌ను పుట్టుకతోనే వైకల్యం వెంటాడితే కూటమి సర్కారు పింఛన్ తొలగించి పొట్టగొడుతోందని కూలి పనులకు వెళ్లి జీవిస్తున్న ఆ కుటుంబం ఆక్రోశిస్తోంది.

కుడికాలు, చెయ్యి పనిచేయవు
బాపట్ల మండలం కొండు»ొట్లవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మల్లెల మనోజ్ పుట్టుకతోనే పోలియో బాధితుడు. కుడి కాలు, చెయ్యి పనిచేయవు. అతడి తల్లిదండ్రులు వలస కూలీలు. 70 ఏళ్ల వయసున్న నాయనమ్మ, చెల్లిపైనే ఆధారపడి రోజువారీ పనులు చేసుకోవాలి. అన్నం తినడంతోపాటు చిన్నచిన్న పనులన్నీ ఎడమ చేతితోనే. మనోజ్‌కు 76 శాతం వైకల్యం ఉన్నట్లు గతంలో తెనాలి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరణ పత్రం ఇవ్వగా అతడికి 18 శాతం వైకల్యం మాత్రమే ఉన్నట్లు ఇటీవల సదరం సర్టీఫికెట్ జారీ అయింది. నీ పింఛన్ తొలగిస్తున్నామంటూ తాజాగా ప్రభుత్వం నుంచి నోటీసు రావడంతో మనోజ్ మానసికంగా కుంగిపోతున్నాడు.
పెన్షనే ఆధారం..
మంచానికే పరిమితమైన 60 ఏళ్ల షేక్ జిలానీ ఆరేళ్ల క్రితం పక్షవాతానికి గురి కావడంతో కాలు, చేతులు పని చేయకుండా పోయాయి. కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా మంచం పైనుంచి లేవలేని పరిస్థితి. వితంతువు కావడంతో జిలానీ కుమార్తె కూడా తన పిల్లలతో కలసి ఆయన వద్దే ఉంటోంది. నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెంలో ఓ చిన్న ఇంట్లో ఉంటున్న వీరందరికీ ఆయన పెన్షనే ఆధారం. ఇన్నాళ్లూ రూ.15 వేలు పెన్షన్ పొందుతుండగా కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో వైకల్యాన్ని 59 శాతానికి తగ్గించి పెన్షన్ రూ.6 వేలకు కుదిస్తున్నట్లు నోటీసు పంపడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.
వైకల్యం ఆపై హృద్రోగం
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకలాం గ్రామానికి చెందిన పిల్ల చిన్నబాబుకు ఎడమ కాలు, చేయి పనిచేయదు. దీనికి తోడు గుండె ఆపరేషన్ జరిగింది. ఆయనకు 80 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ గతంలో వైద్యులు సదరం సర్టీఫికెట్ ఇచ్చారు. మూడేళ్ల నుంచి ఆయనకు దివ్యాంగ పింఛను వస్తోంది. ఆ డబ్బులే వారికి జీవనాధారం. రీ వెరిఫికేషన్ అనంతరం పింఛన్ రద్దు చేస్తామని తాజాగా ప్రభుత్వం నోటీసులు పంపడంతో ఆ కుటుంబంలో కలకలం రేగుతోంది.
శారీరక ఎదుగుదల లేదు
అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరుకు చెందిన ఈ బాలిక పేరు షేక్ కురవపల్లి ఆరీఫా. జన్యుపరమైన లోపాలతో జని్మంచింది. శరీరంలో సత్తువ లేదు. మెడ నిలబడదు. నడుములు పని చేయవు. ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటుంది. మాటలు కూడా రావు. తొమ్మిదేళ్ల వయసు వచ్చినా శారీరక ఎదుగుదల లేదు. ఆ చిన్నారికి వంద శాతం వైకల్యం ఉండటంతో ఇన్నాళ్లూ రూ.15 వేల దివ్యాంగ పింఛన్ అందేది. ఇటీవల రీవెరిఫికేషన్‌లో భాగంగా దాన్ని రద్దు చేసి రూ.6 వేల పింఛన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు నోటీసులు ఇచ్చారు.
పుట్టుకతోనే మనోవైకల్యం
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామానికి చెందిన ఈ బాలుడి పేరు అరుణ్ తేజ్. పుట్టుకతోనే మానసిక వైకల్యం బారిన పడ్డాడు. జీవితాంతం అలాగే ఉంటుందని డాక్టర్లు నిర్ధారించారు. అరుణ్ తేజ్‌కు తోడుగా ఇంట్లో ఇప్పటికీ ఎవరో ఒకరు ఉండాల్సిందే. గత ప్రభుత్వంలో మానసిక దివ్యాంగుడి కోటాలో నెలకు రూ.3,000 పింఛన్ వచ్చేది. ఇప్పుడు 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉందని, పింఛన్ తొలగిస్తున్నామంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా మానవత్వం లేదా? అని ఆ కుటుంబం వాపోతోంది.