
రాజ్యలక్ష్మినే కాదు.. ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి
ఇదీ పోలీస్ శాఖలో బిగ్‌బాస్ మాట
డీఎస్పీలకు అదనపు ఎస్పీల పదోన్నతిలో మెలిక
అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నంబర్ వెల్లడి
అది కేవలం 10 శాతమేనని సదరు కార్యాలయం స్పష్టీకరణ
దీంతో ఆగస్టు 31తో ప్యానల్ గడువు ముగిసినా స్పందన లేదు
సాక్షి, అమరావతి: ‘రాజ్యలక్ష్మిని మాత్రమే ప్రసన్నం చేసుకుంటే సరిపోదు.. ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి’ ఇదీ పోలీసు శాఖలో బిగ్ బాస్ తాజా ఉవాచ. అదీ అదనపు ఎస్పీ పదోన్నతి కోసం నిరీక్షిస్తున్న డీఎస్పీలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విస్మయ పరుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసు శాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం.
కాంట్రాక్టు పనుల్లో భారీ కమీషన్లు కొల్లగొట్టడం.. భూ సెటిల్‌మెంట్లు, అక్రమ కేసులతో వేధింపులు, వ్యాపార పారిశ్రామికవేత్తల నుంచి బలవంతపు వసూళ్లతో పోలీసు శాఖ హడలెత్తిస్తోంది. కాగా పోలీసు బాస్‌ల అవినీతికి పోలీసు అధికారులే బాధితులుగా మారడం తాజా పరిణామం. ముడుపులు ముట్టే వరకు డీఎస్పీ స్థాయి నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతులు కల్పించకుండా ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తుండటం విభ్రాంతికరం.
ప్యానల్ గడువు ముగిసినా స్పందనే లేదు
⇒ రాష్ట్రంలో డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీల పదోన్నతుల కల్పన పెండింగులో ఉంది. అందుకోసం ప్యానల్ జాబితాను ఖరారు చేసి నెలలు గడుస్తున్నా పద్నోన్నతులు కల్పించడం లేదు. ఆ ప్యానల్ గడువు ఆగస్టు 31తో ముగిసింది. దీంతో మళ్లీ కొత్తగా ప్యానల్‌ను రూపొందించాలి. ఈ లోగా పదోన్నతుల జాబితాలో ఉన్న కొందరు అధికారులు రిటైరైపోతారు. ఆగస్టు 31న కొంత మంది రిటైర్ అయ్యారు.
⇒ అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని ఆ ప్యానల్‌లో ఉన్న అధికారులు హోం మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. పోలీసు బిగ్‌బాస్‌కు పదే పదే విజ్ఞప్తి చేశారు. అదిగో చూస్తాం.. ఇదిగో చూస్తాం.. అంటూ కాలయాపనే తప్ప ఫలితం లేదు.
⇒ ఈ నేపథ్యంలో అసలు విషయం చల్లగా చెప్పారు. ‘రాజ్యలక్ష్మినే కాదు.. ధన లక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి’ అనే మాట పోలీసు ప్రధాన కార్యాలయంలో హల్‌చల్ చేసింది. ‘ప్రభుత్వ పెద్దలు చాలా చెబుతారు.. వారేమీ ఊరికే పోస్టింగు ఇవ్వలేదు కదా..’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించడం ద్వారా అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దాంతో ముడుపుల కోసమే తమ పదోన్నతుల ఫైల్‌ను క్లియర్ చేయడం లేదని డీఎస్పీలు గుర్తించారు.
⇒ అంతా చర్చించుకుని తాము ఇవ్వాలని నిర్ణయించిన ఏకమొత్తం గురించి సమాచారం చేరవేశారు. బిగ్‌బాస్ అంచనాల్లో అది కేవలం 10 శాతమేనని ఆయన కార్యాలయ వర్గాలు చెప్పడంతో డీఎస్పీలు విస్తుపోయారు. రెండంకెల మార్కు దాటాల్సిందేనని రూ.కోట్లలో లెక్క చెప్పడంతో డీఎస్పీల నోట మాట రాలేదని సమాచారం. ఆ డీల్ కుదరకే ఆగస్టు 31తో ప్యానల్ గడువు ముగిసినా అదనపు ఎస్పీల పదోన్నతుల గురించి పట్టించుకోలేదని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.