చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?: వైఎస్‌ జగన్‌

Jul 2 2025 7:46 PM | Updated on Jul 2 2025 8:41 PM

Ys Jagan Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా?.. విదేశాల్లో మెడికల్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు  చేయిస్తారా? అంటూ వైఎస్సార్‌సీపీ  అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఎన్‌ఎంసీ (NMC) గైడ్‌లైన్స్‌ ప్రకారం వాళ్లంతా ఇక్కడ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ (FMG) ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైన తరువాత, ఇక్కడే ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసినా, ఎందుకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వడం లేదు? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు?’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

‘‘ఇదేనా మీ పరిపాలన? మీరు చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే వారిపై పోలీసులతో దాడులు చేయిస్తారా? గడచిన ఏడాది కాలంగా వారిపై వివక్ష చూపుతూ, ఇంటర్న్‌షిప్‌ పేరుతో దీర్ఘకాలం వెట్టిచాకిరి చేయించుకుంటూ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు లాభం చేకూర్చేలా, ఉద్దేశ పూర్వకంగా వీరికి పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పీఆర్‌) నంబర్‌ ఇవ్వకపోవడం వాస్తవం కాదా?

..తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి తమ పిల్లలను విదేశాల‌కు పంపిస్తే, ఆ పిల్లలు కష్టపడి చదువుకుని కోర్సులు పూర్తిచేశారు. అలాంటి వారిని అంటరాని వారిగాచూస్తూ, వారి కెరీర్‌ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? వారిని నిరుత్సాహపరచాలన్నది మీ ప్లాన్‌లో భాగం కాదా?’’ అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

‘‘డాక్టర్లు కావాలనుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకునే ఇబ్బందుల్లేకుండా, ఇక్కడే, మన రాష్ట్రంలోనే, ప్రభుత్వ రంగంలో 17 కాలేజీలను, వాటి ద్వారా 2,550 సీట్లను తీసుకు వచ్చేలా మా ప్రభుత్వం పనులు చేసి, అందులో ఐదు కాలేజీలను ప్రారంభించింది. మిగిలిన కాలేజీలను కూడా పూర్తిచేసే స్థాయికి తీసుకువెళ్తే, చంద్రబాబూ.. మీరు వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తే, వాటిని వద్దు అన్న ప్రభుత్వం, దేశ చరిత్రలో మీది మాత్రమే కాదా? మీ అవినీతికోసం స్కామ్‌లు చేస్తూ ఆ కాలేజీలను ప్రయివేటీకరించే కుట్ర చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఎన్‌ఎంసీ కేటాయించిన సీట్లనుకూడా వద్దు అంటూ తిరిగి లేఖరాసి, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారు. ఇప్పుడు దేశంకాని దేశం వెళ్లి అక్కడ ఖర్చులు తగ్గించుకుని, కష్టపడి కోర్సులు పూర్తిచేసి వస్తే, వారికి పీఆర్‌ నంబర్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతున్నారు. పైగా అడిగితే పోలీస్‌ స్టేషన్‌లో వేశారు. తల్లిదండ్రులపైనా,  విద్యార్థులపైనా ఇంత పగ ఎందుకు చంద్రబాబూ? ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన వారికి వెంటనే రిలీవింగ్‌ ఆర్డర్స్‌ ఇవ్వాలని,  ఎన్‌ఎంసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఎఫ్‌ఎంజీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వీరికి వెంటనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇవ్వాలి’’ అని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement