
ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరిక
ఈ నెలాఖరులోగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
ఉద్యోగులు బానిసలుగా మారిన పరిస్థితులు తలెత్తాయని ఆవేదన
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు సెప్టెంబర్ నెలాఖరుకల్లా మంజూరు చేయాలని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ఎండీ జాని పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ, కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాఖ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ముఖ్యాంశాలు..
⇒ సచివాలయ ఉద్యోగులు సర్వీస్‌లో చేరి ఆరు సంవత్సరాలు పూర్తయినా నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదు.
⇒ ఒకే కేడర్‌లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్న నిబంధన అమలు కాలేదు.
⇒ ఒకే కేడర్‌లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలన్న
నిబంధన అమలు కాలేదు.
⇒ ఈ అంశాల్లో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి వెనుకాడబోము.
⇒ పనిభారం, అన్యాయమైన ఆదేశాలను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు.
⇒ సచివాలయాల శాఖ కేవలం సర్వేల శాఖగా మారిపోయింది.
⇒ పండుగలు, ఆదివారాలు, సెలవు దినాల్లోనూ తప్పనిసరి విధులు, ఇంటింటి సర్వేల వల్ల ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింటోంది.
⇒ రోజువారీ టార్గెట్ల ఒత్తిడితో కుటుంబ జీవితం దూరమవుతోంది. ఇది ఉద్యోగుల ఆత్మహత్యలకు సైతం దారితీస్తోంది.
⇒ ఇక ఇటీవల జరిగిన అనైతిక బదిలీల ప్రక్రియతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
⇒ బదిలీల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించి, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక విధానాన్ని అమలు చేయాలి.
⇒ పేస్కేల్ అసమానతలు తొలగించి, కేడర్ అప్‌గ్రేడ్ చేయాలని పలు సార్లు వినతులు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.