తాడేపల్లి : ఏపీలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే అందించాలని వైఎస్సార్‌సీపీ విద్యార్థి రాష్ట్ర అథ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యేల ఇళ్లు, మంత్రుల ఇళ్లను త్వరలోనే ముట్టడిస్తామని హెచ్చరించారు. అపపటికీ రెస్పాండ్ కాకపోతే ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామన్నారు.
ఈ రోజు(సోమవారం, డిసెంబర్ 1వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పానుగంటి చైతన్య.. ‘ కూటమి పాలనలో విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు మాయ మాటలు నమ్మి ఓట్లేసినందుకు విద్యార్థి లోకాన్ని రీడ్డున పడేశారు. జగన్ హయాంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. చంద్రబాబు వచ్చాక బకాయిలు పెరిగి పోయాయి. ఎంతోమంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక కూలి పనులకు వెళ్తున్నారు. అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కనపడటం లేదు.
తన ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఎవరినీ పట్టించుకోవటం లేదు. నారా లోకేష్ హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయింది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’ అని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు, లోకేష్ విద్యార్థుల పాలిట ద్రోహులు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అవేమీ పట్టించుకోకుండా ప్రచారపిచ్చిలో మునిగి తేలుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. జగన్ హయాంలో త్రైమాసికం ప్రకారం రిలీజ్ చేశారు. కూటమి వచ్చాక కాలేజీలకి చెల్లిస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. గన్ ఇవ్వగా లేనిది చంద్రబాబు ఎందుకు ఇవ్వటం లేదు?, 2014-19 మధ్య చంద్రబాబు పెట్టిన బకాయి కూడా కలిపి ఒకేసారి రూ.4 వేల కోట్లు జగన్ ఇచ్చారు.
చంద్రబాబు మాత్రం త్రైమాసికం ప్రకారం కూడా ఇవ్వటం లేదు. ఇప్పటికే రూ.7,800 కోట్లు చంద్రబాబు బకాయిలు పెట్టారు. నారా లోకేష్ విద్యార్థి సంఘాల నేతలతో పచ్చి అబద్దాలు చెప్తున్నారు. జగన్, చంద్రబాబు హయాంలలో ఎవరు ఎంత ఇచ్చారో చర్చకు సిద్దమా?, మా పార్టీ తరఫున చర్చకు మేము సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వం తరపున ఎవరైనా చర్చకు రావాలి. రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు పరీక్షలు కూడా రాయనీయటం లేదు. షాడో సీఎంగా వ్యవహరిస్తున్న లోకేష్ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ విద్యార్థుల పాలిట ద్రోహులు’ అని మండిపడ్డారు.


