
మూడు వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి
పశ్చిమ గోదావరిలో భక్తులపైకి ట్రాక్టర్ వెళ్లి నలుగురు..
అల్లూరి జిల్లాలో కారు దూసుకెళ్లి ఇద్దరు..
చిత్తూరు జిల్లాలో చెరువులో విగ్రహం కింద పడి ఇద్దరు మృత్యువాత
మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/గంగవరం/నరసాపురం రూరల్/సాక్షి, అమరావతి: గణపతి విగ్రహ నిమజ్జనం ఊరేగింపుల్లో ఆదివారం మూడు జిల్లాల్లో అపశృతులు చోటుచేసుకోవడంతో మొత్తం ఎనిమిది మంది మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ట్రాక్టర్ అదుపుతప్పి భక్తుల మీదకెళ్లడంతో నలుగురు.. ఊరేగింపును వీక్షిస్తున్న గిరిజనులపైకి కారు దూసుకువెళ్లడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇద్దరు గిరిజనులు మృతిచెందారు. అలాగే.. చిత్తూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ చెరువులో విగ్రహం కింద పడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాలివీ..
‘పశ్చిమ’లో అదుపుతప్పిన ట్రాక్టర్..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామంలో గణేష్ నిమజ్జనంలో ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తజనం మీదకు దూసుకెళ్లడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పది నిమిషాల్లో నిమజ్జనం పూర్తవుతుందనగా ఈ ప్రమాదం జరిగింది. విగ్రహాన్ని ఉంచిన ట్రాక్టర్ డ్రైవర్ మంచినీళ్లు తాగుదామని ఇంజన్ ఆఫ్ చేయకుండా కిందకు దిగి వెళ్లాడు.
అదే సమయంలో ట్రాక్టర్‌పై యువకులు తోసుకోవడంతో అనుకోకుండా ఎక్స్‌లేటర్‌పై కాలువేయడంతో వెంటనే ట్రాక్టర్ ఊరేగింపులో ఉన్న వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో గ్రామానికి చెందిన కడియం దినేష్ (9), గురుజు మురళి (38), ఈవన సూర్యనారాయణ (58), తిరుమల నర్శింహమూర్తి (35) మృతిచెందారు. కంచర్ల ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాలను, క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పశ్చిమగోదావరి జిల్లా తూర్పుతాళ్లు గ్రామంలో ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్
గిరిజనులపైకి దూసుకెళ్లిన కారు..
అల్లూరి జిల్లా చింతలవీధి జంక్షన్‌లోని జాతీయ రహదారిపై చింతలవీధి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కొర్రా సీతారాం (65), గుంట కొండబాబు (35) గణేష్ నిమజ్జన ఊరేగింపు చూస్తుండగా అదే సమయంలో ఓ కారు ఊరేగింపుపైకి దూసుకొచ్చింది. దీంతో.. తీవ్రగాయాలతో వారిరువురూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు మహిళలు వంతాల మొత్తి, గుంట దొస్సు, కొర్రా గౌరమ్మ, వంతాల దాలిమా, పాంగి మొత్తి, కొర్రా ఈశ్వరిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
చెరువులో మునిగి ఇద్దరు..
ఇక చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ, చిన్నమనాయనిపల్లి గ్రామస్తులు వినాయక విగ్రహాన్ని సమీపంలోని చెరువులో నిమజ్జనం చేస్తుండగా గ్రామానికి చెందిన భార్గవ్ (28), చరణ్ (27) ప్రమాదవశాత్తూ నీటిలో విగ్రహం కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి..
వినాయకుడి శోభాయాత్రలో పశ్చిమ గోదావరి, అల్లూరి, చిత్తూరు జిల్లాల్లో ఎనిమిది మంది మృత్యువాతపడటంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళులో వినాయక నిమజ్జనోత్సవం ఊరేగింపులో భక్తులపైకి ట్రాక్టర్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మరణించడం అత్యంత విచారకరమన్నారు.
ప్రమాదం కారణంగా యువకులు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అలాగే, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు చింతలవీధిలో వినాయక నిమజ్జనోత్సవం పైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో మరో ఇద్దరు భక్తులు మరణించిన ఘటనపైనా మాజీ సీఎం విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.