
విశాఖలో తనను కలిసేందుకు తరలివచ్చిన అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో వెల్లువెత్తిన జనసముద్రం
కర్ఫ్యూను తలపిస్తూ పోలీసులను మోహరించినా లెక్క చేయకుండా పోటెత్తిన జనం
మండుటెండ, జోరు వానలోనూ చెక్కు చెదరని అభిమానం..
ఇటీవలి కాలంలో అతిపెద్ద రాజకీయ కార్యక్రమంగా అభివర్ణిస్తున్న పరిశీలకులు
బాబు అసమర్థ పాలనపై తీవ్ర వ్యతిరేకతకు సంకేతమంటున్న విశ్లేషకులు
ఇంటికే పథకాలు, సేవలతో పేదల జీవితాల్లో జగన్ చెరగని ముద్ర
జగన్ సుపరిపాలన.. బాబు దగాపై సర్వత్రా మరోసారి చర్చ
హామీల ఎగవేత.. మోసాలమయంగా కూటమి 16 నెలల పాలన
సాక్షి, అమరావతి :
కర్ఫ్యూను తలపిస్తూ మోహరించిన పోలీసులు..
అడుగడుగునాఆంక్షలు.. బారికేడ్లు..
ఆటోవాలాలకు బెదిరింపులు.. పార్టీ నేతలకు వేధింపులు..
ఖాకీల దిగ్బంధంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీ రోడ్డు..!
ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి సర్కారు ఎన్ని ఆంక్షలు పెట్టినా జన సునామీ ఎదుట తల వంచక తప్పలేదు! జోరు వర్షంతో పాటు ప్రజల అభిమానంతో తడిసి ముద్ద కావడంతో 65 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణాన్ని వైఎస్ జగన్ ఏకంగా 6 గంటల పాటు ఎడతెరపి లేకుండా సాగించాల్సి వచ్చింది. వాహనాలను పోలీసులు అడ్డుకున్నా ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట తరలి వచ్చారు. ఇటీవలి కాలంలో అతి పెద్ద రాజకీయ సభగా పరిశీలకులు దీన్ని అభివర్ణిస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉన్నా అశేష ప్రజాదరణతో జనం గుండెల్లో జగన్ చిరస్థాయిగా నిలిచారని.. ఇంటికే పథకాలు, సేవలతో పేదల జీవితాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొంటున్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తూ వైఎస్ జగన్ నర్సీపట్నం వైద్య కశాశాలను సందర్శించిన నేపథ్యంలో.. చంద్రబాబు సర్కారు దారుణ పాలన వైఫల్యాలు, సూపర్ సిక్స్ మోసాలు, రెడ్‌బుక్ కుట్రలు మరోసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారాయని విశ్లేషిస్తున్నారు. పేదల జీవితాల్లో మార్పు కోసం
తాపత్రయపడుతూ.. విద్య, వైద్యం, వ్యవసాయ
రంగాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన మంచి, తీసుకొచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంపద సృష్టిని గుర్తు చేసుకుంటున్నారు. సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకేలు లాంటి వినూత్న వ్యవస్థల ద్వారా ఊరు దాటాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దే పథకాలు, పౌర సేవలు అందాయని గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
కోవిడ్ సంక్షోభంలోనూ ఎక్కడా ఆగకుండా డీబీటీ ద్వారా నేరుగా పథకాలు అందించటాన్ని ప్రస్తావిస్తున్నారు. గత 16 నెలల కూటమి పాలనలో ఎంతో నష్టపోయామని.. బాబు చేతిలో మోసపోయామని అన్ని వర్గాల ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. ఐఆర్, నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారని, పీఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.
బాబు ష్యూరిటీ పోయి.. మోసం గ్యారెంటీగా
మారిందని.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని.. ఇసుక దోపిడీ.. విద్యుత్తు చార్జీల బాదుడు.. నకిలీ మద్యంతో అమాయకులు ప్రాణాలు పోతున్నాయని.. ఏడాది తిరగక ముందే కూటమి పాలనపై ప్రజలకు భ్రమలు పూర్తిగా తొలగిపోయాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆరోగ్యానికి సంపూర్ణ భరోసా..
వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించారు. ఫ్యామిలీ డాక్టర్, హెల్త్ క్లినిక్స్ ద్వారా ప్రజారోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేశారు. వందేళ్లుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కేవలం రెండే రెండు మెడికల్ కాలేజీలు ఉండగా... మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో ఏకంగా నాలుగు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం గమనార్హం. మాట ప్రకారం ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్, అతిపెద్ద డయాలసిస్ సెంటర్ నిర్మించారు.

ఉత్తరాంధ్రతో పాటు మైదాన ప్రాంత గిరిజనులకు ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ ఐదు గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలల్లో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఆగిపోయింది.
భావి తరాలకు విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ రంగంలో 17 కొత్త మెడికల్ కాలేజీలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుడితే.. పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా పెండింగ్ పెట్టడంతో రోగులకు వైద్యం నిలిచిపోయిన దుస్థితి.
పిల్లలకు మోసం..
వైఎస్ జగన్ హయాంలో నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లు, ట్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదులు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్‌్ట, అమ్మఒడి, గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఐబీ, టోఫెల్, ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది పిల్లల చదువులకు గట్టి భరోసా కల్పించారని చర్చించుకుంటున్నారు. అదే ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏకంగా దాదాపు ఐదు లక్షల వరకు తగ్గిపోవడం ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి, తల్లిదండ్రుల్లో సన్నగిల్లిన నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంటున్నారు.
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణ కూడా సరిగా చేయకపోవడంతో కురుపాంలో ఇద్దరు విద్యార్థనులు మృతి చెందారు. పిల్లలకు పచ్చకామెర్లు సోకితే కనీసం పట్టించుకున్న దిక్కు లేకుండా పోయింది.

అన్నదాతకు మహిళలకు దగా..
ఈ ప్రభుత్వం వ్యవసాయ సీజన్‌లో కనీసం ఎరువులు కూడా సమకూర్చలేకపోయిందని, యూరియా నల్ల బజారుకు తరలిపోగా.. ఏ పంటకూ మద్దతు ధరలు దక్కక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఇంటికే సేవలందించిన వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. రైతులకి ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది.
ఇన్‌పుట్ సబ్సిడీకి దిక్కే లేదు. ఈ క్రాప్ కనపడకుండా పోయింది. ఆర్బీకేలు, సచివాలయాలు నిర్వీర్యమయ్యాయి. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా తామే ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ లెక్కన రెండేళ్లకు కలిపి రూ.40 వేలకుగాను ఇచ్చింది కేవలం రూ.5 వేలు మాత్రమే.
ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి గత ఏడాది చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టేశారు. రెండో ఏడాది తూతూమంత్రంగా అమలు చేసి 30 లక్షల మంది పిల్లలకు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో మహిళలందరికీ ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామన్న హామీని ఎగ్గొట్టారు. అటు 20 లక్షల ఉద్యోగాలూ లేవు.. ఇటు నిరుద్యోగ భృతీ ఇవ్వట్లేదు! ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసి పటిష్టంగా నిర్వహించాల్సిన ఆవశ్యకతపై సర్వత్రా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంచి చేసే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం. 52 ఎకరాల్లో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి.. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, రూ.500 కోట్ల ఖర్చుతో 2022 డిసెంబర్ 30న కాలేజీకి శంకుస్థాపన చేశాం -నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెం మెడికల్ కాలేజీ సందర్శనలో వైఎస్ జగన్