
సీఎం రమేష్‌ను ప్రజలే కాదు పార్టీ కార్యకర్తలూ నమ్మడం లేదు
అక్రమాస్తులను కాపాడుకునేందుకే బాబు సలహాతో బీజేపీలో చేరారు
అనకాపల్లిలో ఆ వలస నేతకు పరాభవం తప్పదు
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు
నర్సీపట్నం: సీఎం రమేష్‌ను జిల్లా ప్రజలు ఎలాగూ నమ్మరని.. మనిషి బీజేపీ, మనసు టీడీపీ కావడంతో ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఆయనను విశ్వసించడం లేదని డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌తో కలిసి గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రమేష్‌లా తాను బ్యాంకులను మోసం చేయలేదన్నారు. దోపిడీలు చేయటం తనకు చేతకాదన్నారు.
అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు అనుమతితో ఆయన బీజేపీలో చేరారని, రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినా ఏనాడూ స్టీల్‌ప్లాంట్ గురించి నోరు మెదపలేదన్నారు. స్థానికులకే ఎంపీ టికెట్ కేటాయించాలని తొలుత గట్టిగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు డబ్బుల కోసం సీఎం రమేష్‌కు సాగిలపడ్డారని విమర్శించారు.
ఇక్కడి ప్రజలు విజ్ఞత కలిగినవారని, స్థానికేతర్లకు ఇక్కడ ప్రజలు పట్టం కట్టిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి డబ్బు సంచులతో దిగిన సీఎం రమేష్ ఓటర్లను కొనేయాలనుకుంటే.. ఆయన ఆటలు చెల్లవన్నారు. టీడీపీ నాయకులు అమ్ముడు పోతారేమో కాని ఓటర్లు మాత్రం డబ్బులకు లొంగిపోయే వారు కాదన్నారు.
ప్రజల కలలకు వాస్తవ రూపం..
సీఎం రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతన్నకు మంచి చేసే ఆలోచనతో జగనన్న ఉంటే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు ఉపయోగపడే ఏ పథకమైనా తీసుకోచ్చారా అని ప్రశ్నించారు. నేడు రైతు భరోసా, రైతులకు రుణాలు, కౌలు రైతుల చట్టం తదితర పథకాలను జగనన్న అమలు చేస్తుంటే ఓర్వలేని చంద్రబాబు ఆసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల యర్రాపాత్రుడు పాల్గొన్నారు.
ఇవి చదవండి: టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి