హైకోర్టులో తాజాగా సీబీఐ దర్యాప్తు కోసం విజయలక్ష్మీ అనుబంధ పిటిషన్
సీబీఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని హైకోర్టుకు అభ్యర్థన
పోలీసు కమిషనర్‌పై సంచలన ఆరోపణలు
నా కుమారుడి అదృశ్యం గురించి కమిషనర్‌కు తెలుసు.. సాయికృష్ణ లేడని తెలిసినా 40 రోజులుగా మౌనంగా ఉన్నారు
నేను ఫిర్యాదు చేసిన 45 రోజుల తరువాత కేసు నమోదు చేశారు
ఇది సాయికృష్ణ అదృశ్యంలో ఉన్నత అధికారుల పాత్రను స్పష్టం చేస్తోంది
ఈ కేసులో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉంది
నాగరాజు అరెస్ట్ కేవలం కంటితుడుపు చర్య మాత్రమే.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్.. పోలీసుల కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు
తాము ఏదో దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టును నమ్మించే ప్రయత్నిస్తున్నారు
తద్వారా నేను దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను క్లోజ్ చేయించాలనుకుంటున్నారు
ఈ కేసు ఎప్పటికీ వెలుగులోకి రాకుండా అణిచేయాలని చూస్తున్నారు
దోషులను శాశ్వతంగా తప్పించాలన్నదే పోలీసుల ముఖ్య ఉద్దేశం
ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ కేసులో మీరు జోక్యం చేసుకోవాల్సిందే
హైకోర్టుకు నివేదించిన విజయలక్ష్మి.. సోమవారం విచారణ జరపనున్న ధర్మాసనం
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో అతడి తల్లి విజయలక్ష్మి తన న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని ఇప్పటికే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్న విజయలక్ష్మి తాజాగా మరోసారి హైకోర్టు తలుపుతట్టారు. తన కుమారుడి లాకప్‌డెత్ కేసు దర్యాప్తు బాధ్యతలను స్థానిక పోలీసుల నుంచి తప్పించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా న్యాయస్థానం సరైనదని భావించే మరేదైనా ఇతర సమర్థవంతమైన స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అభ్యరి్థస్తూ ఆమె హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్వతంత్ర దర్యాప్తు కేవలం ఆ సంస్థ పరిధిలోనే కాకుండా పూర్తి స్థాయిలో కోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగేలా చూడాలని ఆమె హైకోర్టుకు విన్నవించారు. సాయికృష్ణ ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో ఎటువంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ సుభేందు శమంతో ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది.
40 రోజుల పాటు కమిషనర్ మౌనంగా ఉన్నారంటే అర్థమేంటి..?
‘కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది, టాస్‌్కఫోర్స్ అధికారులు సాయికృష్ణ అదృశ్యం, సాక్ష్యాల నాశనంలో స్వయంగా భాగస్వాములుగా ఉన్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. నిందితులుగా ఉన్న అదే పోలీస్ శాఖే ఈ కేసును విచారిస్తే న్యాయం జరగదు. ఉన్నతాధికారులను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాకు న్యాయం జరగాలంటే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడమే ఏకైక మార్గం. తన అధికార పరిధిలో ఒక వ్యక్తి అదృశ్యం కావడం, పోలీస్ కస్టడీలో మరణం లాంటి తీవ్రమైన ఘటన జరిగితే కనీసం 7 రోజుల్లోగా ఆ ప్రాంత పోలీసు అధిపతి అయిన కమిషనర్‌కు పూర్తి సమాచారం తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో సదరు కమిషనర్ 40 రోజుల పాటు పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘకాలం కమిషనర్ స్పందించకపోవడం దేనిని సూచిస్తోందంటే.. ఈ నేరంలో లేదా ఈ విషయాన్ని తొక్కిపెట్టడంలో కేవలం కింది స్థాయి సిబ్బందే కాకుండా ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే బలమైన అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్ద అధికారుల ప్రమేయం ఉన్నప్పుడు న్యాయం జరుగుతుందని ఆశించడంలో అర్థమే లేదు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా స్థానిక పోలీసుల దర్యాప్తును నమ్మడానికి వీల్లేదు కాబట్టి, హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని ఈ కేసును సీబీఐకి అప్పగించాలి’ అని సాయికృష్ణ తల్లి హైకోర్టును అభ్యర్థించారు.
హైకోర్టుకు ఏదో ఒకటి చెప్పి కేసును మూసేయించాలని చూస్తున్నారు..
‘ప్రస్తుత దర్యాప్తు కేవలం ఒక్క పోలీస్ అధికారి (నాగరాజు) చుట్టూనే తిరుగుతోంది. కానీ అసలు నిజం ఏమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది మొత్తం సాయికృష్ణ అదృశ్యం ఘటనలో భాగస్వాములయ్యారు. సాయికృష్ణ ప్రాణాలు తీసి అతడి శరీరాన్ని ఎప్పటికీ దొరకకుండా మాయం చేయాలనే క్రూరమైన ఉద్దేశంతో వీరంతా కలిసి పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కుట్రను పూర్తిగా ఛేదించడం లేదు. నేరంలో భాగమైన కృష్ణలంక స్టేషన్ సిబ్బంది అందరినీ వదిలేసి, కేవలం ఆ ఒక్క నిందితుడి నుంచి మాత్రమే సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే. తాము దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టుకు ఏదో ఒక నివేదిక సమర్పించి తద్వారా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను మూసివేయించాలని చూస్తున్నారు. ఒకసారి కోర్టులో ఈ పిటిషన్ మూసివేస్తే ఈ కేసు భవిష్యత్తులో ఎప్పటికీ వెలుగులోకి రాకుండా పూర్తిగా అణచివేయవచ్చని, దోషులను శాశ్వతంగా తప్పించవచ్చని పోలీసులు భావిస్తున్నారు’ అని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు.
ఫిర్యాదు చేసిన 45 రోజుల తరువాత కేసు నమోదు చేశారు...
‘సాయికృష్ణ అదృశ్యంపై నేను మే 28నే విజయవాడ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశా. ఒక పౌరుడి ప్రాణానికి సంబంధించిన ఇంతటి తీవ్రమైన విషయంపై, అది కూడా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, పోలీసులు జూన్ 19 వరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక వారి ఉద్దేశాలు స్పష్టమవుతున్నాయి. కేసు నమోదు చేయడానికి దాదాపు 45 రోజులకు పైగా సుదీర్ఘ జాప్యం జరిగింది. ఈ 45 రోజుల కాలంలో బాధితుడి తల్లిగా నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కదలని యంత్రాంగం, కేవలం ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఈ వ్యవహారం హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాతే దిగివచ్చి కేసు నమోదు చేసింది. ఒక వ్యక్తి అదృశ్యమైన వెంటనే ప్రాథమిక చర్యలు చేపట్టాల్సిన పోలీసులు 45 రోజుల పాటు మౌనంగా ఉండి, కోర్టు జోక్యం తరువాతే దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పడం వారి నిబద్ధతను శంకిస్తోంది. సాయికృష్ణ అదృశ్యమైన తొలి రోజుల్లోనే గాలింపు ప్రారంభించకుండా కేసును కోర్టు విచారణ వరకు లాగడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటంటే.. ఈలోపు పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేయడమే’ అని సాయికృష్ణ తల్లి నివేదించారు.
హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే దర్యాప్తు చేయడమా..?
‘సాయికృష్ణ పోలీసు కస్టడీలో దారుణమైన హింసను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతే అతడిని మాయం చేశారు. ఇదంతా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలోనే జరిగింది. చట్టంలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది. ఎవరూ కూడా తమ సొంత కేసులో తామే న్యాయమూర్తిగా లేదా దర్యాప్తు అధికారిగా ఉండకూడదు. ఎవరిపై అయితే హత్యానేరం లేదా అక్రమ నిర్బంధం ఆరోపణలు ఉన్నాయో, వారికే దర్యాప్తు చేసే అధికారం ఇస్తే వారు తమ తప్పులను తామే ఎలా ఒప్పుకుంటారు? నిందితులుగా ఉన్న పోలీస్ యంత్రాంగాన్నే ఈ కేసును దర్యాప్తు చేయడానికి అనుమతిస్తే, అది ‘నిష్పక్షపాత, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తు లక్ష్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది’ అని విజయలక్ష్మి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కంటి తుడుపు సిట్ దర్యాప్తుతో ఉపయోగం లేదు...
‘సాయికృష్ణ ఆచూకీ కనిపెట్టడానికి సిట్‌ను ఏర్పాటు చేశామని పోలీసులు కోర్టు ముందు కేవలం మాటల్లోనే చెబుతున్నారు. కానీ, ఆ మాటలకు తగ్గట్టుగా ఎలాంటి చట్టపరమైన ఆధారాలను, నివేదికలను వారు ఇప్పటివరకు కోర్టుకు సమర్పించలేదు. హైకోర్టు విచారణ ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా, పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఒకవేళ వారు నిజంగానే నిజాయితీగా దర్యాప్తు చేస్తుంటే, ఆ నిజాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? సాయికృష్ణ అసలు ఏ పరిస్థితులలో మాయమయ్యాడు? అనే దానికి సంబంధించిన వాస్తవాలను పోలీసులు కోర్టుకు చెప్పకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అందుకే ఈ కంటితుడుపు సిట్ దర్యాప్తులను పక్కనబెట్టి కేసును తక్షణమే సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థకు అప్పగిస్తేనే నిజాలు బయటకు వస్తాయి. కోర్టు ఆ దిశగా తగిన ఆదేశాలు జారీ చేయాలి’ అని విజయలక్ష్మి తన పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించారు.
ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు..?
‘ఒకవేళ కింది స్థాయి పోలీస్ సిబ్బంది సాయి కృష్ణ అరెస్ట్, అదృశ్యం గురించి తమ పైఅధికారులకు ముందే సమాచారం అందించి ఉంటే... అంతటి తీవ్రమైన విషయంలో ఆ ఉన్నతాధికారులు ఎందుకు తక్షణమే స్పందించలేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే.. వారు కూడా ఈ నేరాన్ని లోపల సమరి్థస్తూ, దాచడానికి ప్రయత్నించారు. ఒకవేళ కింది స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని తమ పైఅధికారులకు చెప్పకుండా దాచిపెట్టి ఉంటే... అది నిజాలను తీవ్రంగా తొక్కిపెట్టడం, తమ అధికారిక విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలం కావడం కిందకే వస్తుంది. ఒక పౌరుడి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఉన్నతాధికారులు, కిందిస్థాయి అధికారులు ఆ విషయాన్ని దాచగలిగారంటే అక్కడ పర్యవేక్షణ ఎంత దారుణంగా ఉందో సులభంగా అర్థం చేసుకోవచ్చు’ అని విజయలక్ష్మి పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగానే హైకోర్టును తప్పుదోవ పట్టించారు...
‘సాయికృష్ణ అదృశ్యంపై నేను దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. సాయికృష్ణ అసలు ఎవరి కస్టడీలో ఉన్నాడు? అతడిని ఎక్కడ నిర్బంధించారు..? ప్రస్తుతం అతడి పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై అప్పుడు కూడా కనీస సమాచారాన్ని పోలీసులు హైకోర్టుకు వెల్లడించలేదు. ఆ తర్వాత సిట్ తన రిమాండ్ రిపోర్టులో సాయికృష్ణను మే 6నే కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, స్పష్టమైన ఆధారాలు దొరికాయని పేర్కొంది. దీన్నిబట్టి చూస్తే జూన్ 2 నుండి కోర్టు విచారణల సమయంలో సాయికృష్ణ అక్రమ నిర్భంధం గురించి, అదృశ్యం గురించి పోలీసులు ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానాన్ని సైతం పక్కదారి పట్టించారని స్పష్టమవుతోంది’ అని ఆమె నివేదించారు.
ముందస్తు ప్రణాళికతోనే సాక్ష్యాలను నాశనం చేశారు...
‘సాయికృష్ణను ఈ ఏడాది మే 6న ప్రకాశం జిల్లా మార్కాపురంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి పోలీస్ కస్టడీలోనే ఉంచారు. దీనిని సిట్ రిమాండ్ రిపోర్ట్ ధృవీకరిస్తోంది. చట్ట ప్రకారం ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. కానీ సాయికృష్ణ్ణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా పోలీసులు చట్టాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సాయికృష్ణను స్టేషన్‌కు తీసుకువచ్చిన కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు డిలీట్ చేశారు. ఇది కస్టడీలో అతడిపై జరిగిన హింసను, మరణాన్ని దాచడానికి పోలీసులు అంతా కలిసి సాక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో నాశనం చేశారనడానికి బలమైన ఆధారం’ అని విజయలక్ష్మి తన అనుబంధ పిటిషన్‌లో స్పష్టం చేశారు.


