మొక్కల పేరుతోనూ మంత్రి నారాయణ మేత | MLC Parvathareddy Chandrasekhar Reddy comments on Minister Narayana | Sakshi
Sakshi News home page

మొక్కల పేరుతోనూ మంత్రి నారాయణ మేత

Apr 12 2026 4:36 AM | Updated on Apr 12 2026 4:36 AM

MLC Parvathareddy Chandrasekhar Reddy comments on Minister Narayana

ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌: నెల్లూరు నగరపాలక సంస్థలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని.. మొక్కుబడిగా మొక్కలు నాటి ఏకంగా రూ.60 కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. 48 వేల మొక్కలు నాటి వా­టికి ట్రీ గార్డులు, నీరుపోసే పేరుతో మంత్రి నారాయణ ఒక్కో మొక్కకు ఏకంగా రూ.12,500 ఖర్చు చేస్తూ.. రూ.60 కోట్ల నిధులు మేసేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక్కో మొ­క్కకు చేసిన ఖర్చు కేవలం రూ.750 మాత్రమేన్నారు.  శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లా­డుతూ.. నెల్లూరులో మొక్కల నాటే కార్యక్రమం పేరుతో భారీ దోపిడీకి మంత్రి నారాయణ వ్యూహరచన చేశారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడని పనులతో యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోచేస్తున్నా­రని మండిపడ్డారు.

టీడీపీ నేతలకే కాంట్రాక్టులిచ్చి .. 
నగరంలో తొలి విడతలో 14,741 మొక్కలకు సంబంధించి టీడీపీకి చెందిన 25 మంది కాంట్రాక్టర్లకు అనుమతులిచ్చారని, మొదటి విడతలో నాటిన చెట్లకు రూ.8.03 కోట్లు చెల్లించారని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఒక్కో మొక్క నాటి దానికి ట్రీగార్డు ఏర్పాటు చేసేందుకు రూ.5,500 ఖర్చుచేస్తే.. ఒక డివిజన్‌లో 1,800 మొక్కలకు నీళ్లు పోయడానికి రూ.1.24 కోట్ల కేటాయించారన్నారు. ఈ లెక్కన ఒక్కో మొక్కకు నీరు పోసేందుకే రూ.6,888 ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధంగా ఒక్కొక్క మొక్కకు దాదాపు రూ.12,500 పైగా ఖర్చు చేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు.

మంత్రి నారాయణ కేవలం 12 అడుగుల రోడ్డులో ఇరువైపులా మొక్కలు నాటిస్తున్నారని, ఈ మొక్కలకు రెండు నెలలే ఆకులు, పూలు ఉంటాయని, ఆక్సిజన్, నీడను ఇవ్వని ఇలాంటి చెట్ల వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. సిమెంట్‌ రోడ్డును కట్‌చేసి మొక్కలు నాటుతున్నట్టు టెండర్లలో పేర్కొంటూ గ్రావెల్‌ రోడ్డులో నాటుతున్నారన్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ప్రైవేట్‌ స్థలాల్లో నాటిన మొక్కలకు మెష్‌ ఏర్పాటు చేసి బిల్లులు పెట్టుకున్నారని చెప్పారు. ఎవరైనా వర్షాకాలం సమీపిస్తున్నప్పుడు మొక్కలు నాటుతారని.. నారాయణ మాత్రం బిల్లులు వస్తే చాలన్నట్టు మండే ఎండల్లో నాటిస్తున్నారని ధ్వజమెత్తారు.

మరో వైపు పన్నుల పేరుతో నగర వాసులను వేధిస్తున్నారని, టేబుల్‌పై కోడి గుడ్లు అమ్మకుంటున్న చిరు వ్యాపారిని ఆక్రమణ పేరుతో పెనాల్టీ వేశారని, ఒక దగ్గర నేమ్‌ బోర్డు ఒక అడుగు ముందుకొస్తే పెనాల్టీ వేశారని, ఇంకా పేదలు నివసించే ఏరియాలో నీటిబిల్లు రూ.350 కట్టలేదని పైప్‌లైన్‌ కట్‌ చేసి డమ్మీలు పెట్టారని వివరించారు. 

‘ఎన్‌’ టీమ్‌తో దోపిడీకి మాస్టర్‌ ప్లాన్‌ 
అవినీతి, దోపిడీ విషయాల్లో నారాయణ ‘మాస్టార్‌’ ప్లాన్‌ సక్సెస్‌గా కొనసాగుతోందని  చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నారాయణ ఏర్పాటు చేసుకున్న ‘ఎన్‌’ టీమ్‌ దోచుకుతింటోందన్నారు. స్మార్ట్‌ స్ట్రీట్‌ వెండింగ్‌ ప్రాజెక్ట్‌ నుంచి మొదలు పెడితే.. పెయింటింగ్స్, ట్రాఫిక్‌ సిగ్నల్స్, బయోటాయ్‌లెట్, చెత్తను తరలించే ట్రాక్టర్లు, సిల్ట్‌ క్లీనింగ్, దోమల నివారణ, ఎండ్‌ టు ఎండ్‌ రోడ్, ప్యాచ్‌వర్కులు ఇలా అన్నింట్లోనూ రూ.వందల కోట్ల పనులు నామినేటెడ్‌ కింద తన వారికి ఇప్పించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికే జాఫర్‌ సాహెబ్‌ కెనాల్, వీఆర్‌ కాలేజీ అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుకొచ్చామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement