నెల్లూరు నగరాన్ని గ్రీన్‌ సిటీగా మారుస్తానన్న మంత్రి నారాయణ ‘మాస్టర్‌’ స్కెచ్‌ ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మండు వేసవిలో మొక్కల పెంపకం పేరుతో అమరావతి తరహాలో రూ.కోట్ల దోపిడీకి తెర తీశారు. మొక్క నాటడం నుంచి మెయింటెనెన్స్‌ వరకు వ్యయం అంచనాలు చూస్తే కళ్ల | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు నగరాన్ని గ్రీన్‌ సిటీగా మారుస్తానన్న మంత్రి నారాయణ ‘మాస్టర్‌’ స్కెచ్‌ ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మండు వేసవిలో మొక్కల పెంపకం పేరుతో అమరావతి తరహాలో రూ.కోట్ల దోపిడీకి తెర తీశారు. మొక్క నాటడం నుంచి మెయింటెనెన్స్‌ వరకు వ్యయం అంచనాలు చూస్తే కళ్ల

Apr 12 2026 2:30 AM | Updated on Apr 12 2026 2:30 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కాలుష్యం కోరల్లో చిక్కుకున్న నెల్లూరు నగరంలో పచ్చదనం పేరుతో నగర పాలక సంస్థ ఖజానా లూటీ అయిపోతోంది. నగరాన్ని గ్రీన్‌ సిటీగా మార్చి చూపిస్తా అంటూ రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ ‘ఎన్‌’ టీమ్‌ను అడ్డం పెట్టుకుని నిరుపయోగ పిచ్చి మొక్కలతో పచ్చగా దోచుకుంటున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మొత్తం 28 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 40, 43, 44, 46, 47 డివిజన్లలో మొక్కలు నాటేందుకు వీలుకాని పరిస్థితి. దీంతో ఆ ఐదు డివిజన్లను మినహాయించి మిగిలిన 23 డివిజన్లలో మొక్కలు నాటేందుకు కార్పొరేషన్‌ అధికారులు ప్రణాళికలు తయారు చేసి తమ్ముళ్లకు అప్పగించారు. వర్కు టెండర్ల పేరుతో ఇతర కాంట్రాక్టర్లను రానివ్వకుండా తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు పనులు దక్కేలా చేసి.. తమ్ముళ్లకు సబ్‌ కాంట్రాక్ట్‌ అప్పగించి దోపిడీకి ‘గ్రీన్‌’ సిగ్నల్‌ ఇచ్చారు. మండు వేసవి కాలంలో మొక్క బతికించాలంటే మామాలు విషయం కాదు. అది కష్టతర మని తెలిసినా తమ్ముళ్లకు రూ.60 కోట్ల వరకు దోచిపెట్టేందుకు పక్కా స్కెచ్‌ వేసి అమలు చేస్తున్నారు. తొలి విడతలోనే రూ.8.03 కోట్ల వరకు కర్పూర హారతిలా ఆరగించేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడంతో నగరంలో నాటిన ఒక్క మొక్కలు ఇప్పటికే చాలా వరకు ఎండిపోయాయి.

23 డివిజన్లకు సంబంధించి మొక్కలు నాటే పనులను ఆయా డివిజన్లకు చెందిన టీడీపీ అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, కార్పొరేటర్లకు కట్టబెట్టారు. దీంతో మొక్కలు నాటడం ఓ పద్ధతి ప్రకారంగా కాకుండా తమ ఇష్టానుసారంగా మొక్కలు నాటుకుంటూ వెళ్తున్నారు. వాస్తవానికి ప్రతి 15 అడుగులకు ఒక మొక్క నాటాలి. కానీ అలా కాకుండా మొక్కల టార్గెట్‌ను పూర్తి చేసేందుకు ఇష్టానుసారంగా చెట్లు, కరెంట్‌ తీగల కింద సైతం నాటుతున్నారు. ఏ డివిజన్‌లో ఎన్ని మొక్కలు నాటారో తెలియని పరిస్థితి. లెక్కా పక్కా లేకుండా మొక్కలు నాటడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కలు నాటే పని పేరుతో తమ ఇళ్ల ముందున్న రోడ్లు ధ్వంసం చేస్తున్నారంటూ ఆయా డివిజన్లలోని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వీధుల్లో చెట్లు ఉన్నప్పటికీ కూడా వాటి పక్కనే గుంతలు తీసి మొక్కలు నాటేస్తున్నారు. ప్రధాన వీధుల్లో అయితే అసలు మొక్కలు నాటిన పరిస్థితి కనిపించడం లేదు. ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత కార్పొరేషన్‌ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

కాలుష్యం కోరల్లో ఉన్న నగరంలో నాటే మొక్కలు ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడే పరిస్థితి లేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఓ మోస్తరు స్థాయిలో పెరిగి ఆకులు పచ్చగా, రంగుల పూలు పూయడం తప్ప.. నీడను ఇవ్వని, ఆక్సిజన్‌ విడుదల చేయని టబూబియారోబియా, స్టాటోడియా, కార్డియా, బాహీమియా, లేజర్‌ స్టోమియా, టబూబియా అర్జెన్షియా వంటి మొక్కలను అత్యంత ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. వీటి ఒక్కొక్క మొక్క ఖరీదుతో నిధులు సమకూర్చే అత్యంత ఖరీదు అయిన ఎర్రచందనం, టేకు మొక్కలు రెండు.. మూడు వస్తాయని, ఇక పండ్ల ఫలాలు ఇచ్చే మామిడి, సపోటా వంటి మొక్కలు సైతం నీడతోపాటు ఆక్సిజన్‌ కూడా లభిస్తోందని చెబుతున్నారు. నగరంలో చల్లని వాతావరణం కల్పించేందుకు వేప, కానుగ వంటి మొక్కలు నాటితే పర్యావరణం కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

నీడనివ్వవు.. ఆక్సిజన్‌ విడుదల చెయ్యవు

మొక్కల పెంపకం పేరుతో

రూ.60 కోట్ల ప్రజాధనం లూటీ

నీడ, ఆక్సిజన్‌ ఇవ్వని మొక్కకు రూ.12,500 ఖర్చు

నీడనిచ్చే చెట్లకు వైఎస్సార్‌సీపీ పాలనలో రూ.750 మాత్రమే వ్యయం

నెల్లూరు నగరంలో 48 వేల మొక్కలు నాటడమే లక్ష్యం

తొలి విడతలో 16,573 మొక్కలకు రూ.8.03 కోట్ల చెల్లింపు

ఇప్పటికే నాటిన మొక్కలు ఎండిపోతున్నాయ్‌

నీళ్లు పోసే దిక్కులేక ఎండలకు మలమల మాడిపోతున్నాయి

మంత్రి నారాయణ ‘మాస్టర్‌’ స్కెచ్‌

డివిజన్ల వారీగా వివరాలు.. తమ్ముళ్ల అవినీతి పర్వం ఇలా

అమరావతికి మించిన దోపిడీ

నగరంలో మొక్కలు నాటేందుకు కోసం కార్పొరేషన్‌ అధికారులు టెండర్‌ ప్రక్రియ నిర్వహించారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి టీడీపీకి చెందిన డివిజన్‌ ఇన్‌చార్జిలకు సబ్‌ కాంట్రాక్ట్‌గా కట్టబెట్టారు. రాజమండ్రిలోని కడియంలో మొక్కలు కొనుగోలు చేసి అక్కడి నుంచి నెల్లూరు నగరానికి తీసుకు వచ్చేందుకు రూ.624.25 చొప్పున ఖర్చవుతున్నట్లు లెక్కలో చూపించారు. ఆ మొక్కను లారీలో నుంచి కిందికు దింపినందుకు కూలి, ఆ తరువాత వాటిని ట్రాక్టర్లలో నగరంలోని ఆయా డివిజన్లలోని ప్రాంతాల వద్దకు తీసుకొచ్చినందుకు ఆయ్యే ఖర్చు, మొక్క నాటేందుకు సిమెంట్‌ రోడ్డులో గుంత తీసేందుకు డ్రిల్‌ వేసి మట్టిని తీసి మొక్కను నాటి ట్రీగార్డ్‌ ఏర్పాటు చేసి నెల రోజుల పాటు నీరు పోసి సంరక్షించేందుకు ఒక్కొక్క మొక్కకు రూ.12,500 ఖర్చు పెడుతున్నట్లు కార్పొరేషన్‌ నుంచి కేటాయిస్తున్న నిధులను బట్టి స్పష్టమవుతోంది. తాజాగా అమరావతిలో జరుగుతున్న అవినీతికి మించిన దోపిడీగా కనిపిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనూ నగరంలో అనేక ప్రధాన వీధుల్లో మొక్కలు నాటించారు. ఆ మొక్కకు మొత్తం ఖర్చు కేవలం రూ.750లే అయితే.. కూటమి ప్రభుత్వంలో పిచ్చి మొక్కలను తెచ్చి ఒక్కొక్క దానికి రూ.12,500 వరకు ఖర్చు చేస్తుండడంతో నగర ప్రజలు నివ్వెరపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement