ఉదయగిరి: పట్టణంలోని శ్రీవిద్య ప్రైవేట్ వైద్యశాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాధికారి భాస్కర్‌రెడ్డి.. స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో శుక్రవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్యశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువు 2013లోనే ముగిసిందని, అయినా రెన్యువల్ చేయించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సరైన డాక్టర్లు, సిబ్బంది లేకుండానే వైద్యం చేస్తున్న విషయమై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారని, ఈ క్రమంలో ఆయన ఆదేశాలతో కలెక్టర్ సూచనల మేరకు తనిఖీలను జరిపామని వివరించారు. ఇక్కడ ఇద్దరు వైద్యులతో పాటు ముగ్గురు నర్సులు ఎలాంటి అనుమతి పత్రాల్లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారనే విషయం తేలిందన్నారు. ఫార్మసిస్ట్ కూడా లేరని తెలిపారు. వైద్యం చేసేందుకే 2013లో ప్రభుత్వం అనుమతిచ్చిందని, అయితే వారు బెడ్లను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే విషయాన్ని గుర్తించామని తెలిపారు. ల్యాబ్ నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదని.. అగ్ని నిరోధక పరికరాలు సైతం లేవని పేర్కొన్నారు. కాగా వైద్యశాలను సీజ్ చేసిన వెంటనే ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్‌స్టేషన్లో అధికార పార్టీ పెద్దలు మంతనాలు జరిపారని సమాచారం.
ఎస్బీ, కావలి డీఎస్పీల బదిలీ
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేశారు. నెల్లూరు స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న అత్తిన శ్రీనివాసరావును నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డీఎస్పీగా.. కావలి డీఎస్పీ శ్రీధర్‌ను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా పనిచేస్తున్న రమణకుమార్‌ను కావలికి నియమిస్తూ ఉత్తర్వులను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా జారీ చేశారు.


