కావలి రూరల్: ‘జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల ఆస్తి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌పరం కానివ్వబోము’ అని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను శుక్రవారం ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్థానిక మత్స్యకారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకార యువత బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వలస కూలీలుగా వెళ్తున్న పరిస్థితులను తెలుసుకుని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారన్నారు. మత్స్యకారులు తమిళనాడు, గుజరాత్, మంగళూరు, పాండిచ్చేరి వంటి ప్రాంతాలకు వెళ్లి కోవిడ్ సమయంలో అక్కడి చిక్కుకుపోయి, వారు పడిన ఇబ్బందులను గుర్తించి రూ.289 కోట్లతో శరవేగంగా ఫిషింగ్ హార్బర్‌ను నిర్మించారన్నారు. 1,250 మెకనైజ్డ్ బోట్లు ఏకకాలంలో నిలబెట్టేలా బెర్త్‌లతో నిర్మించారన్నారు. జువ్వలదిన్నెతోపాటు తీర ప్రాంతంలోని మత్స్యకారులను సుసంపన్నులుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో, వారికి సొంతూర్లలోనే ఉపాధి దొరికేలా సుమారు రూ.3 వేల కోట్లతో 11 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.
ఎన్నికల కోడ్ రావడమే శాపం
కేవలం రెండేళ్లలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పూర్తి చేసి మత్స్యకారులకు అప్పగించే సమయానికి ఎన్నికల కోడ్ రావడం మత్స్యకారులకు శాపంగా మారిందని రామిరెడ్డి అన్నారు. అయితే అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వారి కుటుంబాలకు ఏ విధంగా అన్యాయం చేస్తుందో ప్రజలంతా చూస్తున్నారన్నారు. 70 ఎకరాల్లో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను మత్స్యకారులకు ఒక ఆస్తిగా యువతకు జీవనోపాధి కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తే దానిని టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థకు ధారదత్తం చేసేందుకు అందులో 29.5 ఎకరాలను ఇచ్చిందన్నారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్‌పరం చేయడాన్ని అడ్డుకోకపోతే రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న మిగతావాటిని కూడా ప్రైవేట్ వారికి ఇచ్చేస్తారన్నారు.
ఐక్యంగా ఉండకపోతే ఉనికికే ప్రమాదం
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను మత్స్యకారులందరూ పార్టీలకతీతంగా ఐక్యత చూపి కాపాడుకోకపోతే.. భవిష్యత్‌లో మత్స్యకారుల ఉనికికే ప్రమాదం తప్పదని ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యకారుల హక్కులను కాపాడేందుకే జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిపారు. మత్స్యకారులంతా ఇటీవల తీర ప్రాంతంలో తమకు జరిగిన అన్యాయంపై, తమ హక్కుల పోరాటంపై చర్చించారన్నారు. ఆయన కచ్చితంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి కీలకమైన ప్రకటన చేస్తారని, మత్స్యకార యువత, మహిళలు, కాపులు, పెద్దలతో కూడా జువ్వలదిన్నెలో సమావేశమవుతారన్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకార గ్రామాలందరూ జగన్ పర్యటకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కావలి పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు, మత్స్యకార నాయకులు కొండూరు శ్రీనివాసులు, కొమరగిరి రాజు, కావలి రూరల్ మండల కన్వీనర్ వాయిల తిరుపతి, మాజీ సర్పంచ్ గోవిందస్వామి, మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కూటమి కుట్రలతో ప్రైవేట్‌పరం
చేస్తుంటే చూస్తూ ఊరుకోము
మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
జువ్వలదిన్నెలో హెలిప్యాడ్ సందర్శన


