ఆత్మకూరురూరల్: హైదరాబాద్ నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలోని అనుమసముద్రంపేట వరకు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వేమూరు కావేరి ట్రావెల్స్ బస్సును అధికారులు శుక్రవారం మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం కూడలి వద్ద సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, ఎంవీఐ మండ్ల రాములు, రవాణా శాఖాధికారులు గోపీనాయక్, సంధ్య మాట్లాడుతూ నిబంధనలు పాటించని వాహనాలపై చట్ట ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులను బస్సులో అనుమసముద్రంపేట వరకు తీసుకెళ్లి వదిలారు. అనంతరం బస్సును ఏఎస్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
ఉరేసుకుని
యువతి ఆత్మహత్య
ఆత్మకూరురూరల్: ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై జిలానీ బాషా కథనం మేరకు.. బెల్లంకొండ హజరత్తయ్య మున్సిపాలిటీలో నీరు విడుదల చేసే పనులు చేసుకుంటూ టిడ్కో భవన సముదాయంలో ఉంటున్నాడు. శుక్రవారం అతను పనికి వెళ్లగా భార్య, కుమార్తె బెల్లంకొండ పావని (25) మాత్రమే ఇంట్లో ఉన్నారు. కుక్కను బయట తిప్పి తీసుకొస్తానని కుమార్తెతో చెప్పి తల్లి వెళ్లింది. తిరిగొచ్చి చూసేలోగా కుమార్తె చున్నీతో ఉరేసుకుని ఉంది. వెంటనే ఆమె భర్తకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. కాగా పోలీసులకు అందిన వివరాల ప్రకారం పావని గతంలో టీటీసీ పరీక్ష రాసి పాసైంది. ఇటీవల డీఎస్సీ పరీక్ష రాసి క్వాలిఫై కాలేదు. ఈ నేపథ్యంలో తరచూ ఆవేదన చెందుతుండేది. ఆ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై జిలానీబాషా వెల్లడించారు.
ఈనెల 26 నుంచి
క్రీడా ఎంపికలు
నెల్లూరు(టౌన్): వివిధ రకాల క్రీడల్లో బాలబాలికలకు ఈనెల 26వ తేదీ నుంచి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్‌డీఓ జసీం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 జనవరి ఒకటి నుంచి 2011 జనవరి ఒకటో తేదీలోపు జన్మించి ఉండాలన్నారు. విశాఖప ట్నంలోని అకాడమీలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్ విభాగాల్లో అండర్ 15 నుంచి 19 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న బాలురకు, కాకినాడ అకాడమీలో వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో విభాగాల్లో బాలికలకు శిక్షణ ఇస్తారన్నారు. తిరుపతి అకాడమీలో జూడో, బాక్సింగ్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో రెసిడెన్షియల్స్ సౌకర్యంతో, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ విభాగాల్లో బాలబాలికలకు డే బోర్డర్ ఏర్పాట్లతో శిక్షణ ఉంటుందన్నారు. హాజరయ్యే బాలబాలికలు వయస్సు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, చదువుతున్న పాఠశాల లేదా కళాశాల, క్రీడా ప్రతిభ, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలన్నారు. వివరాలకు http://sports.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.


