నెల్లూరువాసికి అరుదైన గౌరవం | - | Sakshi
Sakshi News home page

నెల్లూరువాసికి అరుదైన గౌరవం

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరుకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌, శాస్త్రవేత్త డాక్టర్‌ అనుముకొండ వరదరాజులు అరుదైన గౌరవాన్ని అందుకోవడం ఎంతో గర్వకారణమని జాయింట్‌ కలెక్టర్‌ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. అమెరికాలో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రకటించే ప్రపంచంలోని టాప్‌ – 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో వరదరాజులు వరుసగా (2021 – 2025) స్థానం సంపాదించినట్లు చెప్పారు. 75 సంవత్సరాల వయస్సులోనూ నిరంతర పరిశోధనలతో ముందుకు సాగుతూ శాస్త్రరంగంలో విశేష కృషి చేయడం యువతకు ఆదర్శమన్నారు. నానో మెడిసిన్‌ రంగాల్లో వరదరాజులు చేసిన పరిశోధనలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయన్నారు.

● వరదరాజులు మాట్లాడుతూ సొంతరూ నెల్లూరంటే ప్రత్యేక అభిమానమన్నారు. వీఆర్‌ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందినట్లు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా సేవలందించి 2010లో ఉద్యోగ విరమణ చేశానన్నారు. పర్యావరణానికి అనుకూలమైన ప్లాస్టిక్‌, సంప్రదాయ భారతీయ పదార్థాలను ఆధునిక నానోకాంపోజిట్లుగా అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. తన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపును నెల్లూరు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను జేసీ అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో విజయ్‌కుమార్‌, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement