జిల్లా ప్రజలకు వరప్రదాయిని అయిన సోమశిల జలాశయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అప్రాన్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని
ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
సోమశిల: వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న అప్రాన్ మరమ్మతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ టెండర్‌ను దక్కించుకున్నాడు. అప్పుడు రూ.22 కోట్ల మేర పనులు జరిగాయి. 2024లో కూటమి ప్రభుత్వం రీ టెండర్లు పిలిచింది. నాయకులు పనులను అట్టహాసంగా ప్రారంభించారు. అయితే సుమారు 40 శాతం కూడా పూర్తి కాకముందే కాంట్రాక్టర్ గాలికొదిలేశాడని స్థానికులు చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణం పెండింగ్ బిల్లులు జమకాలేదని తెలుస్తోంది.
పాచి పట్టిన రహదారి
సోమశిల నుంచి కలువాయి వైపు వెళ్లాంటే అప్రాన్ మీదుగా రాకపోకలు సాగించాలి. పెన్నానదికి నీరు విడుదల చేసిన సమయంలో భారీ వాహనాలను అనుమతించరు. జలాశయం మీద నుంచి చిన్న చిన్న వాహనాలను మాత్రమే వెళ్లనిస్తారు. అప్రాన్ పనులు నిలిచిపోవడంతో రహదారి పక్కనే ఉన్న గుంతల నుంచి నిరంతరం ఊట నీరు బయటకు ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై నిత్యం నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రదేశమంతా పాచిపట్టి ప్రమాదకరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు నీరు నిలిచిన మార్గంలో వెళ్లేందుకు భయపడుతున్నారు. పక్కకు జరిగి వెళ్లాలంటే అప్రాన్ పైన పెద్ద ఇనుపరాడ్లు అడ్డుగా ఉన్నాయి. ఏ మాత్రం ఆదమరిచి జారి పడినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళనలో ఉన్నారు.
మాటలు చెప్పి..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్ట్ నెలలో స్వయంగా సీఎం చంద్రబాబు, కూటమి ముఖ్యనేతలు జలాశయాన్ని సందర్శించారు. 60 రోజుల్లో జలాశయ అప్రాన్ పనులు పూర్తి చేస్తామని సభలో సీఎం ప్రకటించారు. అనంతరం కొన్నిరోజులకు పనుల ప్రారం భోత్సవాల సమయంలో పెద్దఎత్తున కూటమి నాయకులు షో చేశారు. కానీ ఆ తర్వాత పనుల పర్యవేక్షణను పూర్తిగా విస్మరించారు.
రహదారి పక్కన అప్రాన్‌పై ఉన్న గుంతలు
రక్షణ గోడపై నిల్వ చేసిన ఇసుక దిబ్బ
సోమశిల అప్రాన్ పనుల్లో ఇదీ పరిస్థితి
ప్రమాదపు అంచున వాహనదారుల ప్రయాణం
కూలిపోయే స్థితిలో రక్షణ గోడ
ప్రభుత్వ తీరుపై ప్రజల ఆగ్రహం
కార్యాలయాలకే పరిమితం
ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వారు కార్యాలయాలకే పరిమితమై వచ్చామా.. వెళ్లామా అన్నట్లు ఉంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలున్నాయి. అప్రాన్ మీదుగా వెళ్లే మార్గంలో బ్రిడ్జిపై కనీస రక్షణ కరువైంది. బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడలు, ఇనుప కమ్ములు, సిమెంట్ దిమ్మెలు వంటివి ఉండాలి. కానీ ఆ ప్రదేశంలో అలాంటివి ప్రస్తుతం లేవు. ప్రమాదవశాత్తు వాహదారులు కింద పడితే ప్రాణాలు పోతాయి. దీంతోపాటు ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన యాత్రికులు నిషేధిత ప్రాంతాలకు వెళ్లకూడదని చెప్పే అధికారే కనిపించకపోవడం బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు క్రేన్ ఎక్కి విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అప్రాన్ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రక్షణ గోడకు ముప్పు
కాంట్రాక్టర్ పనుల కోసం నిల్వ చేసిన భారీ ఇసుక దిబ్బల వల్ల జలాశయం ముందు భాగాన ఉన్న రక్షణ గోడపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో ఇప్పటికే అక్కడక్కడా పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారులు తక్షణం స్పందించకపోతే రక్షణ గోడ కూలిపోయి పెను ప్రమాదం జరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు.


