ఇరాన్‌తో చర్చలు విఫలం: జేడీ వాన్స్‌ సంచలన ప్రకటన | US JD Vance says Iran has not agreed to US terms | Sakshi
Sakshi News home page

ఇరాన్‌తో చర్చలు విఫలం: జేడీ వాన్స్‌ సంచలన ప్రకటన

Apr 12 2026 7:31 AM | Updated on Apr 12 2026 8:31 AM

US JD Vance says Iran has not agreed to US terms

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన ఇరాన్‌, అమెరికా మధ్య చర్చలు విఫలమయ్యాయి​. అర్ధాంతరంగా చర్చలు ముగించి  జేడీవాన్స్‌ బృందం వెళ్లిపోయింది. దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్‌, అమెరికా చర్చల అనంతరం జేడీ వాన్స్‌ మీడియాతో మాట్లాడుతూ..‘రెండు దేశాల మధ్య చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇరాన్‌తో చర్చలు విఫలమయ్యాయి. మా డిమాండ్లను ఇరాన్‌ అంగీకరించలేదు. అందుకే ఇరాన్‌తో డీల్‌ లేదు. ఇస్లామాబాద్‌ వేదికగా ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనుదిరుగుతున్నాం. ఎలాంటి అంగీకారం లేకుండా వెనక్కి వెళ్తున్నాం. మా నిబంధనలు అంగీకరించేందుకు ఇరాన్‌ సిద్దపడట్లేదు. ఇరాన్‌ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలి. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ పరిణామం ఇరాన్‌కు కచ్చితంగా బ్యాడ్‌ న్యూస్‌’ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇక, ఈ చర్చలలో పాకిస్తాన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఇరుపక్షాల మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఇస్లామాబాద్‌ అద్భుతంగా పనిచేసిందన్నారు. చర్చల్లో ఏవైనా లోపాలుంటే పాకిస్తాన్‌ వల్ల కలిగినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చారు. అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ఇరాన్ నుండి నిశ్చయాత్మక హామీ రాలేదని జేడీ వాన్స్ అన్నారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం​ కలిగిస్తాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాకిస్తాన్‌ నుంచి జేడీ వాన్స్‌ బృందం.. అమెరికాకు బయలుదేరింది. 

అయితే, హార్మూజ్‌ జలసంధిని తెరవాలన్నది అమెరికా డిమాండ్‌. అలాగే, యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఇరాన్‌కు అమెరికా కోరింది. ఇందుకు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. విదేశాల్లోని తమ ఆస్తులపై ఉన్న ఫ్రీజ్‌ను తొలగించాలని ఇరాన్‌ కోరినట్టు తెలిసింది. 

ఇదిలా ఉండగా.. అంతకుముందు పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతిచర్చలు ముగిశాయి. దాదాపు 14 గంటలపాటు చర్చలు కొనసాగినట్లు ఇరాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇరుదేశాలకు చెందిన సాంకేతిక బృందాలు నిపుణుల నివేదికలను పంచుకున్నట్లు తెలిపింది. కొన్ని అంశాలపై విభేదాలు ఉన్నప్పటికీ చర్చలు కొనసాగుతాయని ఇరాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం మరో విడత చర్చలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement