వింజమూరు(ఉదయగిరి): పలువురికి పీఎం కిసాన్ నిధులు త్వరలో జమకానున్నాయని మండల వ్యవసాయాధికారి వాసు తెలిపారు. వ్యవసాయ కార్యాలయం వద్ద ఆందోళన అనే శీర్షికన సాక్షిలో కథనం శనివారం ప్రచురితమైన నేపథ్యంలో స్పందించిన ఆయన సాక్షితో మాట్లాడారు. సదరు రైతులకు సంబంధించిన డేటాను గతేడాది అక్టోబర్‌లో ఆన్‌లైన్లో నమోదు చేశామని, అయితే జూలై వరకు నమోదైన వారికే పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను సర్కార్ విడుదల చేసిందని వివరించారు. దీంతో వీరికి అందలేదని, త్వరలో ప్రభుత్వం విడుదల చేసే నిధులు వారి ఖాతాల్లో పడతాయని వెల్లడించారు. దీనికి సంబంధించిన పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డులను పరిశీలించి జిరాక్స్‌లను జేడీ కార్యాలయానికి పంపనున్నామని తెలిపారు. మండలంలో అర్హులై, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు రాకపోతే ఒరిజినల్ పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డుతో తమను గురువారంలోపు సంప్రదించాలని సూచించారు.
పాఠశాలల్లో 16 నుంచి
ఎఫ్‌ఎల్‌ఎస్ సర్వే
నెల్లూరు (టౌన్): జిల్లాలోని 28 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మూడో తరగతి విద్యార్థులు ట్యాబ్‌లను ఉపయోగించి ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్) సర్వేను ఈ నెల 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిపుణ్ భారత్ నిర్దేశించిన విద్యా లక్ష్యాలు ఎంత మేరకు సఫలీకృతమయ్యాయో తెలుసుకునేందుకు గానూ ఈ సర్వేను ఎన్సీఈఆర్టీ చేపడుతోందని వివరించారు. సమగ్రాభివృద్ధి ప్రదర్శన, మూల్యాంకనం, సమీక్ష, జ్ఞాన విశ్లేషణను ప్రకాష్ సంస్థ ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహిస్తోందని వివరించారు. జిల్లాలోని 19 మండలాల్లో గల ఐదు ప్రైవేట్, కేంద్రీయ విద్యాలయం, 22 ప్రభుత్వ పాఠశాలల్లో సర్వేను జరపనున్నారని తెలిపారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు లేదా డైట్ విద్యార్థులను ఉపయోగించి వారికి ట్యాబ్‌ల వినియోగ విధానంపై శిక్షణను ఈ నెల 13, 14న నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
పోర్టు నుంచి
వంట నూనె ఎగుమతి
ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి వంట నూనెల ఎగుమతులు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ మాట్లాడారు. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ రిఫైనరీ నుంచి నేరుగా పైప్‌లైన్ ద్వారా వంట నూనెను లోడ్ చేసిన ఎమ్టీ థెరీసా అక్వేరియస్ నౌకను విజయవంతంగా నిర్వహించామని వివరించారు. దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న ధ్రవ కార్గో రంగానికి వైవిధ్యభరితమైన ఎగుమతి గేట్‌వేగా కృష్ణపట్నం పోర్టు సుస్థిరమైన స్థానాన్ని సాధించిందని వెల్లడించారు.
కల్యాణం.. కమనీయం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో వెలసిన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణాన్ని నేత్రపర్వంగా శనివారం నిర్వహించారు. అభిషేకం, సుప్రభాతం, పూలంగిసేవను జరిపారు. తిరుచ్చిలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్‌సేవను నిర్వహించారు. శ్రీవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
● పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళాన్ని వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం వెంకటగారిపల్లికి చెందిన అంజలి అందజేశారు.


