రూ. 158 కోట్ల అప్పు : జో బైడెన్ కొడుకు అమెరికా విడిచి పారిపోయాడా? | Joe Bidens son Hunter has left the US with USD 17 million in debt | Sakshi
Sakshi News home page

రూ. 158 కోట్ల అప్పు : జో బైడెన్ కొడుకు అమెరికా విడిచి పారిపోయాడా?

Apr 11 2026 7:31 PM | Updated on Apr 11 2026 7:31 PM

Joe Bidens son Hunter has left the US with USD 17 million in debt

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు 56 ఏళ్ల  హంటర్ బైడెన్ అప్పుల్లో కూరుకుపోయారా? తాజా వార్తలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.  17 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 158 కోట్లు) అప్పు చూపించి  అమెరికానుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తన మాజీ న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల విషయంలో కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వాషింగ్టన్ డిసిలో, విన్‌స్టన్ & స్ట్రాన్ అనే తన మాజీ న్యాయ ప్రతినిధులు దాఖలు చేసిన ఒక వ్యాజ్యం విచారణలో ఏప్రిల్ 6న అతని న్యాయవాది బ్యారీ కోబర్న్ సమర్పించిన పత్రంలో, బైడెన్ దేశంలోని లేరని, విదేశాలలో నివసిస్తున్నారని కోర్టుకు తెలిపారు. అయితే, ఆయన కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే సమాచారం తన వద్ద కూడా లేదని వెల్లడించారు.

విన్‌స్టన్ అండ్ స్ట్రాన్ అనే న్యాయవాద సంస్థకు హంటర్ సుమారు 50,000 డాలర్లు (దాదాపు రూ. 43 లక్షలు) బకాయి ఉన్నారని పేర్కొంటూ, ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకే ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. పన్ను ,తుపాకీ నేరాల కేసులతో పాటు ఇతర న్యాయ పోరాటాలలో కూడా  హంటర్‌ తరపున వాదించిన విన్‌స్టన్ & స్ట్రాన్ న్యాయ సంస్థ, హంటర్‌  తమ బిల్లులు చెల్లించడంలో విఫలమయ్యాడని ఆరోపిస్తోంది. 

మరోవైపు బైడెన్ స్వయంగా తన ఆర్థిక ఇబ్బందుల తీవ్రతను బహిరంగంగా అంగీకరించారు. గత సంవత్సరం ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, తాను సుమారు 17 మిలియన్ డాలర్ల  మేర  న్యాయపరమైన అప్పును కలిగి ఉన్నానని ఆయన వివరించినట్లు డైలీ మెయిల్ నివేదించింది.

అలాగే గత ఏడాది నవంబర్‌లో ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, బైడెన్  దక్షిణాఫ్రికాలోని ఒక  నగరాన్ని ఆప్యాయంగా వర్ణిస్తూ, తాము దక్షిణాఫ్రికా , అమెరికా మధ్య సమయాన్ని గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు అదే నెలలో, విదేశీ ప్రయాణ ఖర్చులను కారణంగా చూపుతూ అధ్యక్షుడు ట్రంప్ అతని సీక్రెట్ సర్వీస్ రక్షణను రద్దు చేసిన నేపథ్యంలో బైడెన్‌ కుటుంబం ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తలదాచుకుంటున్నట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. కేప్ టౌన్ వాస్తవ్యురాలైన బైడెన్ భార్య మెలిస్సాతో 2025 మే నెలలో  దక్షిణాఫ్రికాలో కనిపించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పినప్పటికీ, ఈ నెలలో కాలిఫోర్నియాలోని శాంటా యినెజ్‌లో జరిగిన ఒక ఈస్టర్ కుటుంబ సమావేశంలో బైడెన్ పాల్గొనడంతో సుమారు 10,000 మైళ్ల రౌండ్ ట్రిప్‌కు ఎవరు నిధులు సమకూర్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హంటర్‌కు ఆర్థికమద్దతు లభించింది  ప్రధానంగా హాలీవుడ్ న్యాయవాది కెవిన్ మోరిస్ నుండే. అతను  బైడెన్‌కు 6.5 మిలియన్ డాలర్లకు పైగా రుణం ఇచ్చారు. అలాగే, తండ్రి  జో బైడెన్‌ అధ్యక్షపదవిలో  ఉన్న సమయంలో కళారంగం ( ఆర్ట్‌ అండ్‌ పెయింటింగ్స్‌) ద్వారా 1.5 మిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement