బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటించనున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పర్యటనకు అవసరమైన హెలిప్యాడ్‌ను ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పుట్టా శివశంకర్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, స్థానిక మత్స్యకారులతో కలిసి కాకాణి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మత్స్యకారుల హక్కులను కాలరాసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. వలసలను నివారించి మత్స్యకారులకు సుస్థిరమైన ఉపాధి చూపాలనే లక్ష్యంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను తమ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించారని గుర్తుచేశారు. పది శాతం పనులు మాత్రమే పెండింగ్ ఉన్న దశలో ఎన్నికలు రావడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిగిలిన వాటిని పూర్తి చేసి హార్బర్‌ను మత్స్యకారులకు అంకితం చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ప్రైవేట్‌పరం చేసే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. హార్బర్ వద్ద స్థలాన్ని సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ సంస్థకు కేటాయించి క్రమంగా హార్బర్‌ను ప్రైవేట్‌కు కట్టబెట్టేలా యోచన చేయడం దారుణమన్నారు. హార్బర్ సమీపంలోని స్థలాలను ఇలా అప్పజెప్తే మత్స్యకారుల పరిస్థితి తారుమారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పడవల సంఖ్య పెరిగినా, హార్బర్‌లో స్థలం లేక ఇబ్బందులు తప్పవన్నారు. తీరాన్ని ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడితే మత్స్యకారులు రాకపోకలు సాగించాలన్నా, ఆయా సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల ఆస్తి అయిన హార్బర్‌ను నిషేధిత ప్రాంతంగా పోలీస్ పహారా ఏర్పాటు చేయడమెంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మత్స్యకారులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి.. జువ్వలదిన్నెలో బుధవారం పర్యటించి వారితో మమేకం కానున్నారని వివరించారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనీయబోమని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంలో
మత్స్యకారులకు ముప్పు
తీరాన్ని క్రమంగా ప్రైవేటీకరించే కుట్ర
హార్బర్‌ను నిషిద్ధ ప్రాంతంగా పేర్కొంటూ పోలీస్ పహారా
జాలర్లకు అన్యాయం జరిగితే సహించేది లేదు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


