హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అంటున్న విశ్లేషకులు
ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన వైనం
మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి వెనుక బాబు హస్తం
పాత్రికేయుడు పింగళి దశరథరామ్ పాశవిక హత్యలోనూ భాగం
వంగవీటి రంగా హత్యకు కుట్రదారుడన్నదీ బహిరంగ రహస్యం
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హత్య
హంతకులకు హైదరాబాద్‌లో నెల రోజులు షెల్టర్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అరాచకశక్తిగా చెలరేగిన వైనం
బస్సు దహనాలు చేయాలని ఆదేశించేవారని దేవినేని నెహ్రూ వెల్లడి
2024 నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ వికటాట్టహాసం
21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలు.. మొత్తం 710 హత్యలు
చంద్రబాబు దారుణాలను పూసగుచ్చినట్లు వివరించిన ఆయన తోడల్లుడు దగ్గుబాటి, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య
సాక్షి, అమరావతి: హత్యా రాజకీయాలపై చంద్రబాబు, టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హత్యా రాజకీయాలకు తెరతీసిందే చంద్రబాబు అని, ఇది చరిత్ర చెబుతున్న పచ్చి నిజం అని వక్కాణిస్తున్నారు. గతంలో రౌడీలు, అసాంఘిక శక్తుల పరస్పర ఘర్షణల్లో అప్పుడప్పుడు హత్యలు జరుగుతుండేవి. కానీ రాజకీయ ఆధిపత్యం కోసం, ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడం కోసం హత్యలకు తెగబడే ఒరవడిని తీసుకువచ్చింది మాత్రం కచ్చితంగా చంద్రబాబేనని రాజకీయ విశ్లేషకులు గతంలోనే కుండబద్దలు కొట్టారు.
అధికారంలో ఉంటే పోలీసుల సహకారంతో హత్యలకు బరితెగించడం.. ప్రతిపక్షంలో ఉంటే అరాచక శక్తులతో హత్యలకు తెగబడే విధానాన్ని టీడీపీ అధికారిక విధానంగా చేసిందీ చంద్రబాబే అంటున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన చంద్రబాబు.. ఇక తన ప్రభుత్వ హయాంలో ఇంకెతంగా బరితెగించి ఉంటారన్నది ఊహకే అందని దారుణం అని పలు ఘటనలను ప్రస్తావిస్తున్నారు. నాడు విజయవాడలో మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతి నుంచి.. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగుతున్న హత్యాకాండ వరకు అన్ని దారుణాల్లో అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చర్చకొచ్చిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్‌పై హత్యాయత్నం కుట్ర కప్పిపుచ్చి..
1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరని చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మామగారిపైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. అలాంటి చంద్రబాబు 1983లో టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ప్లేటు ఫిరాయించి ఆ పార్టీలో చేరారు. అప్పటి నుంచే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో హత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. అతను ఎన్టీరామారావుపై ఎందుకు హత్యాయత్యానికి పాల్పడ్డారన్నది పోలీసుల విచారణలో వెల్లడవుతుందని అందరూ ఆశించారు.
కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే మల్లెల బాబ్జీ విజయవాడలోని ఓ లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించడం గమనార్హం. కాగా అతని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వా«దీనం చేసుకున్నారు. తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి కేవలం రూ.30 వేలే ఇచ్చారని ఆ లేఖలో ఉండటం గమనార్హం. కాగా, ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయకుండా అప్పటి రాజ్యాంగేతర శక్తి చంద్రబాబే అడ్డుకున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏకంగా ముఖ్యమంత్రిపైనే హత్యాయత్నం చేసిన నిందితుడు అనుమానాస్పద మృతి.. అతను రాసిన లేఖపై పోలీసుల మౌనం.. అంతా పక్కా పన్నాగంతోనే సాగాయన్నది స్పష్టమైంది. ఎన్టీ రామారావు హత్యకు గురైతే రాజకీయ అధికారం ఎవరికి దక్కుతుందన్నది కీలకంగా మారింది. దాంతో సహజంగానే చంద్రబాబుపైనే అందరికీ సందేహం కలిగింది. ఆ వాస్తవాన్ని శాశ్వతంగా కప్పిపుచ్చే కుట్ర నేపథ్యంలోనే మల్లెల బాబ్జీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై చంద్రబాబే సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు, పరిశీలకులు ఎన్నోసార్లు డిమాండ్ చేసినా ఆయన మౌనంగా ఉండిపోవడం సందేహాలను మరింత బలపరుస్తోంది.
పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్య
టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ పాశవిక హత్యను రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో చంద్రబాబు రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిపోతున్న సమయంలోనే దశరథ రామ్‌పై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరగడం గమనార్హం. విజయవాడలో జరిగిన టీడీపీ మహానాడులోనే హత్య చేసేందుకు యత్నించారు. ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే మారణాయుధాలతో వెంటబడ్డారు. 1985 అక్టోబర్ 20న రాత్రి విజయవాడలో రిక్షాలో వెళుతున్న దశరథ రామ్‌ను దారి కాచి మరీ దారుణంగా హత్య చేశారు.
కొన ప్రాణాలతో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పినా సరే పోలీసులు ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేశారు. అంటే అప్పటి ప్రభుత్వ పెద్దల దన్నుతోనే దశరథ రామ్‌ను హత్య చేశారన్నది స్పష్టమైంది. దశరథ రామ్ హత్య ఉదంతంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. ఆ హత్య వెనుక సూత్రధారులు ఎవరన్నది బయటకు రాకుండా ప్రభుత్వం మేనేజ్ చేసింది.
రంగా హత్య కుట్రదారు చంద్రబాబే
చంద్రబాబు హత్యా రాజకీయాలకు పరాకాష్ట వంగవీటి మోహన రంగా దారుణ హత్యే అని పలువురు నేతలు నొక్కి చెప్పారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చెలరేగిపోయిన చంద్రబాబుకు విజయవాడలో ప్రజా నాయకుడు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వంగవీటి రంగా అడ్డుగా నిలిచారు. దాంతో రంగా హత్యకు టీడీపీ కుట్ర పన్నింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఆయనకు అత్యంత సన్నిహితుడు అయిన అప్పటి హామ్ మంత్రి కోడెల శివప్రసాదరావు ఈ కుతంత్రానికి తెర తీశారు. పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను 1988 డిసెంబర్ 25 అర్ధరాత్రి తర్వాత టీడీపీ రౌడీ మూకలు నరికి చంపాయి.
ఆ రోజు రంగా హత్యలో స్వయంగా పాల్గొన్నారని నిందితుల జాబితాలో ఉన్న వెలగపూడి రామకృష్ణకు చంద్రబాబు 2009లో విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం గమనార్హం. తద్వారా వంగవీటి రంగా హంతకులకు చంద్రబాబు అండదండలు ఉన్నాయనే విషయం మరోసారి నిరూపితమైంది. వెలగపూడి రామకృష్ణ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా విశాఖపట్నంలో కీలక నేతగా ఉన్నారు. చంద్రబాబు అండతో టీడీపీ మద్యం సిండికేట్‌కు రింగ్ మాస్టర్‌గా దందా కొనసాగిస్తున్నారు.
చంద్రబాబు అండతోనే వైఎస్ రాజారెడ్డి దారుణ హత్య
రాజకీయ ప్రత్యర్థులను అడ్డం తొలగించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగబడతారనడానికి వైఎస్ రాజారెడ్డి దారుణ హత్యే నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 1998లో వైఎస్ రాజారెడ్డిని కడప జిల్లాలో పాశవికంగా హత్య చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు అండతోనే ఈ హత్యకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. అందువల్లే హంతకులకు 30 రోజులపాటు చంద్రబాబే హైదరాబాద్‌లో ఆశ్రయం ఇప్పించారని అప్పట్లోనే వెల్లడైంది.
ఈ హత్యపై పోలీసులు నమోదు చేసిన కేసులో ఆధారాలు లేవని మొదటి అదనపు సెషన్స్ న్యాయస్థానం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం దీనిపై కోర్టులో కౌంటర్ కూడా వేయలేదు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో 11 మంది నిందితులకు న్యాయస్థానం 2006లో యావజ్జీవ ఖైదు విధించింది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న రాగిపిండి సుధాకర్ రెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడం గమనార్హం.
ప్రతిపక్షంలో ఉంటే బాబు అరాచక శక్తే
టీడీపీ ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు అరాచక శక్తిగా చెలరేగిపోయేవారన్నది బహిరంగ రహస్యం. 1989–94లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా ఆందోళన పేరిట బస్సులను దహనం చేయాలని చంద్రబాబు ఆదేశించేవారని అప్పటి టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీవీ చానళ్ల ఇంటర్వ్యూల్లో వెల్లడించడం గమనార్హం. కొన్ని బస్సులు తగలబడాలి.. కొందరు సామాన్యులు చనిపోవాలి.. అప్పుడే ఆందోళన విజయవంతమైనట్టని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని ఆయన చెప్పడం గమనార్హం.
బాబు ఘాతుకాలకు ఆయన తోడల్లుడే సాక్షి
పిల్లనిచ్చిన సొంత మామ అయిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కోవడంతో పాటు చంద్రబాబు సీఎం కావడం వెనుక సత్యాలను ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావే స్వయంగా చెప్పారు. ఒక చరిత్ర కొన్ని నిజాలు – సత్యానికి మరో కోణం పుస్తకాల్లో బాబు ఘాతుకాలను సవివరంగా పేర్కొన్నారు. ఆగస్టు తిరుగుబాటులో చంద్రబాబు పోషించిన పాత్రను దగ్గుబాటి బట్టబయలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య సైతం చంద్రబాబు దారుణాలను తాను రాసిన ‘60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో వివరించారు.


