సాక్షి, విశాఖపట్నం: బస్టాండ్‌లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి షాక్ తగిలింది. ఉచిత బస్సు పథకం ఎలా ఉందంటూ ప్రయాణికురాలను మంత్రి అడిగారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపయోగం లేదంటూ ఆ మహిళ తేల్చి చెప్పింది. ఉచిత బస్సు పథకంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ప్రయాణికుల మధ్య గొడవలు అవుతున్నాయని చెప్పింది. మహిళ సమాధానంతో షాక్ తిన్న మంత్రి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, ఫ్రీ బస్సు పథకం మహిళల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. ఆర్టీసీ బస్సులో ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్న ఘటన ఇటీవల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్‌లో మహిళలు కొంతమంది సీట్లలో కూర్చున్నారు. సీట్లు ఖాళీలేక మరి కొంతమంది నిలబడ్డారు.

సీట్లు లేని మహిళలు బస్సులో నిలబడలేకపోవటంతో సీట్లలో కూర్చున్న మహిళలపై అవాకులు చెవాకులు పేలారు. ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్నారు. అదే సమయంలో పక్కనున్న మహిళలకు కూడా తగలటంతో వారంతా మరో మహిళ చేయిపట్టుకుని దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కండక్టర్ వారితో మాట్లాడి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు.

మరో ఘటనలో.. ‘ఉచిత బస్సు కావాలని ఎవరడిగారు. ఉల్లి సాగుచేసి నాశనమయ్యాం. క్వింటాలు ఉల్లిని రూ.200కు అడుగుతున్నారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. రైతులను పట్టించుకునే వారు లేరు. 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు కొత్త పింఛన్‌లే లేవు. ఉచిత బస్సు ప్రయాణం వద్దు. టికెట్ ఇవ్వండి’ అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ టికెట్ తీసుకున్నారు.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్టోబర్ 26వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చిన్నటేకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతుల్ని ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారు.


