నెత్తుటి మరకలు
ఆందోళనలో సిటీ ఆఫ్ డెస్టినీ 2024లో 24 కాగా.. 2025లో 35 హత్యలు పెరిగిన ద్వేషపూరిత నరహత్యలు రక్తసిక్తం అవుతున్న రహదారులు 2025లో 349 మంది దుర్మరణం తగ్గిన చోరీలు.. పెరిగిన రికవరీలు మొత్తంగా 12.71 శాతం తగ్గిన నేరాల రేటు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడి
8లో
ట్రాఫిక్ కఠినం.. అయినా ఆగని మరణాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చినా, మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 2024లో 1,132 ప్రమాదాలు జరగ్గా, 2025లో 1,086 ప్రమాదాలు సంభవించాయి. అయితే మృతుల సంఖ్య 347 (2024) నుంచి 349కి (2025) చేరింది. స్పీడ్ లేజర్ గన్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహణ, బైక్ రేసర్లపై కేసులు వంటి చర్యలతో ప్రమాదాలు అదుపులోకి వచ్చాయి. వచ్చే ఏప్రిల్ నాటికి ప్రైవేట్ సంస్థల సహకారంతో ట్రాఫిక్ ఉల్లంఘనులకు ఆటోమేటిక్‌గా ఫైన్‌లు వేసే ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
విశాఖపై
విశాఖను సురక్షిత నివాస ప్రదేశంగా మార్చడానికి పోలీస్ శాఖ చేపట్టిన సమర్థవంతమైన చర్యలతో నగరంలో నేరాలు 12.71 శాతం మేర తగ్గుముఖం పట్టాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025లో పోలీసులు సాధించిన ప్రగతి, ఛేదించిన కేసుల వివరాలను సీపీ వెల్లడించారు. 2024లో 5,921 కేసులు నమోదు కాగా.. 2025లో 5,168 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో మరింత సమర్థవంతమైన పోలీసింగ్‌తో, అత్యాధునిక సాంకేతికతను జోడించి ‘ప్రశాంత విశాఖే’లక్ష్యంగా ముందుకు వెళతామని సీపీ స్పష్టం చేశారు.
తొలిసారిగా ‘బడ్స్’యాక్ట్ అమలు
అనధికార డిపాజిట్ పథకాల నిషేధ(బడ్స్) చట్టం–2019ను రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖలో అమలు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చట్టం కింద 26 కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది మొత్తం 653 ఆర్థిక నేరాలు నమోదైనట్లు వెల్లడించారు.
తగ్గిన దొంగతనాలు
2024లో 1,149 చోరీ కేసులు నమోదు కాగా, 2025లో 1,126 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జరిగిన దొంగతనాల్లో మొత్తం రూ.7.82 కోట్ల సొత్తు చోరీకి గురవగా, అందులో రూ.4.90 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు రికవరీ చేశారు. 2025లో ఇంటి దొంగతనాలు, సెల్‌ఫోన్ దొంగతనాల నేరాల్లో 6 కేజీల బంగారం(విలువ రూ.5.25 కోట్లు), 16.1 కేజీల వెండి, రూ.67లక్షల నగదు, 186 మోటార్ సైకిళ్లు, 9 ఆటోలు, 2 లారీలు, 1 బస్సు, 5 కార్లు, 15 ల్యాప్‌టాప్‌లు, 139 మొబైల్ ఫోన్లు, రూ.6.33 కోట్ల విలువైన 4,222 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. మొత్తం రూ.10.56 కోట్ల విలువైన ఆస్తిని 757 మంది బాధితులకు అందజేశారు.
మహిళల భద్రత ప్రాధాన్యం
విజిబుల్ పోలీసింగ్, నేర ప్రభావిత ప్రదేశాల జియో మ్యాపింగ్, మహిళా పోలీసుల పర్యవేక్షణ, కుటుంబ తగాదాలకు సంబంధించి కౌన్సెలింగ్ వంటి చర్యలతో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని సీపీ తెలిపారు. 2024లో 1,216 కేసులు నమోదు కాగా, 2025లో 951 కేసులు (21.79 శాతం తగ్గుదల) నమోదయ్యాయి. పిల్లలపై నేరాలు కూడా 42.74 శాతం వరకు తగ్గినట్లు సీపీ వెల్లడించారు. 2024లో 131 కేసులు రాగా, 2025లో 75 నమోదయ్యాయి.
డ్రోన్లతో నిఘా నేత్రం
నగర భద్రత, మత్తు పదార్థాల నియంత్రణ కోసం 22 స్టేషన్ల పరిధిలో 15 డ్రోన్ల ద్వారా 2,833 చోట్ల రెక్కీ నిర్వహించారు. పండగలు, ర్యాలీలు, వీఐపీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణలో డ్రోన్లను వినియోగించి 453 కేసులు నమోదు చేశారు.
సైబర్ నేరాల్లో భారీ రికవరీ
సైబర్ కేసులు తగ్గాయని కమిషనర్ తెలిపారు. 2024లో 374 సైబర్ నేరాలు నమోదు కాగా, 2025లో 286 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది 205 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.14.64 కోట్లు రికవరీ చేశారు(గతేడాది ఇది రూ.3.89 కోట్లు మాత్రమే). లోన్ యాప్‌ల ద్వారా మోసపోయిన 126 మంది బాధితులకు రూ.56 లక్షలు తిరిగి ఇప్పించారు. ముఖ్యమైన కేసుల్లో ట్రయల్స్ వేగంగా జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు చేపట్టారు. 2025లో 4,706 కేసులను కోర్టులు పరిష్కరించాయి. ఒక పోక్సో కేసులో 146 రోజుల్లోను, మరో కేసులో 234 రోజుల్లో తీర్పు వెలువడటం గమనార్హం.
ప్రజల సహకారంతో సురక్షిత విశాఖ
విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలు వస్తుండటం, భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుండటంతో ప్రముఖుల తాకిడి పెరిగిందని సీపీ తెలిపారు. ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ప్రజల సహకారంతో విశాఖను సురక్షిత నివాస ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని చెప్పారు. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖ నగరానికి నెత్తుటి మరకలు అంటుకుంటున్నాయి. వరుస హత్యలు, నెత్తురోడుతున్న రహదారులతో నగరం ఉలిక్కిపడుతోంది. పోలీస్ శాఖ చేపట్టిన చర్యలతో మొత్తంగా నేరాల రేటు తగ్గిందని గణాంకాలు చెబుతున్నప్పటికీ.. మనిషి ప్రాణాలు తీసే కిరాతక నేరాలు పెరగడం భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా 2024తో పోలిస్తే 2025లో హత్యల సంఖ్య గణనీయంగా పెరగడం, రహదారులపై మరణ మృదంగం ఆగకపోవడం నగర ప్రజలను కలవరపెడుతోంది. గత ఏడాది 24గా ఉన్న హత్యలు ఈ ఏడాది 35కు చేరడం, రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 349 మంది బలవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు భరోసా ఇస్తున్నా.. పెరుగుతున్న ఈ ఘోరాలు చూస్తుంటే ‘విశాఖ సేఫేనా?’అనే ప్రశ్న ప్రజల మదిలో మెదులుతోంది. – అల్లిపురం
కలవరపెడుతున్న హత్యలు
నగరంలో 2024లో 24 మంది హత్యకు గురవగా, ఈ ఏడాది 35 హత్యలు జరిగాయి. మద్యం మత్తు, అక్రమ సంబంధాలు, క్షణికావేశమే హత్యలకు ప్రధాన కారణాలు. ద్వేషపూరిత నరహత్యలు 12, వరకట్న హత్యలు 3, మహిళల హత్యలు 7 జరిగాయి. మిగిలిన హత్యలకు ఆర్థిక వివాదాలు, ప్రేమ వ్యవహారాలు, చిన్నపాటి తగాదాలు కారణమయ్యాయి.
బార్లకు ఒంటి గంట వరకు పర్మిషన్
నెత్తుటి మరకలు


