కదం తొక్కిన ఎర్ర దండు
బీచ్‌రోడ్డులో సిటూ ‘రెడ్ షర్ట్’ర్యాలీ
ఏయూ క్యాంపస్: సీఐటీయూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఉదయం రెడ్ షర్ట్ వలంటీర్లు భారీ కవాతు నిర్వహించారు. ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి మహాసభలు జరిగే ఏయూ కన్వెన్షన్ హాల్ ప్రాంగణం వరకు ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ కవాతులో వలంటీర్లు సిటూ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి, లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు, ప్రభుత్వ రంగాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, సోషలిజం అజేయం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కులమత రహిత సమాజం కోసం, కార్మిక–కర్షక ఐక్యత వర్ధిల్లాలని, ప్రజా పోరాటాలు సాగాలని నినదిస్తూ ఈ ఎర్రదండు కవాతును నిర్వహించింది. కవాతులో సిటూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్, రాష్ట్ర కోశాధికారి కె.ఆర్.కె.మూర్తి, నేతలు కె.లోకనాథం, కె.ఎం శ్రీనివాస్, పి.మణి, ఐద్వా ఆల్ ఇండియా నాయకురాలు డి.రమాదేవి, జిల్లా, జోన్ నాయకులు పాల్గొన్నారు.


