ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే! | Key developments in the assassination case of Kapu youth Sai Krishna | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ హత్యే.. పెద్దలను కాపాడే కుట్రే!

Jun 25 2026 4:56 AM | Updated on Jun 25 2026 4:56 AM

Key developments in the assassination case of Kapu youth Sai Krishna

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు సీఐ నాగరాజును తరలించిన పోలీసులు

కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు

సీఐ నాగరాజు రిమాండ్‌ రిపోర్ట్‌ సాక్షిగా పన్నాగం బట్టబయలు 

కీలక అంశాలు లేకుండానే ‘సిట్‌’ రిమాండ్‌ నివేదిక.. సాయికృష్ణను హత్య చేసినట్లు స్పష్టంగా పేర్కొనని సిట్‌ 

హత్య సమయం.. ప్రదేశం.. ఆయుధం.. ప్రస్తావనే లేవు.. మృతదేహాన్ని ఏం చేశారన్న వివరాలు మాయం

మృతదేహం అవశేషాల సేకరణే పట్టించుకోని సిట్‌.. కీలక పోలీస్‌ రిజిస్టర్లు, రికార్డుల ప్రస్తావన లేనే లేదు

ప్రత్యక్ష సాక్షులపై దొంగాట 

సీపీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారికి ప్రభుత్వ రక్షా కవచం.. సీసీటీవీ ఫుటేజీ బ్యాకప్‌ స్వాదీనంలో తాత్సారం 

తూతూమంత్రంగా రిమాండ్‌ రిపోర్ట్‌ 

తెర వెనుక ఉన్న టీడీపీ పెద్దల పాత్ర కప్పిపుచ్చే కుతంత్రం 

సీఐ నాగరాజు అరెస్ట్‌.. రిమాండ్‌

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించేసింది! రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌ హత్య కేసును నీరుగార్చేందుకు పక్కా పన్నాగానికి తెగబడింది. ఈ హత్య వెనుక సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు కుతంత్రం పన్నింది. ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌ బాస్, బిగ్‌బాస్‌తో సహా అందరినీ ఈ కేసు నుంచి తప్పించింది. అందుకు ఈ కేసు దర్యాప్తునకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను సాధనంగా చేసుకుంది. సాయికృష్ణ లాకప్‌ హత్యకు సంబంధించిన కనీస వివరాలు, దర్యాప్తులో పాటించాల్సిన ప్రాథమిక నియమాలను కూడా పట్టించుకోకుండా ‘సిట్‌’ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్‌ నివే­దిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. 

అసలు సాయికృష్ణ హత్యకు గురైనట్లు సూటిగా పేర్కొనని సిట్‌... దర్యాప్తులో కీలకమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించి తూతూమంత్రంగా రిమాండ్‌ రిపోర్టును రూపొందించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందన్నది స్పష్టమవు­తోంది. అసలు సాయికృష్ణను ఎప్పుడు హత్య చేశారు..? హత్యాయుధం.. సమయం.. మృతదే­హం తరలింపు.. అవశేషాల గుర్తింపు.. ప్రత్యక్ష సాక్షులు, కీలకమైన పోలీసు రిజిస్టర్లు, రికార్డులు... వాటిని పర్యవేక్షించాల్సిన పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు... సాయికృష్ణను అదుపులోకి తీసు­కున్న టాస్క్‌ఫోర్స్‌ బాధ్యు­లు.. సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్‌ స్వాధీనం..! 

ఇలా ఏ అంశాలను కూడా ప్రస్తావించకుండానే, వాటి గురించి పేర్కొనకుండానే రిమాండ్‌ రిపోర్టును సమర్పించడం విభ్రాంతి కలిగిస్తోంది. ప్రధానంగా సాయికృష్ణను లాకప్‌లోనే హత్య చేయడం వెనుక కుట్ర కోణం ఏమిటన్నది పట్టించుకోకపోవడం గమనార్హం. తద్వారా ఈ కేసులో ఎవరో కీలక ప్రభుత్వ పెద్దలు, పోలీస్‌ బాస్, బిగ్‌బాస్‌లను కాపాడాలన్నదే ప్రభుత్వ పన్నా­గ­మన్నది తేటతెల్లమవుతోంది. సిట్‌ రిమాండ్‌ నివేదిక సాక్షిగా బట్టబయలైన చంద్రబాబు ప్రభుత్వ కుట్ర ఇదిగో ఇలా ఉంది....

హత్య వివరాలే లేకుండా రిమాండ్‌ రిపోర్టా?
కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌ మరణం కేసును న్యాయ విచార­ణలో బలహీనపరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. అసలు సాయి­కృష్ణ హత్యకు గురయ్యారని సూటిగా పేర్కొనలేదు. హత్యకు గురై ఉంటారని మొక్కుబడిగా పేర్కొంటూ ఆయన్ని హతుడు (డిసీజ్డ్‌)అని పేర్కొంది. కానీ ఆయన్ని ఎప్పుడు, ఎక్కడ ఎలా హత్య చేశా­రు? అనే కనీస వివరాలను రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొనలేదు. అంటే.. నేర ప్రదేశం, సమయం, నేరం చేసిన విధానం గురించి అసలు ప్రస్తావించనే­లేదు. టాస్క్‌ఫోర్స్‌ అధికా­రులు సాయికృష్ణను కృష్ణలంక పోలీసులకు అప్పగించిన తరువాత.. వివ­రా­లన్నీ అగమ్యగో­చరమే. 

కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌­కు తీసుకువచ్చిన సాయికృష్ణ తరువాత ఏమయ్యా­రన్నది సిట్‌ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించనే లేదు. ఆయన ప్రాణాలతో పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లారా...? లేదా ఆయన మృతదేహాన్ని పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు తరలించారా? అనే కీలక అంశాన్ని పేర్కొనాల్సిన కనీస బాధ్యతను కూడా సిట్‌ అధికారులు విస్మరించారు. అసలు సాయికృష్ణ లాకప్‌లో హత్యకు గురయ్యారనే విషయాన్నే రిమాండ్‌ రిపోర్ట్‌లో సూటిగా ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయపరుస్తోంది. లాకప్‌­లో హత్యకు గురైనట్టు భావిస్తున్నామని మాత్రమే పేర్కొంది. 

హత్య ప్రదేశం, సమయం, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు అన్నవి ఈ కేసులో ప్రధానమైనవి. ఆ మూడు కీలక అంశాల గురించి రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనా­ర్హం. సాయికృష్ణ మృతదేహాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులను కూడా సిట్‌ గుర్తించనే లేదు.  తద్వారా సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారని నిరూపించడానికి కీలక ఆధారం లేకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త పడినట్టు స్పష్టమవుతోంది. అంటే సాయి­కృష్ణ అసలు హత్యకు గురయ్యారా లేదా అనే సందేహానికి బలం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందుగానే కుట్రకు బరితెగించింది. అంతగా ఈ కేసు­ను నీరుగార్చాలని ప్రభుత్వ పెద్దలు ఎందుకు భావిస్తున్నట్లు? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 

ప్రత్యక్ష సాక్షులే లేకుండా చేసే కుతంత్రం
ఇక ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకుండా చేయాలన్న ముందస్తు పన్నాగంతో వ్యవహరిస్తు­న్నట్లు తెలుస్తోంది. కేవలం బాధితుడి తల్లితోపాటు ఎస్సైను మాత్రమే ప్రత్యక్ష సాక్షిగా పేర్కొనడం విడ్డూరంగా ఉంది. పోలీసులు కొడుతున్న దెబ్బ­లకు తన కుమారుడు ఆర్తనాదాలు చేయటాన్ని తాను విన్నట్లు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చెప్పా­రని ప్రస్తావించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుదారు కాబట్టి ఆమె సాక్ష్యం న్యాయస్థానంలో చెల్లదు. ఆ ఎస్సై కూడా తాను మే 6 – 8వ తేదీల మధ్య సాయికృష్ణను కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో చూశా­నని చెప్పినట్టుగా రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 

న్యాయ విచారణ సమయంలో ఆయన మాట మార్చే అవకా­శాలు ఉన్నాయి. మరి అన్ని రోజుల­పాటు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన అంతమంది ఇతర అధికారులు, పోలీసులను ప్రత్యక్ష సాక్షులుగా ఎందుకు పేర్కొన లేదన్నది కీలకంగా మారింది. సాయికృష్ణ మృతదేహం పోలీసు స్టేషన్‌ నుంచి మాయమైంది. ఆ పని కేవలం ఒక్క మనిషి చేయడం అసాధ్యం! మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు? అనేది సిట్‌ పట్టించుకోలేదు. సరైన సాక్ష్యాలు లేకుండా సిట్‌ తూతూ మంత్రంగా రిపోర్ట్‌ రిపోర్ట్‌ రూపొందించడం ద్వారా ఈ కేసు నుంచి ఎవర్ని కాపాడేందుకు యత్నిస్తోందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. 

కీలక రిజిస్టర్లు, రికార్డుల వివరాలే లేకుండా రిమాండ్‌ రిపోర్టా...!
సాయికృష్ణ లాకప్‌ మరణం కేసును నీరుగార్చేందుకు సిట్‌ పక్కాగా రంగంలోకి దిగింది. ప్రధాన బాధ్యుడైన పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు­తో­పాటు టాస్క్‌ఫోర్స్‌ అధికారిని ఈ కేసు నుంచి తప్పించాలన్న కుట్ర బయటపడింది. తద్వారా వారిద్దరి వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలను కాపాడా­లన్న లక్ష్యంతో వ్యవహరించింది. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మార్కాపురంలో అదుపు­లోకి తీసుకుని సీఐ నాగరాజుకు అప్పగించినట్టు సిట్‌ పేర్కొంది. కానీ ఆ తరువాత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉండిపోవడం గమనార్హం. 

ప్రధా­­నంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత నిబంధనల ప్రకారం నమోదు చేయా­ల్సిన కీలక రిజిస్టర్లు, రికార్డులను సిట్‌ కనీసం పరిశీలించలేదు. తమ రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించనూ లేదు. వాటిని రోజూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన సీపీ రాజశేఖర్‌బాబు ఎందుకు తన బాధ్యతను విస్మరించారనే కోణంలో దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఆ కీలక అంశాలు ఇవీ...

» పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల లాకప్‌లలో ఉన్న వారి వివరాలతో లాకప్‌ డెయిరీ సర్వీస్‌రిజిస్టర్‌(డీఎస్‌ఆర్‌)ను సీపీకి సమ­ర్పిస్తారు. నిందితులను లాకప్‌లో పెట్టిన తేదీ, సమయం, సంబంధిత పోలీసు అధికారి తదితర వివరాలు అందులో ఉంటాయి. 24 గంటలు మి­ం­చి ఎవరూ లాకప్‌లో ఉండకుండా.. న్యాయ­స్థాన­ంలో హాజరుపరిచారా లేదా? అన్నది సీపీ పరిశీలించాలి. మరి సాయికృష్ణను రోజుల తర­బడి అక్రమంగా లాకప్‌లో ఉంచితే ఆ విష­యా­న్ని సీపీ ఎందుకు పట్టించుకోలేదు? అవేవీ పరి­శీలించకుండానే డీఎస్‌ఆర్‌ను ఆమోదించారా? అని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంటే సీపీకి తెలిసే సాయికృష్ణను రోజుల తరబడి అక్ర­మం­గా లాకప్‌లో ఉంచారన్నది స్పష్టమవుతోంది. 

»  ఇక పోలీస్‌ స్టేషన్లలో స్టేషన్‌ ఆఫీసర్లు, జనరల్‌ డ్యూటీ ఇన్‌చార్జ్‌లు, సెంట్రీలు ప్రతి ఆరు నుంచి 12 గంటల మధ్య షిఫ్ట్‌లు మారుతూ ఉంటారు. అలా షిఫ్ట్‌ మారే సమయంలో లాకప్‌లో ఉన్న వారి వివరాలను జనరల్‌ డైరీలో రాయాలి. మరి సాయికృష్ణను ఉంచిన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో జనరల్‌ డైరీ వివరాలను సిట్‌ ఎందుకు రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించ లేదు? జనరల్‌ డైరీ, స్టేషన్‌ డైరీ, లాకప్‌ రిజిస్టర్, కస్టడీ రిజిస్టర్, ప్రిజనర్‌ మూవ్‌మెంట్‌ రిజిస్టర్, విజిటర్స్‌ రిజిస్టర్, సెంట్రీ రిజిస్టర్, అరెస్టు రికార్డులు ఇవన్నీ కీలకం. వాటిని పరిశీలించకుండా వాటి ప్రస్తావనే లేకుండా రిమాండ్‌ రిపోర్ట్‌ రూపొందించడం ద్వారా ఈకేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నారన్నది స్పష్టమవుతోంది. 

» సాయికృష్ణకు వ్యతిరేకంగా నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ (ఎన్‌బీడబ్ల్యూ) పెండింగ్‌లో ఉన్నందునే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని రిమాండ్‌ నివేదికలో పేర్కొ­న్నారు. మరి పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూలు, వాటిపై తీసుకున్న చర్యలను పోలీస్‌ కమిషన­ర్‌కు ప్రతి రోజూ నివేదిస్తారు. మరి సాయికృష్ణను ఎన్‌బీ­డ­బ్ల్యూ జారీ చేసి అదుపులోకి తీసు­కుంటే ఆ విష­యాన్ని సీపీకి సమర్పించే రోజు­వారీ నివేదికలో ప్రస్తావించాలి కదా? మరి ఈ అంశాన్ని ఆయన ఎందుకు పట్టించుకోలేదు? సాయికృష్ణకు ఎన్‌బీడ­బ్లూ జారీ చేసి అదుపులోకి తీసుకు­న్నారా...? తీసు­కుంటే న్యాయస్థానంలో ఎప్పుడు ప్రవేశ­పెడతారు? అని ప్రశ్నించాలి కదా. మరి ఆయన ఎందుకు బాధ్యతాయుతంగా స్పందించలేదు? అంటే ఆయనకు తెలిసే సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వ­కంగా ఆయ­న ప్రస్తావన రిమాండ్‌ నివేదికలో పేర్కొనలేదా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

సాయికృష్ణను ఎక్కడ దహనం చేశారో ఎందుకు వెల్లడించలేదు?
సాయికృష్ణను ఎలా కనుమరుగు చేశారన్నది కూడా రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మృతదేహం అనే అత్యంత కీలకమైన అంశాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. మృతదేహాన్ని ఎలా మాయం చేశారనే విషయాన్నే సిట్‌ అధికారులు ప్రస్తావించనే లేదు. సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసేశారు అనే కోణంలో సిట్‌ అధికారులు ఎందుకు దర్యాప్తు  చేయడంలేదు? ఆయన మృతదేహాన్ని దహనం చేశారని భావిస్తున్న ప్రదేశాన్ని ఎందుకు గుర్తించ లేదు? వాస్తవానికి సాయికృష్ణను దహనం చేసిన ప్రదేశాన్ని గుర్తించి... అక్కడ అవశేషాలను సేక­రించాల్సిన బాధ్యత సిట్‌ అధికా­రులపై ఉంది. 

ప్రధా­నంగా దంతపు అవ­శేషాలు అత్యంత కీల­క­ం. మృతదేహాన్ని దహనం చేసినా దంతపు అవ­శేషాలు మిగిలే ఉంటాయి. వాటి నుంచి డీఎన్‌ఏ నమూనాలను పరీక్షించి నేరాన్ని శాస్త్రీ­యంగా నిరూ­పించాలి. ఇంతటి కీలకమైన అంశాన్ని పోలీ­సులు ఎందుకు విస్మరించారన్నది సందేహాస్ప­దంగా మారింది. అంటే సాయికృష్ణ లాక­ప్‌ మరణం కేసు విచారణను ఉద్దేశపూర్వకంగా బల­హీ­న­ప­రచాలన్నది పోలీసుల లక్ష్యమని స్పష్టమ­వుతోంది. తద్వారా ఈ హత్య వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికా­రులను రక్షించాలన్నదే అసలు ఉద్దేశమని తెలుస్తోంది.

క్రిమినల్‌ కుట్ర కోణాన్నే పట్టించుకోని సిట్‌ 
ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే...
సాయికృష్ణ  లాకప్‌ హత్య వెనుక ప్రభుత్వ పెద్దలు, ప్రధాన సూత్రధారులను తప్పించేందుకు సిట్‌ అధికారులు బరితెగించారు. అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్రకోణం ఉందనే విషయాన్నే పట్టించుకోకపోవడమే అందుకు తార్కాణం. అందుకే సాయికృష్ణను ఎందుకు హత్య చేసి ఉంటారు? అనే కోణంలో కనీసం దర్యాప్తు చేయలేదు. విజయ­వాడకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధికి చెందిన ఓ భూ వివాదం, విజయవాడలో ఓ ప్రైవేటు ఆర్థిక సంస్థలో నిధుల వ్యవహారంలో రెండువర్గాల మధ్య విభేదాలు తలెత్తా­యని... ఆ వ్యవహారా­లను కప్పిపుచ్చేందుకే సాయికృష్ణను లాకప్‌లో హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. 

మరి సిట్‌ ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదన్నది కీలకంగా మారింది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రజాప్రతినిధి­తోపాటు అందుకు సహకరించిన విజయవాడ పోలీస్‌ బాస్‌తో­పాటు బిగ్‌బాస్‌ పాత్ర బయట­పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే అసలు సాయికృష్ణ హత్య వెనుక కుట్ర కోణాన్నే విస్మరిస్తే... ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించవచ్చన్నది సిట్‌ ఉద్దేశం కావచ్చని చెబుతున్నారు.

న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకేనా...!
సాయికృష్ణ మిస్సింగ్‌ విషయంలో సీఐ నాగరాజుతోపాటు పోలీసులు న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు బరితెగించారు.  హెబియస్‌ కార్పస్‌ లాంటి కీలకమైన పిటిషన్‌కు సంబంధించి న్యాయస్థానానికి సమర్పించే అధికారిక నివేదికపై సీపీ రాజశేఖర్‌బాబుకు  ముందే సమాచారం ఉంటుంది. ఆయన ఆమోదంతోనే న్యాయస్థానానికి నివేదిక ఇస్తారు. 

కాగా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ విచారణ సమయంలో సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని సీఐ నాగరాజుతోపాటు విజయవాడ పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. కానీ సిట్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ అందుకు విరుద్ధంగా ఉండటం గమనార్హం. సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనకు మే 6న అప్పగించినట్టు నాగరాజు పేర్కొన్నారని చెప్పారు. ఇక్కడ రెండు ప్రధాన సందేహాలు తలెత్తుతున్నాయి...

» సాయికృష్ణ ఆచూకీ తమకు తెలియదని కొద్ది రోజుల క్రితం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో ఉద్దేశపూర్వకంగానే అవాస్తవాలు చెప్పారా..? అలా చెబితే అందుకు సీపీతోపాటు విజయవాడ పోలీసులు బాధ్యులు అవుతారు. 
»  లేదా... టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాయికృష్ణను సీఐ నాగరాజుకు అప్పగించినట్టు ప్రస్తుతం చెబుతున్న రికార్డులు ట్యాంపర్‌ చేసి ఉండవచ్చు. అధికారిక రికార్డులను ట్యాంపర్‌ చేయడం తీవ్రమైన నేరం. అందుకు సీపీ రాజశేఖర్‌బాబు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కూడా బాధ్యులు అవుతారు.

ఈ రెండింటిలో ఏది వాస్తవం..? ఏది అవాస్తవం..? అన్నది తేలాల్సి ఉంది.
సీసీ టీవీ బ్యాకప్‌ ఫుటేజీని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?
కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ధ్వంసమైనట్లు సిట్‌ పేర్కొంది. కానీ రాష్ట్రంలో అన్ని పోలీస్‌ స్టేషన్ల సీసీ టీవీ ఫుటేజీ డీజీపీ కార్యాలయంలో ఉంటుంది. ఆ బ్యాకప్‌ నుంచి ఫుటేజీని సిట్‌ అధికారులు ఇంకా ఎందుకు స్వాధీనం చేసుకోలేదన్నది కీలకంగా మారింది. ఆ ఫుటేజీ కావాలని సిట్‌ అధికారులు ఆ ప్రాజెక్టు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థకు లేఖ రాశారు. కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల మెమోరీ డ్యూరేషన్‌ యూనిట్లు అవసరమని... ఆ మెమోరీ సమకూరిస్తే తాము అందిస్తామని ఆ ప్రైవేటు సంస్థ చెప్పినట్టు తెలుస్తోంది.

కాలయాపన చేసేందుకే సిట్‌ అధికారులు ఇలా వ్యవహ­రిస్తున్నారా? అనే సందేహం కలుగుతోంది. ఎందుకంటే సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్‌ డీజీపీ కార్యాలయంలోనే ఉంది. సిట్‌ అధికారులు వెంటనే వెళ్లి ఆ బ్యాకప్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు?.. వారిని అడ్డుకుంటున్నది ఎవరు? ప్రైవేటు సంస్థ ఇచ్చేంతవరకు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? వెంటనే వచ్చి స్వాధీనం చేసుకోవాలని డీజీపీ ఎందుకు ఆదేశించడం లేదు? ఈలోగా బ్యాకప్‌ ఫుటేజీ కూడా మాయం చేసే కుట్ర దాగుందా? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. 

పోలీసు ప్రధాన కార్యాలయంలో బ్యాకప్‌ ఫుటేజీ కూడా గల్లంతు అయితే అందుకు డీజీపీతోపాటు యావత్‌ పోలీసు ఐటీ విభాగం బాధ్యత వహించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాయికృష్ణ  హత్యకు గురయ్యారని స్పష్టంగా పేర్కొన లేదు. పోస్ట్‌మార్టం, మెడికల్‌ రికార్డులు లేనే లేవు. మృతదేహాన్ని ఏం చేశారన్నదీ చెప్పలేదు. మృతదేహం అవశేషాలు గుర్తించలేదు. ఎటువంటి అధికారిక రిజిస్టర్టు, రికార్డుల వివరాలు పేర్కొన లేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రస్తావనే లేదు. హత్య వెనుక కుట్ర కోణంపై దర్యాప్తే లేదు. వెరసి సాయికృష్ణ లాకప్‌ హత్య కేసును నీరుగార్చి సూత్రధారులు, పాత్రధారులను కాపాడేందుకు సిట్‌ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిందన్నది స్పష్టమవుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement