అరెస్టయిన కృష్ణలంక సీఐ నాగరాజు
ఉన్నది ఉన్నట్లు చెబుతానన్న సీఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దల ఆఫర్!
బాస్, బిగ్‌బాస్ సహా రాజకీయ పెద్దల పేర్లు బయట పెట్టొద్దని షరతు
సాక్షి, అమరావతి : ‘వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం.. మిత్రపక్షం అందుకు సిద్ధంగా ఉంది. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్‌లో అదృశ్యం వెనుక సూత్రధారుల పేర్లు బయటపెటొద్దు.’ – ఇదీ సీఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆఫర్.
సాయికృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన భూ, ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని, అందులో సూత్రధారులైన పోలీస్ బాస్, బిగ్‌బాస్‌తోపాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయటపెట్టవద్దని ప్రభుత్వ పెద్దలు షరతు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగరాజుకు సన్నిహితుడైన రిటైర్డ్ డీజీపీ ఈ మేరకు రాయబారం నడిపినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అజ్ఞాతం వీడి, అరెస్టుకు సహకరించినట్టు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సీఐ నాగరాజు అరెస్టుకు ముందు తెరవెనుక సాగిన వ్యవహారాలు ఇలా ఉన్నాయి.
నేను ఒప్పుకోను.. అందరిపేర్లు బయటపెడతా – ఎదురుతిరిగిన సీఐ నాగరాజు
కాపు యువకుడు సాయికృష్ణను లాకప్‌లోనే కనుమరుగు చేసిన వ్యవహారాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారు. టీడీపీ కీలక నేతల భూ దందాలు, ప్రైవేటు ఆర్థిక సంస్థ అక్రమాలకు సంబంధించిన ఇరువర్గాల మధ్య విభేదాల నేపథ్యంతోనే సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ పెద్దలకు కంటిలో నలుసుగా మారిన సాయికృష్ణను అడ్డు తొలగించుకునేందుకు విజయవాడ పోలీస్ బాస్‌తోపాటు బిగ్‌బాస్ డైరెక్షన్‌లో కథ నడిపించారు.
టాస్క్‌ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు కాగా, చినబాబుకు నమ్మిన బంటు పోలీస్ బాస్. బిగ్‌బాస్ ఆమోదంతో గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం సాయికృష్ణ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలైంది. దాంతో సాయికృష్ణ అదృశ్యం ఉదంతాన్ని సీఐ నాగరాజు వరకే పరిమితం చేసి.. ప్రభుత్వ పెద్దలు, బాస్, బిగ్‌బాస్‌లను రక్షించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. తద్వారా ఈ వ్యవహారానికి కేంద్ర బిందువైన టీడీపీ కీలక నేతల భూ, ఆర్థిక వ్యవహారాలను కప్పిపుచ్చాలన్నది ఎత్తుగడ.
అందుకే ఈ కేసులో ఏ1, ఏ2గా ఉండాల్సిన బాస్, టాస్క్‌ఫోర్స్ అధికారులను తప్పించి కేవలం సీఐ నాగరాజు వరకే ఎఫ్‌ఐఆర్‌ను పరిమితం చేశారు. అయితే ఈ ఎత్తుగడ పట్ల సీఐ నాగరాజు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో తనను ఒక్కడిని ఇరికించి.. పెద్దలు అందరూ తప్పించుకోవాలని యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ఆయన ప్రభుత్వ, పోలీసు పెద్దలకు ఝలక్ ఇచ్చారు.
‘అసలు సాయికృష్ణను అదుపులోకి తీసుకుంది టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. టాస్క్‌ఫోర్స్ సీపీ ఆధీనంలో పని చేస్తుంది. అందువల్ల ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు’ అని సీఐ వాదించినట్టు సమాచారం. టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి గానీ, తనకు అప్పగించినట్టు ఉన్నాయా.. అని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వ, పోలీసు పెద్దలు షాక్‌కు గురయ్యారని తెలిసింది. నాగరాజు ఈ మాటలకే కట్టుబడితే తమ బండారం బయటపడుతుందని వారు ఆందోళన చెందారు.

రిటైర్డ్ డీజీపీ ద్వారా రాయబారం
సీఐ వైఖరితో దిమ్మ తిరిగిపోయిన ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దింపారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉందని సమాచారం. అందుకే అజ్ఞాతంలో ఉన్న నాగరాజుతో సంప్రదింపుల బాధ్యతను ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీపీకి అప్పగించారు. ఈ కేసులో సహకరిస్తే తాము ఇచ్చే ఆఫర్‌ను కూడా వెల్లడించారు. దాంతో రిటైర్డ్ డీజీపీ.. సీఐ నాగరాజుతో సంప్రదింపులు జరిపారు.
ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారనే విషయాన్ని తెలిపారు. అందుకు మిత్రపక్షం సమ్మతించినట్టు చెప్పారు. మిత్రపక్ష అగ్రనేత సీఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీనే సమకూరుస్తుందన్నారు. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన ఈ కేసులో మాత్రం సహకరించాలని, ఎవరి పేర్లూ బయట పెట్టవద్దన్నది షరతుగా చెప్పారు. ప్రస్తుతం అరెస్టు అయితే త్వరగా బెయిల్‌పై విడుదల అయ్యేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, అనంతరం ఈ కేసును నీరుగార్చేందుకు చేయాల్సిందంతా చేస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించినట్టు పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే సీఐ నాగరాజును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి సోమవారమే ఆయన్ను అరెస్టు చేయాలని భావించారు. కానీ ఆయన ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. రిటైర్డ్ డీజీపీ రాయబారంతో డీల్ కుదరడంతోనే సీఐ నాగరాజు అరెస్టుకు సహకరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఐ నాగరాజుకు ప్రజా మద్దతు ఉందనేలా ప్రభుత్వం తెరవెనుక నుంచి డ్రామాకు తెరతీసింది. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి ఆందోళనలు చేయిస్తుండటం గమనార్హం.


