ఆంజనేయులు(ఫైల్), ఆంజనేయులు మృతికి టీడీపీ నేత మారుతీ ప్రసాద్ కారణమని చెబుతున్న కుటుంబ సభ్యులు
తాగు నీరు రావడంలేదన్నందుకు వృద్ధుడిని చెప్పుతో కొట్టిన టీడీపీ నేత దంపతులు
అవమానంగా భావించిన వృద్ధుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
వారం రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూత
కణేకల్లు: టీడీపీ నేత దాష్టీకానికి ఓ వృద్ధుడు బలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం... అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మోకా ఆంజనేయులు (70) ఇంటి కుళాయికి కూడా నీరు సరిగా రావడంలేదు. రెండు నెలల క్రితం ఆంజనేయులు బకాయి పడిన నీటి పన్ను రూ. 2 వేలను టీడీపీ నాయకులు ఆయన పింఛన్ డబ్బు నుంచి వసూలు చేశారు. నీటి పన్ను వసూలులో ఆసక్తి చూపిన నేతలు.. తాగునీరు ఎందుకు వదలడంలేదని టీడీపీ నేత మారుతీప్రసాద్, అతని భార్య, మాజీ సర్పంచి లావణ్యను అడిగేందుకు ఆంజనేయులు ఈ నెల 13న వారి ఇంటికి బయల్దేరాడు. మారుతీప్రసాద్ ఇంట్లో లేడని తెలియడంతో మధ్యలోనే వెనక్కి వెళ్లిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న మారుతీప్రసాద్.. ‘నన్నే ప్రశ్నించాలని నా ఇంటి దాకా వచ్చాడా!’ అంటూ ఊగిపోయాడు. మారుతీ ప్రసాద్, ఆయన భార్య అదే రోజు ఆంజనేయులు కౌలుకు చేస్తున్న పొలం వద్దకెళ్లి చెప్పులతో కొట్టి, కాళ్లతో తంతూ చావబాదారు. కూలీల ముందే అవమానించారు. ఈ అవమానం భరించలేక ఆంజనేయులు ఇంటికొచ్చాక పురుగుల మందు తాగాడు.
కుటుంబ సభ్యులు వెంటనే కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులు మృత్యువుతో పోరాడిన ఆంజనేయులు సోమవారం మధ్యాహ్నం కన్నుమూశాడు. తమ తండ్రిని టీడీపీ నేత మారుతీప్రసాద్, భార్య లావణ్య పొట్టన పెట్టుకున్నారని ఆయన కుమారులు భీమన్న, వన్నూరుస్వామి, కుమార్తెలు లలితమ్మ, అంజినమ్మ, భూలక్ష్మి విలపించారు. ఆంజనేయులు మరణంతో టీడీపీ నేతలు ఆయన కుటుంబసభ్యులతో రాజీకి ప్రయత్నాలు చేశారు.
ఆంజనేయులది హత్యే: మెట్టు గోవిందరెడ్డి
‘ఆంజనేయులు ఆత్మహత్యను టీడీపీ నాయకుడు మారుతీప్రసాద్, అతని భార్య చేసిన హత్యగానే పరిగణించి వారిపై హత్య కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేయాలి. ఆంజనేయులును కాళ్లతో తన్ని, చెప్పులతో కొట్టి ప్రాణాన్ని బలితీసుకున్నారు.’ అని వైఎస్సార్‌సీపీ రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌చార్జి మెట్టు గోవిందరెడ్డి డిమాండ్ చేశారు.


