సెల్ఫీ వీడియోలో మాట్లాడుతున్న అంకే నరేంద్ర
దొంగ ఓట్లు ఎక్కిస్తున్న గోనుగుంట్ల సూర్యనారాయణను అడ్డుకున్నాను
అందుకు కక్షగట్టి దొంగతనం కేసు బనాయించారు
సెల్ఫీ వీడియో విడుదల చేసి వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా ఆలమూరులో ఘటన
రాప్తాడు రూరల్: రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడైన గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ ఆలమూరు సూరి ఒత్తిడి మేరకు పోలీసులు తనపై దొంగతనం కేసు బనాయించారని, తన చావుకు గోనుగుంట్ల సూర్యనారాయణే కారణమని పేర్కొంటూ అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరులో సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంకే నరేంద్ర బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు.
ఆత్మహత్యాయత్నానికి ముందు నరేంద్ర తన అరటితోటలో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. దానిలో టీడీపీ నేతలు తనను ఎలా వేధించిందీ చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు. తాను వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తుండటాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని తెలిపాడు. ఎమ్మెల్యే అనుచరుడు, గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సూర్యనారాయణ అలియాస్ ఆలమూరు సూరి ఆ పారీ్టకి అనుకూలంగా దొంగ ఓట్లు ఎక్కిస్తుండటంతో అడ్డుకున్నానని, అప్పటి నుంచే తనపై కక్ష పెంచుకున్నారని చెప్పాడు. ఆ క్రమంలోనే అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో తనపై దొంగతనం కేసు నమోదు చేయించారని తెలిపాడు.
కాంట్రాక్టర్ సూచన మేరకే...
ఆలమూరు జగనన్న కాలనీకి చెందిన కాంట్రాక్టర్ రమణారెడ్డి సూచనల మేరకు కాలనీలోని మోటారుకు రిపేరు చేయించి టెస్టింగ్ కోసం తన పొలంలో దించినట్లు చెప్పాడు. హౌసింగ్ ఏఈ సంపత్‌కుమార్‌తో ఫిర్యాదు ఇప్పించి.. తాను మోటారు దొంగిలించినట్లు అక్రమంగా కేసు బనాయించారని వాపోయాడు. గౌరవంగా జీవిస్తున్న కుటుంబానికి చెందిన తనకు పోలీసులు ముసుగువేసి, ఫొటోలు తీసి మీడియాలో ప్రచారం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకంగా వ్యవహరిస్తున్న సూర్యనారాయణ తన ఇంటి ప్రహరీని కూడా కూలి్చవేయించాడని తెలిపాడు.
తన పరువును బజారుకీడ్చి నానా రకాలుగా అవమానించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో పేర్కొన్న అనంతరం నరేంద్ర తన అరటితోటలోనే పురుగుమందు తాగాడు. అపస్మారకస్థితిలో ఉన్న నరేంద్రను కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. బెంగళూరులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దగ్గరుండి ఆస్పత్రిలో చేరి్పంచి, మెరుగైన చికిత్స అందించేలా వైద్యులతో మాట్లాడారు.


