సాక్షి, అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు.. వాయిదాల పర్వంతో మొదలైంది. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరిట జరిగిన అక్రమాలపై శాసనమండలి దద్దరిల్లింది. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ.. చైర్మన్ తిరస్కారంతో చర్చకు పట్టుబట్టింది.
‘‘ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి. కానీ, మూడు లక్షల మందిని డీఎస్సీ రిక్రూట్‌మెంట్ పేరిట మోసం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. స్పోర్ట్స్ కోటా పేరుతో వాళ్లకు నచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ అక్రమాలపై సభలో చర్చ జరగాల్సిందే. ఏపీపీఎస్సీపై కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఈ తరుణంలో ప్రభుత్వం వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు.
మంత్రుల అసహనం
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మైక్ ఎలా ఇస్తారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ప్రశ్నించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్నారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


