ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఫేక్ వీడియో
ప్రచార హోరు... మోసాల జోరు
గ్లోబల్ షేర్ మార్కెట్ పేరుతో వల
తక్కువ సమయంలోనే రూ.లక్షల్లో లాభం అంటూ ప్రచారం
ప్రముఖుల ఫేక్ వీడియోలతో నయవంచన
గ్లోబల్ షేర్ మార్కెట్‌పేరుతో సరికొత్త మోసం తెరపైకి వచ్చింది. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే వారం రోజుల వ్యవధిలోనే రూ.లక్షల్లో లాభం ఉంటుందని ప్రకటనలతో ఊరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖుల ఫేక్ వీడియోలతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ముమ్మరం చేశారు.
అనంతపురం సిటీ: షేర్ మార్కెట్లలో ఏదో ఒక స్కామ్ బయటపడుతూనే ఉంది. గతంలో మోసగాళ్లు కోల్డ్ కాల్స్‌పై ఆధార పడగా, ప్రస్తుతం పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాలు, ఏఐ వీడియోలతో పెట్టుబడిదారులను పెడదోవ పట్టిస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనుకుంటున్న యువతనే లక్ష్యంగా సాగుతున్న ఈ మోసాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
సెబీ కఠిన చర్యలు తీసుకుంటున్నా..
దేశీయంగా స్టాక్ మార్కెట్ మోసాల నియంత్రణకు సెబీ సంస్థ కఠిన చర్యలు తీసుకుంటున్నా... సరికొత్త స్కామ్‌లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య ఎక్కువ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏడాది క్రితం ఇదే సమయంలో సంచలనం రేకెత్తించిన పంప్ అండ్ డంప్ స్కామ్ మరోసారి తెరపైకి వచ్చింది. దేశీయంగా ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలూ ఊపందుకున్నాయి.
ఆర్థిక మోసాల్లో భాగంగా ముందుగా స్కామర్లు తక్కువ ధర ఉన్న పెన్నీ స్టాక్స్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, వాటి విలువను కృత్రిమంగా పెంచేస్తారు. ఆ తర్వాత స్టాక్ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఉన్నఫళంగా మొత్తం విక్రయించి స్టాక్ నుంచి బయటపడిపోతారు. ఇది తెలిసే లోపు స్టాక్ భారీగా పతనమై చిన్న పాటి పెట్టుబడిదారులు మొత్తం సొమ్ము నష్టపోవాల్సి వస్తుంది.
ఆకట్టుకునేలా ఏఐ వీడియోలు
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, విప్రో ప్రేమ్‌జీ, ఇన్ఫోసిస్ సుధానారాయణమూర్తి తదితర ప్రముఖుల ఫేక్ వీడియోలతో పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రకటనలు ఊపందుకున్నాయి. ఇందులో రూ.22 వేలు ఒక్కసారి పెట్టుబడి పెడితే... ఎలాంటి పని చేయకపోయినా వారం రోజుల తర్వాత రూ.5.50 లక్షలు అందుతుందని స్వయంగా వారు మాట్లాడుతున్నట్లుగా వీడియోలను రూపొందించడం గమనార్హం.
ఈ వీడియోల పట్ల ఆకర్షితులైన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంతో ఆశతో పెట్టుబడులు పెట్టారు. వారం రోజుల తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాము మోసపోయినట్లుగా నిర్ధారించుకుని, పెట్టుబడి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో ప్రస్తుతం లబోదిబో మంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోసపోయిన వారి సంఖ్య వందల్లో ఉంటుందని సమాచారం.


