సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్ర అలియాస్ ముస్కాన్ జైన్ కుల ధ్రువీకరణపై నెలకొన్న వివాదంపై హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓసీ కులానికి చెందిన సిరి సహస్రకు బీసీగా కుల దృవీకరణ పత్రం ఇచ్చారంటూ దాఖలైన వ్యాజ్యం విషయంలో హైకోర్టు స్పందిస్తూ.. బీసీ కుల ధ్రువీకరణ పత్రం ద్వారా ఆమె పొందే ఎలాంటి ప్రయోజనాలైనా కూడా ఈ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుకు సంబంధించి కలెక్టర్ జారీ చేసే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఆమె జైన కుటుంబంలో పుట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని.. దత్తత చెల్లుబాటును తేల్చాలని.. బీసీ–డీ అర్హతపై విచారణ జరపాలని విజయనగరం కలెక్టర్‌ను ఆదేశించింది.
కాగా, ఈ వ్యాజ్యం పరిష్కారం అయ్యే వరకు సిరి సహస్ర బీసీ–డీ సామాజిక వర్గ హోదాను క్లెయిమ్ చేయడానికి, తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను, కులం, స్థానికత, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించడానికి అనుమతించకుండా అధికారులను ఆదేశించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ మేరకు వారు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను మూసివేసింది. ‘ఇప్పటికే కొనసాగుతున్న చట్టబద్ధమైన విచారణపై ఈ కోర్టు జారీ చేసే ఏ ఉత్తరై్వనా ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఈ దశలో కలెక్టర్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేశారు.
బీసీ–డీ కుల ధ్రువీకరణ పత్రం రద్దుకు పిటిషన్
సిరి సహస్ర జైన కుటుంబంలో జన్మించారని, అయితే ఆమెను మజ్జి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నారన్న కారణంగా ఆమెను తూర్పు కాపు లేదా గాజుల కాపుగా పరిగణిస్తూ బీసీ–డీ కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడం తగదని పేర్కొంటూ విజయనగరం జిల్లాకు చెందిన బొమ్మి శ్రీనివాసరావు, గల్లా ధంతేశ్వరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: మంత్రి హోదాకే విలువ లేదా? ఆనం తీవ్ర అసంతృప్తి!


