
విజయవాడలో సిట్ విచారణకు వెళ్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి
మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టు
మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే
2014–19 మధ్య యథేచ్ఛగా దోపిడీ
ఖజానాకు గండికొట్టి.. అస్మదీయులకు దోచిపెట్టి రూ.25 వేల కోట్లకు మించి అక్రమాలు
సీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్ పైనే చంద్రబాబు
సన్నిహితుల డిస్టిలరీలకు ఎడాపెడా అనుమతులు
ఊరూరా బెల్ట్‌షాపులతో మద్యాన్ని ఏరులై పారించారు
చీకటి జీవోతో ప్రివిలేజ్ పన్ను రద్దు చేసిందీ బాబే..
2014–19 మధ్య చేసిన దందానే నేడూ కొనసాగిస్తున్న చంద్రబాబు
తన తప్పులను కప్పిపుచ్చేందుకే ఈ అక్రమ కేసులు, అరెస్టులు
అవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రం..
బెదిరింపులు, వేధింపులే అస్త్రంగా సిట్ బరితెగింపు
లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే పన్నాగం
అబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్ దాఖలు
కోర్టుకు సమర్పించడానికంటే ముందే పేజీల సంఖ్యతో సహా ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్ వివరాలు
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ భేతాళ కుట్రలు పరాకాష్టకు చేరాయి. కక్షసాధింపు కుతంత్రాల్లో తాజా అంకానికి టీడీపీ కూటమి సర్కారు తెరతీసింది. వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అక్రమ అరెస్టుకు తెగబడింది. ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేయలేని తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు మరింత పదునుపెట్టింది. అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ బాబు అన్నది బహిరంగ రహస్యం. 2014–19లో టీడీపీ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు ఆయనే. ఏకంగా రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీఐడీ దర్యాప్తులో నిగ్గుతేలడం నిఖార్సైన నిజం. సీఐడీ ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత రికార్డులను తిరగరాస్తూ మరింత భారీ దోపిడీకి తెగబడుతుండడం ప్రస్తుతం నడుస్తున్న కూటమి ప్రభుత్వ అవినీతి చరిత్రే.
అలాంటి చంద్రబాబు.. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలుచేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రేనన్నది సుస్పష్టం. వైఎస్సార్‌సీపీ హయాంలో జరగని కుంభకోణం జరిగినట్టుగా చూపించేందుకు టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటుచేయడం చంద్రబాబు మార్కు కుతంత్రం. ఇక దర్యాప్తు ముసుగులో సాక్షులు, ఇతరులను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం టీడీపీ ప్రభుత్వ అధికారిక గూండాగిరీకీ తార్కాణం. ఆ భేతాళ కుట్రనే సిట్ ఈ కేసులో దాఖలు చేసిన ప్రాథమిక చార్జ్‌షీట్‌లో పేర్కొని న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. కేవలం ఏడాదిలోనే టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు సాగిస్తున్న రాజకీయ భేతాళ కుట్ర ఇదిగో ఇలా ఉంది.
సాక్షి, అమరావతి: బాబు స్క్రిప్టు... భేతాళ కుట్ర... అందుకుతగ్గట్టు అబద్ధపు వాంగ్మూలాలు...! చంద్రబాబు డైరెక్షన్‌లో సాగుతున్న భేతాళ కుట్ర కేసులో సిట్ దర్యాప్తు పేరిట బరితెగిస్తోంది. అక్రమ కేసులో లేని ఆధారాలను సృష్టించేందుకు వేధింపులనే అస్త్రంగా చేసుకుంది. సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న వాంగ్మూలాలన్నీ కూడా బెదిరించి, వేధించి నమోదు చేసినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి అబద్ధపు వాంగ్మూలాన్నే సిట్ ఈ అక్రమ కేసుకు ప్రధాన ఆధారంగా చేసుకుంది.
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తొలుత అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరించిన ఆయన సిట్ బెదిరింపులకు వ్యతిరేకంగా మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అయినా సరే ప్రభుత్వం వాసుదేవరెడ్డిని వెంటాడి వేధించింది. డెప్యుటేషన్ ముగిసినా రిలీవ్ చేయకుండా అడ్డుకుంది. కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసింది. చివరికి సిట్ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే వాసుదేవరెడ్డిని రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
⇒ ఇదే రీతిలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది.
⇒ చంద్రబాబు కుట్రలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా మరో మూడున్నరేళ్లు సమయం ఉన్నా సరే పదవికి రాజీనామా చేసి.. టీడీపీ కూటమికి రాజ్యసభలో ఎంపీ సీటు దక్కేలా చేశారు. అనంతరం చంద్రబాబు చెప్పమన్నట్టుగా.. సిట్ విచారణకు హాజరై అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.
⇒ ఈ అక్రమ కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చేందుకు అంగీకరించని వారిపైన సిట్ తన ప్రతాపం చూపించింది. కొన్ని డిస్టిలరీల ప్రతినిధులు వృద్ధులు అని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చి వేధించింది. దాంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని కోర్టు ఆదేశించింది. కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్ కేసిరెడ్డి తండ్రిని బలవంతంగా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించింది. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
⇒ ఈ కేసులో అరెస్టయిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి విచారణలో చెప్పని విషయాలు చెప్పినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొనడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది.
⇒ వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరి, మదన్‌రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రంగా వేధించారు. బెంబేలెత్తిన గిరి సిట్ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సమ్మతించని మదన్‌రెడ్డిపై సిట్ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం విభ్రాంతికర విషయం. సిట్ అధికారులు తనపై భౌతికంగా దాడి చేశారని మదన్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు కూడా. ఇక అబద్ధపు వాంగ్మూలం ఇస్తే నామినేటెడ్ పదవితో పాటు రూ.2కోట్లు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు సిట్ అధికారుల ద్వారా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్నేహితుడు వెంకటేశ్‌నాయుడు దంపతులను ప్రలోభపెట్టారు. వారు తిరస్కరించడంతో అక్రమ కేసులో వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు.
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలను కూడా సిట్ అక్రమంగా అరెస్టు చేసింది.
⇒ అసలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతో కూడా సంబంధం లేని ప్రపంచ దిగ్గజ సిమెంట్ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్టు చేయడం సిట్ కుట్రకు పరాకాష్ట.విజయవాడ సిట్ కార్యాలయానికి వెళుతున్న పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే..
దర్యాప్తు పేరిట సిట్ ఎందుకు ఇంతగా నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తోంది...!? అంటే వినిపించే ఏకైక సమాధానం.. అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగనే లేదు. ఎలాంటి అవినీతి లేదు కాబట్టే లేని ఆధారాలు సృష్టించేందుకు సిట్ ఇంతగా దిగజారుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది.
అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళలను కుదించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934కు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసైన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కొనసాగిన 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించింది.
రాష్ట్రంలోని 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు లైసెన్సులు మంజూరు చేశాయి. మొత్తం డిస్టిలరీలను బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
⇒ మద్యం అమ్మకాలు పెరిగితే డిస్టిలరీలకు లాభాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. కానీ, వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. మరి కమీషన్లు ఎందుకు ఇస్తాయి...? ఇవ్వనే ఇవ్వవు. ఎలాంటి అవినీతి లేని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసులో సిట్ ఆధారాలు సేకరించలేకపోతోంది. అందుకే అప్పటి అధికారులు, ఇతర సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగా కేసును కొనసాగించడమే సిట్ ఏకైక విధానంగా మారింది. ఆ కుట్రనే చార్జ్‌షీట్ రూపంలో కూడా కొనసాగించింది.
మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్
శనివారం ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి వచి్చన మిథున్‌రెడ్డి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. మిథున్‌రెడ్డిని ఆదివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి నివాసంలో హాజరుపరుస్తారని తెలుస్తోంది.
⇒ సిట్ అధికారుల విచారణలో...వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేది ఎంపీ మిథున్‌రెడ్డి సాధికారికంగా తేల్చిచెప్పారు. ఎంపీ అయిన తనకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలలో ఏమాత్రం ప్రమేయం ఉండదని కుండబద్ధలు కొట్టారు.
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై సిట్ అధికారులు మిథున్‌ను పలు ప్రశ్నలు వేశారు. అయితే ఆయనపై అభియోగాలకు సంబంధించి సిట్ అధికారులు సరైన ఆధారాలను చూపించలేకపోయారు. ఈ కేసులో సిట్ బెదిరించి, వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాల ఆధారంగానే ఎంపీ మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆ అవాస్తవ ఆరోపణలను మిథున్ సమర్థంగా తిప్పికొట్టారు.
⇒ సిట్ అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా సరే, ప్రభుత్వ పెద్దల కుట్రనే సిట్ అధికారులు ఏకపక్షంగా అమలు చేశారు.
అవాస్తవాల పుట్ట.. రెడ్‌బుక్ కుట్ర సిట్ చార్జ్‌షీట్
చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ కుట్రకు సిట్ చార్జ్‌షీట్ అద్దంపట్టింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతో దీన్ని రూపొందించింది. ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తికి శనివారం సమర్పించారు. గతంలో తాము బెదిరించి వేధించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలు, సృష్టించిన తప్పుడు సాక్ష్యాల వివరాలను చార్జిషీట్‌లో పునరుద్ఘాటించారు.
తద్వారా రాజకీయ కక్షసాధింపే తమ లక్ష్యమని పరోక్షంగా అంగీకరించారు. నెలల తరబడి దర్యాప్తు పేరుతో చేసిన హడావుడి అంతా కనికట్టేనని... టీడీపీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన స్క్రిప్ట్‌నే దర్యాప్తు నివేదిక పేరుతో సమర్పించామని చేతల్లో చూపించింది. ఈ అక్రమ కేసులో అదనంగా 8 మంది.. సైమన్ ప్రసన్, కొమ్మారెడ్డి అవినాశ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సుజన్ బెహ్రాన్, మోహన్, రాజీవ్‌ప్రతాప్, బొల్లారం శివకుమార్, ముప్పిడి అవినాశ్‌రెడ్డిలను నిందితులుగా పేర్కొంది.
దాంతో నిందితుల సంఖ్య 41కు చేరింది. జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న 11 మంది రిమాండ్, ఫోరెన్సిక్ నివేదికలు, జప్తు చేసిన స్థిరాస్తులు, స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల జాబితా, ఇతర వివరాలను పొందుపరచినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కేసులో త్వరలో అనుబంధ చార్జ్‌షీట్లను దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది.
ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టారు
మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, పవర్ స్టార్, లెజెండ్, లెఫైర్ నెపోలిన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా, రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్ కుట్రే .
అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..
⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా?
⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?
⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?
⇒ ఎంపిక చేసుకున్న 4ృ5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?
⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?
వైఎస్సార్‌సీపీ హయాంలో..
⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది.
⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది.
⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది.
⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది.
⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది.
⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.