సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నిర్బందాలు, హౌస్ అరెస్ట్‌లకు పాల్పడుతుందని మాజీమంత్రి,బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం మాజీమంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. హాస్పిటల్ సందర్శనకు వెళ్తామంటే ఈ ప్రభుత్వానికి భయమెందుకు అని, అడ్డుకోవాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైపు ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు అక్రమ నిర్బందాలు, తప్పుడు కేసులు నమోదు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. హాస్పిటల్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమం అనే విషయాన్ని మరిచి వైద్యులు, నర్సింగ్ విద్యార్థుల ముందు ఉపయోగించిన భాషను తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమ నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతునొక్కాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.


