అక్రమ రవాణాకు గేట్ వేగా మారిపోయిన రాష్ట్రం
టీడీపీ నేతల కనుసన్నల్లోనే గంజాయి దందా
రెడ్‌బుక్ మినహా మరేమీ పట్టని పోలీసు వ్యవస్థ
ప్రకాశం జిల్లాలో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ పోలీసులు
ఎన్డీపీఎస్ నిబంధనలు తుంగలో తొక్కిన పోలీసులు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా శంఖవరప్పాడులో ఇద్దరు ఎస్‌ఐలు నేరుగా గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఘటనతో రాష్ట్రం నివ్వెరపోయింది. చంద్రబాబు సర్కారు చేతకానితనంతో రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాకు గేట్ వేగా మారిపోయిందని మరోసారి రుజువైంది. గంజాయి సాగు, రవాణాను అరికట్టాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో కూటమి నేతల కనుసన్నల్లోనే యథేచ్ఛగా దందా సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ పార్టీని ఛేదించినా టీడీపీ కూటమి నేతలే చిక్కుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో తెలంగాణ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్‌రెడ్డి డ్రగ్స్ దందాలో అడ్డంగా దొరకడం గమనార్హం.
కుటీర పరిశ్రమలా లిక్విడ్ గంజాయి యూనిట్లు
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో గంజాయి రహిత రాష్ట్రంగా చేస్తామని ఎన్నికల్లో నమ్మబలికిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో రాష్ట్రం గంజాయి దందాకు గేట్ వేగా మారినా చోద్యం చూస్తున్నారు. టీడీపీ కూటమి నేతలే రింగ్ మాస్టర్లుగా, మత్తు మాఫియాలా మారి రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్) జిల్లా కేంద్రంగా గంజాయి మాఫియాకు ఊపిరి పోసింది. మొత్తం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో గంజాయి సాగు చేయిస్తుండటంతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి భారీగా గంజాయిని కొనుగోలు చేస్తూ ఏపీ పరిధిలో నిల్వ చేస్తున్నారు. ఏఎస్‌ఆర్ జిల్లాలో కుటీర పరిశ్రమ తరహాలో లిక్విడ్ గంజాయి యూనిట్లను నెలకొల్పారు. అంతటా ఏజెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సిండికేట్ భారీ స్థాయిలో గంజాయి స్మగ్లింగ్ సాగిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు దర్జాగా గంజాయి తరలిస్తున్నారు. హోంమంత్రి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా గంజాయి పట్టుబడటం గమనార్హం.
ఆదాయ వనరుగా గంజాయి..
రాష్ట్రంలో యధారాజా తథా పోలీస్ అనే చందంగా కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం గంజాయి నిర్మూలనను గాలికి వదిలేయడంతో కొందరు టీడీపీ నేతలు దాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అధికార పార్టీ నేతలే బరి తెగించడంతో రెడ్‌బుక్ రాజ్యాంగంలో తామేం తక్కువ తినలేదన్నట్లుగా కొందరు పోలీసులు సైతం గంజాయి దందాకు పాల్పడుతున్నారు. తాజాగా శంఖవరంపాడులో ఇద్దరు ఎస్‌ఐలు మరికొందరు పోలీసులతో ధూమ్ ధామ్‌గా పార్టీ చేసుకుని వెళుతూ యాక్సిడెంట్ చేసిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ చేసిన కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడంతో అసలు బండారం బట్టబయలైంది. రెడ్‌బుక్ అమలు మినహా మరేమీ పట్టని పోలీసు వ్యవస్థ ఇప్పటికే రాష్ట్రంలో అబాసుపాలైంది. తాజా ఘటనతో గంజాయితో వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేస్తున్నారనే విషయం బట్టబయలైంది.
గంజాయి పట్టుకొచ్చారా.. పట్టుకున్నారా?
గంజాయి వ్యవహారంలో ప్రకాశం జిల్లా పోలీసులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం ద్వారా తప్పు చేశారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వేరేవారిపై కేసు పెట్టేందుకే గంజాయి తెచ్చినట్టు ఒకసారి.. కాదు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని మరోసారి నాలుక మడతేయడంతో అడ్డంగా బుక్ అయ్యారు. వాస్తవానికి గంజాయి, డ్రగ్స్ విషయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదు. ఎన్డీపీఎస్ చట్టం–1985, ఎన్డీపీఎస్ నియమావళి–2022, ఎన్సీబి స్టాండింగ్ ఆర్డర్ 1/89) ప్రకారం సోదా, స్వా«దీనం, నమూనా సేకరణ ప్రక్రియలను నిర్వహించేటప్పుడు దర్యాప్తు అధికారి కచ్చితమైన నిబంధనలను పాటించడం తప్పనిసరి.
గంజాయి స్వాదీనం సమయంలో పోలీసులు పాటించాల్సిన కీలక నిబంధనలివీ..
⇒ సోదాకు ముందు అవసరమైన చర్యలు, సమాచారాన్ని (సెక్షన్లు 41/42) ప్రకారం లిఖితపూర్వకంగా నమోదు చేశారా? ఆ సమాచారాన్ని 72 గంటల్లో పైఅధికారికి నివేదిక ఇచ్చారా?
⇒ సోదా నిర్వహణ, స్వతంత్ర సాక్షులు (సెక్షన్ 100 సీఆర్‌పీసీ, ఎన్డీపీఎస్ సెక్షన్ 50 ప్రకారం కనీసం ఇద్దరు సాక్షులు ఉన్నారా?
⇒ వ్యక్తిగత సోదా రక్షణ సెక్షన్ 50 ప్రకారం సోదాలు గెజిటెడ్ అధికారి, మేజిస్ట్రేట్ సమక్షంలో నిర్వహించే చట్టపరమైన హక్కు గురించి నిందితుడికి లిఖితపూర్వకంగా తెలిపారా?
⇒ రసాయన విశ్లేషణ కోసం స్వా«దీనం చేసుకున్న సరుకును అక్కడే సీల్ చేసి, తూకం వేసి, జాబితా తయారు చేయాలనే విషయం తెలియదా? సెక్షన్ 52 ఏ కింద నమూనా సేకరణ, జాబితా ధృవీకరణ, ఫోటోగ్రఫీ ప్రక్రియలు మేజిస్ట్రేట్ సమక్షంలోనే చేయాలనే విషయం తెలియదా?
⇒ సంఘటనా స్థలంలోనే నిందితుడు, సాక్షుల సంతకాలతో కూడిన సమగ్ర పంచనామా, స్వాధీన మెమోను సిద్ధం చేశారా?
⇒ స్వాదీనం చేసుకున్న భారీ మొత్తంలోని సరుకును సీళ్లు చెక్కుచెదరకుండా రిజిస్టర్‌లో నమోదు చేసి అధికారిక పోలీసు స్టోర్‌లో వెంటనే భద్రపరచాలనే నిబంధన ఎందుకు పాటించలేదు?
⇒ సెక్షన్ 57 కింద అరెస్టు/స్వాధీనానికి సంబంధించిన పూర్తి నివేదికను 48 గంటల లోపు తక్షణం పైఅధికారికి పంపాలనే విషయం తెలియదా?


