హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్య
ప్రతి ఇంట్లో జగన్ పాలన–చంద్రబాబు పాలనపై పోలిక
జగన్ ఎలా చేయగలిగాడు? బాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అని చర్చ
ఎన్నికల ముందు మూడింతలు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి బాబూ?
బాండ్లు.. సంతకాలు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్.. హామీలు బూటకం
అందుకే వెన్నుపోటు పార్టీ అని బాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు
ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి హుళక్కి.. అమ్మ ఒడి, రైతు భరోసా అరకొర
మట్టి, ఇసుక, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రంలో యథేచ్ఛగా దోపిడీ
సంక్షోభంలో రైతులు.. గిట్టుబాటు ధరల్లేవు, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ లేవు.. విద్యార్థులకూ వెన్నుపోటు.. పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన బకాయిలు.. అన్ని వర్గాలనూ మోసగించిన చంద్రబాబు
అందుకే ఆ స్థాయిలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత
అదే సమయంలో వైఎస్సార్‌సీపీకి అత్యంత ప్రజాదరణ
మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన పార్టీ మనది
మరో ఏడాదిలో నా పాదయాత్ర.. ఆ తర్వాత ఏడాదిలో ఎన్నికలు
ఎన్నికలు ఎప్పుడు జరిగినా మన గెలుపు తథ్యం
రాజమండ్రి రూరల్ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం
‘‘ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. అక్కడ జగన్ ఉన్నాడు. వైఎస్సార్‌సీపీ ఉంది. ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు. వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా ఒక్క మనిషి మాత్రమే. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’’
‘‘చంద్రబాబు హయాంలో రైతులు హ్యాపీగా లేరు. మహిళలు హ్యాపీగా లేరు. చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు. ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు.’’
‘‘నాడు మడమ తిప్పని మన పరిపాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. అలాగే చంద్రబాబు చేసిన మోసాలపైనా చర్చ సాగుతోంది. అందుకే వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఎన్టీ రామారావు అయినా సరే. ప్రజలైనా సరే. ఆయన చేసేది వెన్నుపోటు కాబట్టి. ఆ పార్టీకి ప్రజలే
ఆ నామకరణం చేశారు.’’
-వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ పాలనపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేరని, అన్ని వర్గాలనూ మోసం చేశారని అన్నారు. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మన గెలుపు తధ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న వైఎస్ జగన్.. ఆ దిశలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించి.. ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాజమండ్రి రూరల్ పార్టీ ఇన్‌ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. 
ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు?
జగన్ ఇచ్చే దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామని చంద్రబాబు అన్నారు. అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే రూ.15 వేలు ఇచ్చాడు. నేను అలా కాదు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున.. నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తా అన్నాడు. అంతటితో ఆగిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి, అమూల్, ఐటీసి, రిలయన్స్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలతో టైఅప్ చేయించి, ప్రతి మహిళను తాను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తే.. జగన్ ఏటా కేవలం రూ.18,750 మాత్రమే ఇస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే, 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తానన్నాడు. మరి ఎక్కడ రూ.18,750. ఎక్కడ రూ.48 వేలు. అంటే దాదాపు మూడు రెట్లు. ఇంకా అంతటితో ఆగలా. 18 ఏళ్లు నిండిన ఏ మహిళకైనా నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామన్నారు. అలా నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని ప్రచారం చేశారు. అది ఆడబిడ్డ నిధి అంట!. ఇంకా భుజాన కండువా వేసుకుని ఎవరైనా రైతు కనిపిస్తే ఏమన్నాడు?. జగన్ ఇచ్చేది ఏటా రూ.13,500 మాత్రమే కదా, నేను వస్తే రూ.26 వేల చొప్పున ఇస్తామన్నారు. మళ్లీ ఎవరైనా యువకుడు కనిపిస్తే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అన్నాడు. అదే నిరుద్యోగ భృతి. అలా అప్పుడు జగన్ ఇచ్చేవాటికన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు.
బాండ్లు, సంతకాలతో పచ్చి మోసం
ఇంటింటికి పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యే క్యాండిడేట్లను పంపాడు. తన ఫోటో, సంతకంతో ఒక బాండ్ తయారు చేసి, ప్రతి ఇంటికి ఇవ్వడం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని, మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా? అయితే ఆయనకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు ఉన్నారమ్మా? వాళ్లకు ఏటా రూ.18 వేలు. మీ ఇంట్లో 50 ఏళ్లు నిండిన మీ అత్తమ్మ ఉందా? నీకు రూ.48 వేలు. సినిమా రిలీజ్ జూన్, 2024. అని బాండ్లు ప్రతి ఇంటికీ పంపారు. ఇంకా ప్రమాణం. ‘నేను పవన్ కళ్యాణ్. మేమిద్దరం ప్రమాణ పూర్తిగా ప్రమాణం చేస్తున్నాం’ అని చెప్పి, ఇద్దరూ బాండ్ల మీద సంతకాలు చేశారు. అవేవీ అమలు కాలేదు కాబట్టి, ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.
ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ
ఈరోజు రాష్ట్రంలో మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా. అధిక ధరలకు పీపీఏలు. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు ఇచ్చేయడం, కొత్త మెడికల్ కాలేజీల అమ్మకం. అమరావతిలో చూస్తే చదరపు కట్టడానికి ఏకంగా రూ.20 వేలు వ్యయం. అదే హైదరాబాద్, బెంగళూరులో ఫైవ్ స్టార్ సదుపాయాలతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్ కట్టినా చదరపు అడుగుకు రూ.4,500. ఇంకా మహా అయితే రూ.5 వేలు వ్యయం. మరి ఇక్కడ అమరావతిలో ఇసుక ఉచితం. ఇంకా పలు రాయితీలు. అయినా చదరపు అడుగుకు రూ.20 వేలు ఖర్చు అంటున్నారు. లూటీ ఏ స్థాయిలో జరుగుతోందో ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు పీపీపీ పేరుతో దోచేయడం. ఆస్పత్రి సేవలు, తాగునీరు, ఆర్టీసీ, చివరకు చెత్త ఎత్తడం కూడా అంతా పీపీపీ. అంటే ఇక మీదట మొత్తం ప్రైవేట్ వాళ్ళకే. అంటే లంచాలు తీసుకోవడం. అన్నీ అమ్మేయడం. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి అంటే అర్ధం ప్రభుత్వ ఆస్తులన్నీ శనక్కాయలు, పప్పుబెల్లాలకి అమ్మేయడం.
విద్యార్థులకూ వెన్నుపోటు
రాష్ట్రంలో పిల్లలు కూడా సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేవు. మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్ లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026. ఏటా రూ.1100 కోట్లు. మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది. దీంతో రూ.3,300 కోట్లు బాకీ. విద్యాదీవెన 2024 జనవరి–మార్రి త్రైమాసికం నుంచి ఇవ్వలేదు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం వరకు చూసుకుంటే మొత్తం 13 త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు. అంటే మొత్తం రూ.9,100 కోట్లు బాకీ. అది వసతి దీవెన బాకీ రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రూ.12,400 కోట్లు. కానీ, ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి రూ.1700 కోట్లు. మరోసారి రూ.1100 కోట్లు. అంటే ఇంకా రూ.9 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు. ఫీజు చెల్లించలేక పిల్లలు చదువులు మానేసే దుస్థితి. ఇక గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఏకంగా 6 లక్షలు తగ్గారు.
అక్కచెల్లెమ్మలకూ వంచన
అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు లేదు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్‌ల సంగతి దేవుడెరుగు. ఇచ్చే సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేశాడు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు ఉంటే, మన హయాంలో వాటి పరపతి పెంచడంతో, ఆ రుణ పరిమితి రూ.49 వేల కోట్లకు చేరింది. ఇంకా ఆ అక్కచెల్లెమ్మలకు మనం చేయూత ఇచ్చాం. ఆసరా ఇచ్చాం. సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. రకరకాల పద్ధతుల్లో చేయి పట్టుకుని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగింది. దీంతో రుణ పరిమితి రూ.20 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్లకు చేరింది. అలా మన హయాంలో పెరుగుదల ఉంటే, ఇప్పుడు రూ.49 వేల కోట్ల నుంచి ఈ రోజు రూ.39 వేల కోట్లకు పడిపోయింది.
సంక్షోభంలో వ్యవసాయం..
రైతుల గురించి కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితి. 53 శాతం వర్షం లోటు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ.. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. లోటు వర్షపాతం నమోదవుతున్నా, ఎక్కడా వరికి బదులు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వలేదు. ఉచిత పంటల బీమా ఈయనే దగ్గరుండి కత్తిరించాడు. ఇన్‌పుట్ సబ్సిడీ తీసేశారు. ఆర్బికేలను నిర్వీర్యం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకం సున్నా. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ లేకుండా ఉన్నారంటే, శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం 878 అడుగుల పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఫుల్ డ్రా అంటే 44 వేల క్యూసెక్స్. పక్కన తెలంగాణ పవర్ హౌస్ నుంచి పవర్ జనరేషన్ కోసం రిజర్వాయర్‌లో 800 అడుగుల నుంచే పంప్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి.. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు మొత్తం పంటలంతా నష్టపోతున్నారు. రైతులందరూ 40 శాతం పెట్టుబడి పెట్టి నారుమళ్ళు వేసి ఫెర్టిలైజర్స్ చల్లారు. ఒకవైపు ఉచిత పంటల బీమా లేదు.. మరోవైపు నీళ్లు ఇవ్వలేను అంటాడు.
రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..
ఎన్నికలు జరిగి చూస్తుండగానే మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కళ్ళు మూసుకొని, తెరిచే సరికి ఇంకో సంవత్సరం దాటితే, ఆ తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. కళ్ళు మూసుకొని, తిరిగి తెరిచేసరికి ఈ రెండేళ్లు ఇట్టే ముగిసిపోతాయి. చూస్తుండగానే, మూడో ఏడాది కూడా వేగంగా గడిచిపోతుంది. ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. మామూలుగా ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా మూడో ఏడాదిలో వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కానీ చంద్రబాబు పాలనలో అది ఇప్పటికే కనిపిస్తోంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. దీనినిబట్టి చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా మన గెలుపు తథ్యం.
చంద్రబాబు పాలనకు–మన పాలనకు తేడా ఏమిటంటే...
ఎన్నికల మేనిఫెస్టో 99 శాతం పూర్తి చేసిన ఏకైక పార్టీ.. ఈ రాష్ట్రంలో.. బహుశా దేశంలో ఏదైనా ఉంది అంటే, అది వైఎస్సార్‌సీపీ అని సగర్వంగా చెప్పగలం. చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్లి, మా పాలనలో ఇలా జరిగింది అని గొప్పగా కూడా చెప్పుకోగలం. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఆ రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుందో చెప్పేవాళ్లం. ఆ తర్వాత క్రమం తప్పకుండా అమలు చేసే వాళ్లం. అలా పక్కాగా బటన్ నొక్కిన పరిపాలన ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఏకంగా రూ.2.73 లక్షల కోట్ల డీబీటీ.. అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నగదు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు, ఇళ్లలోకి వెళ్లిన పరిస్థితి. అలాంటిది చరిత్ర ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి, పథకాలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ చూడలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్‌లో దిశ వంటి కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ సచివాలయంలో ఉండడం. ఇవన్నీ చరిత్ర చూడని విషయాలు. స్కూళ్లు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాలు జరగడం, గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, మూడవ తరగతి నుంచే టోఫెల్ పీరియడ్, పిల్లలకు ఇంగ్లీష్‌లో శిక్షణ, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్స్ అన్నీ డిజిటలైజ్ కావడం, ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్ మీడియంతో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, రోజుకో మెనూతో బడి పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ అమలు చేసిన గోరుముద్ద.. ఆ స్థాయిలో సమీక్ష చేసిన సీఎంను బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
విద్యా రంగంలో విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ మాత్రమే కాదు.. ఏకంగా ఐబి సిలబస్. ఐబి వాళ్ళని తీసుకొచ్చి, మన రాష్ట్ర ప్రభుత్వంతో పని చేయిస్తూ, 2020 నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా, 2025 మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ, 2035 నాటికి ఐబి సిలబస్. అలా ఏకంగా మన రాష్ట్ర పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ 2035 లో రాసేట్టుగా అడుగులు పడిన పరిస్థితి అంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే, అది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే. మనం రాక మునుపు ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ఇంకా పథకంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టాం. నాడు–నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మొదటిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనం ఇచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే.
మనం వచ్చిన తర్వాతే తొలిసారిగా ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ). ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు. ఒక 104 అంబులెన్స్ సర్వీస్. పీహెచ్‌సీలో ప్రతి డాక్టర్‌కు ఆ మండలంలో నాలుగైదు గ్రామాలు కేటాయించి, ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే, మరో డాక్టర్ 104 సర్వీస్‌లో తనకు కేటాయించిన గ్రామాల్లో వైద్య సేవలందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. వైద్య సేవల కోసం తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లే డాక్టర్, అక్కడి విలేజ్ క్లినిక్‌ను ఉపయోగించేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, అలా డాక్టర్లను గ్రామాలకు పంపించిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అంటే, అది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే. సాధారణంగా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు దొరకని పరిస్థితి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు మాత్రమే దొరికేట్లుగా చేసి పరిస్థితి కూడా ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం కానీ.. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడూ జరగని విషయాలు.
గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట
తొలిసారిగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు. ఆ ఆర్బీకే పరిధిలోని గ్రామంలో ప్రతి ఎకరా ఈ–క్రాప్. ఆర్బీకేలోనే ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. తాను అగ్రికల్చరల్ అసిస్టెంట్‌గా రైతు చేయి పట్టుకుని నడిపించడం. ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటకు ఆర్బీకేలో బోర్డు పెట్టి పంటలకు గిట్టుబాటు ధరలు ప్రదర్శించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే, ఆ గ్రామంలో వెంటనే ఆర్బికే అసిస్టెంట్, సీఎం–యాప్ ద్వారా అంటే..‘కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్’. ఆ సీఎం యాప్‌ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ ఫెడ్, వెంటనే జోక్యం చేసుకునే వారు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో ఆ ఆర్బికే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి, ఆ గ్రామంలో ఆ పంట కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు కనిపించే విధంగా గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎప్పుడూ చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందే సచివాలయం. మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పని చేస్తూ, చిక్కటి చిరునవ్వుతో సేవలు. మన గ్రామంలోనే 60 ఇళ్లకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్లి సహాయం అందించే పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడూ చరిత్రలో చూడలేదు. లంచాలు లేకుండా ప్రభుత్వ సాయం, ఎప్పుడైనా జరిగిందంటే, అది ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే.
పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది
⇒ రాష్ట్రం నివ్వెరపోయే ఘటన. మొన్న అద్దంకిలో జరిగింది. ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. చూస్తే, కారులో ఇద్దరు ఎస్‌ఐలు సివిల్ డ్రెస్‌లో ఫుల్ మత్తులో ఉన్నారు. అప్పుడందరూ చుట్టుముట్టి కారు డిక్కీ ఓపెన్ చేస్తే, గంజాయి, మద్యం, పెద్ద ఎత్తున డబ్బులు, పోలీస్ యూనిఫార్మ్ కనిపించాయి. యాక్సిడెంట్ విషయం తెలిసిన ఒక సీఐ అక్కడికి వచ్చాడు. అక్కడ స్థానికులు ఆ యాక్సిడెంట్‌ను వీడియో తీస్తుంటే, కేసు పెడతామని బెదిరించారు. ఆ తర్వాత ఆ ఎస్‌ఐలను ఘటనా స్థలి నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళ కారు. అయినా ఇంతవరకు కేసు లేదు. ప్రజలు కూడా మర్చిపోయేలా కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
⇒ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏ స్థాయిలో గాడి తప్పిందో చెప్పడానికి మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన. చిన్న ఉదాహరణ చెబుతా. డాక్టర్ ప్రియాంక. పీజీ మెడికల్ స్టూడెంట్. మన కళ్ల ముందే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. తాగిన మైకంలో మత్తులో అది మరి గంజాయా లేకపోతే మద్యమా ఏమో గాని ఆ మత్తులో కారుతో గుద్దడం, ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబునాయుడు గవర్నమెంట్‌లో ఏం కేసు పెట్టారు? కనీసం సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టలేదు. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే, వైఎస్సార్‌సీపీ ఆ కుటుంబానికి అండగా నిలబడితే, ప్రజలు వైఎస్సార్‌సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై నిరసనకు దిగితే కూడా చంద్రబాబు మనసు కరగని పరిస్థితి.
⇒ మరోవైపున చూస్తే, దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి? డాక్టర్ అప్పలరాజు కేసు. పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్. కారు కాదు. తాగింది లేదు, తాగుడు అలవాటు కూడా లేదు. 18 ఏళ్ల పిల్లోడు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగింది. వెంటనే ఆ పిల్లోడు 108 కి ఫోన్ చేశాడు. ప్రమాదంలో గాయపడిన ఆ గొర్రెలకాపరికి సీపీఆర్ కూడా చేశాడు. అలా ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. స్వయంగా 108 అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు. అప్పలరాజు కూడా పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చారు. కానీ, అదే అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏమిటి? ఏకంగా మర్డర్ కేసు పెట్టారు. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో కారుతో రెండు మూడు సార్లు గుద్ది, ఆపకుండా వెళ్ళిపోతే, చిన్న చిన్న సెక్షన్లతో కేసు.
⇒ మొన్న తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ రవాణా. ఏదో కొన్ని కార్టన్లు కాదు. లారీలకు లారీల లోడ్. అంతకు ముందు తంబళ్లపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, ములకలచెరువులో ఏకంగా లిక్కర్ మాన్యుఫ్యాక్చరింగ్ కుటీర పరిశ్రమ పెట్టి, వాళ్ల బెల్ట్ షాపులకు పంపిణీ చేసి అమ్మించారు. ప్రతి ఐదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూమ్.ఆ పర్మిట్ రూమ్‌ల్లో లూజ్‌గా మందు అమ్మకాలు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మకం. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.
ఎవరైనా చంద్రబాబుని ఎన్నికల హామీలపై ప్రశ్నించినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లు చూపించి అడిగినా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతు మీద కేసులు. అక్రమ కేసులు, అరెస్టులు, రొటీన్‌గా సాగుతున్నాయని, అవి ఏ స్థాయికి చేరాయంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ గాడి తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైతే పోలీసులను ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెడతారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వ్యవస్థ గాడి తప్పుతుందని జగన్ అన్నారు.
స్థానిక సమరానికి సై!
స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదని ఎత్తిచూపారు. అందుకే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత కనబడకుండా కుట్రలు చేసే వీలుందని.. అందుకు పోలీసు బలగాలనూ వినియోగించవచ్చని చెప్పారు. వైఎస్సార్‌సీపీకి అత్యంత ప్రజాదరణ ఉందని.. వచ్చే ఎన్నికల్లో వారే తమకు అండగా ఉంటారని, తోడుగా నిలుస్తారని అన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోరాడాలని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ‘‘చంద్రబాబు ఒక విలన్. స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగనీయడు. పోలీసులను పెడతాడు. దౌర్జన్యం చేస్తాడు. బెదిరిస్తాడు. ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, అందరూ గుర్తు పెట్టుకోండి. మనకు ప్రజలు సపోర్ట్‌గా ఉన్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్ ఉంటుంది.
మీ జగనన్న సపోర్ట్‌గా ఉంటాడు.’’ అని జగన్ పేర్కొన్నారు. ‘వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి.’ అని అన్నారు. ఒకవేళ పోలీసులను దురి్వనియోగం చేసి, ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలవడం కోసం వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుగారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ‘అందుకే కచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా మనకు మనం ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. గెలుపు మనదే. చివరగా, వేణుఅన్న మీ అందరికీ పరిచయస్తుడే. మంచి లీడరు. అందుకే ఆయన్ను గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నాను’ అని జగన్ పేర్కొన్నారు.


