నేర చరిత్రలో టాప్‌లో రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy At Top Of Criminal Cases And CM Chandrababu At Top 4 In List, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

నేర చరిత్రలో టాప్‌లో రేవంత్‌రెడ్డి

Aug 20 2026 4:16 AM | Updated on Aug 20 2026 10:37 AM

CM Revanth Reddy at top of criminal history, CM Chandrababu At Top 4

89 క్రిమినల్‌ కేసులతో అగ్రస్థానం 

19 క్రిమినల్‌ కేసులతో నాలుగో స్థానంలో చంద్రబాబు 

బాబుపై 32 తీవ్రమైన.. 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు 

ఏపీ అసెంబ్లీలో 79 శాతం, తెలంగాణలో 68 శాతం ఎమ్మెల్యేలపై నేరారోపణలు  

దేశవ్యాప్తంగా చట్టసభల సభ్యులపై 4,192 కేసులు పెండింగ్‌  

సుప్రీంకు నివేదిక సమర్పించిన అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ముఖ్యమంత్రులపై నమోదైన క్రిమినల్‌ కేసుల జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి 89 కేసులతో (72 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 160 ఇతర ఐపీసీ సెక్షన్లు) దేశంలోనే తొలి స్థానంలో ఉన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 4వ స్థానంలో నిలిచారు. చంద్రబాబుపై 19 కేసులు నమోదు కాగా 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. చట్టసభల సభ్యులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు నియమించిన సీనియర్‌ న్యాయవాది, అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా తాజాగా అత్యున్నత న్యాయస్థానానికి 22వ నివేదిక సమర్పించారు. ఇందులో పలు కీలక వివరాలను వెల్లడించారు. దేశంలో 28 రాష్ట్రాలకుగాను 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) నివేదికల ఆధారంగా అమికస్‌ క్యూరీ తెలిపారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో నిలిచారు. కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్‌ 19 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు.  

ఆందోళనకరంగా తెలుగు రాష్ట్రాల చట్టసభలు..  
చట్టసభల్లో నేర చరిత్ర కలిగిన వ్యక్తుల సంఖ్య తీవ్ర ఆందోళనకరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల గణాంకాలను నివేదికలో విపులంగా ప్రస్తావించారు. ఏపీ అసెంబ్లీలో (2024 ఎన్నికల నాటికి) మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 138 మందిపై (79 శాతం) క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 98 మంది (56 శాతం) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. ఏపీకి చెందిన 25 మంది లోక్‌సభ సభ్యుల్లో 13 మందిపై (52 శాతం) కేసులు ఉండగా 9 మందిపై (36 శాతం) తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. తెలంగాణ అసెంబ్లీలోని (2023 ఎన్నికల నాటికి) 119 మంది ఎమ్మెల్యేల్లో 81 మందిపై (68 శాతం) క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 58 మంది (49 శాతం) తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తెలంగాణలోని 17 మంది లోక్‌సభ ఎంపీల్లో 14 మంది (82 శాతం) క్రిమినల్‌ కేసులు, 12 మంది (71 శాతం) తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.  

కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌...  
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో ఏకంగా 4,192 కేసులు ప్రత్యేక న్యాయస్థానాల్లో విచారణ దశలో పెండింగ్‌లో ఉన్నట్లు హైకోర్టులు ఇచ్చిన సమాచారం ద్వారా నివేదిక స్పష్టం చేసింది. పదేళ్లకు పైగా విచారణకు నోచుకోని కేసులు 519 ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్ల మధ్య పెండింగ్‌లో ఉన్నవి 754 కేసులుగా తేలింది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఉన్నవి 562 కేసులు ఉన్నాయి. మూడేళ్ల లోపు ఉన్నవి 1,095 కేసులుగా నమోదయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సిట్టింగ్‌ ఎంపీలపై 335 కేసులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు విచారణ దశలో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 

ఇంకా ఛార్జ్‌షీట్‌ దాఖలు కాకుండా దర్యాప్తు దశలోనే 700 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తు దశలోనే ఉండిపోయాయి. ఏపీ హైకోర్టు నివేదిక ప్రకారం ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 18 విచారణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సమర్పించిన నివేదికలో కేవలం హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే 21 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనగా హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో రాష్ట్రవ్యాప్తంగా 300 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నమోదైంది. 2025లో దేశవ్యాప్తంగా 1,243 కేసులు పరిష్కారం కాగా కొత్తగా 1,050 కేసులు నమోదయ్యాయి.  

అమికస్‌ క్యూరీ కీలక సిఫార్సులు...  
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా పలు కీలక సూచనలు చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు కేవలం ఆ కేసులనే విచారించాలి. ఆ కేసులు పూర్తయిన తర్వాతే సాధారణ కేసులను వాటికి కేటాయించాలి. హైకోర్టులు సుమోటోగా కేసుల పురోగతిని ప్రతి నెలా పర్యవేక్షించాలి. ఛార్జ్‌ ఫ్రేమ్‌ చేసిన ఏడాది లోపు విచారణను తప్పనిసరిగా పూర్తి చేయాలి. మూడేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను జాప్యం లేకుండా రోజువారీగా విచారించాలి. వరుసగా రెండు వాయిదాలకు నిందితులు హాజరు కాకపోతే తక్షణమే నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేయాలి. సాక్షులను కోర్టులో హాజరుపరిచే బాధ్యతను నోడల్‌ ప్రాసిక్యూషన్‌ అధికారికి అప్పగించాలి. ఒకవేళ విఫలమైతే సదరు అధికారిపై జిల్లా ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. కేసుల వివరాలు, రోజువారీ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో రియల్‌ టైమ్‌ డేటా ద్వారా పొందుపరచాలి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement