పేరు, ఇంటి పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు, అక్షర దోషాలకు నోటీసులు రావు
అలాంటి ఓటర్ల వివరాలను సరిచేయనున్న ఈఆర్వోలు
వివరాల్లో అంతకు మించి వ్యత్యాసాలుంటేనే నోటీసులు
అన్‌మ్యాప్డ్ ఓటర్లందరికీ నోటీసులు.. ఒకేసారి కాకుండా దశలవారీగా
ఈఆర్వోలకు సీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలు
నోటీసు వస్తే వారంలోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)లో భాగంగా వివరాల్లో స్వల్ప వ్యత్యాసాలు కలిగిన ఓటర్లకు నోటీసులు జారీ చేయొద్దని క్షేత్ర స్థాయిలోని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. ఓటర్ల ఇంటి పేరు, అసలు పేరులో స్వల్ప వ్యత్యాసాలుంటే వాటిని ఈఆర్వోలే సరిచేయాలని ఆదేశించింది. అక్షర దోషాల విషయంలో పట్టింపులకు పోరాదని కోరింది. ముసాయిదా జాబితాలోని 2,64,87,213 మంది ఓటర్లలో ఏకంగా 92,87,577 మంది (35.06%) ఓటర్లకు నోటీసులు జారీ చేసి, అక్టోబర్ 15లోగా విచారణ ప్రక్రియను ముగించాల్సి ఉంది. చివరిసారిగా 2002లో నిర్వహించిన ‘సర్’ఓటర్ల జాబితాలో తమ పేరు/తమ తల్లిదండ్రులు/వారి తల్లిదండ్రుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో నమోదు చేయాల్సి ఉండగా, 32,36,659 మంది ఓటర్లు ఈ వివరాలను అందించలేదు. దీంతో వారిని అనుసంధానం కాని (అన్‌మ్యాప్డ్) ఓటర్లుగా గుర్తించారు. వీరందరికీ స్థానిక ఈఆర్వోల నుంచి నోటీసులు అందనున్నాయి. ఈసీ నిర్దేశించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని వీరంతా రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది.
సర్–2002 జాబితాలో తమ పేరు/బంధువుల పేరు ఉన్నట్టు ఎన్యూమరేషన్ ఫారంలో వివరాలిచ్చిన వారిలో 60,50,918 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలున్నాయి. పైరెండు కేటగిరీలు కలిపి 92,87,577 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని తొలుత భావించారు. అయితే అంతమందికి నోటీసులిస్తే ఒకేసారి వేలాది మంది ఈఆర్వోల కార్యాలయాలకు తరలి వస్తారని, దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని సీఈఓ కార్యాలయం హెచ్చరించింది. వివరాల్లో వ్యత్యాసాలు కలిగిన ఓటర్లందరికీ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. స్వల్ప వ్యత్యాసాలు కలిగిన ఓటర్లను మినహాయించి వారి వివరాలను ఈఆర్వోలే సరిచేయాలని ఆదేశించింది. దీంతో లక్షల సంఖ్యలో ఓటర్లకు నోటీసులు తప్పనున్నాయి. విస్మరించలేని తీవ్రమైన వ్యత్యాసాలు కలిగి ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేసి రాతపూర్వక వివరణ కోరాలని కోరింది. సర్–2002 జాబితాలో తమ పేరు/తల్లిదండ్రులు/వారి తల్లిదండ్రుల పేర్లు కలిగిన ఓటర్లను అర్హులైన ఓటర్లుగా భావించి తుది ఓటర్ల జాబితాలో చోటు కల్పించాలని సూచనలు జారీ చేసింది.
దశల వారీగా నోటీసులు..
రాష్ట్రంలో ఏకంగా 92 లక్షల మంది వ్యత్యాసాలు కలిగిన, అన్‌మ్యాప్డ్ ఓటర్లుండగా, 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 119 మంది ఈఆర్వోలు వారికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. మరో 892 మంది ఏఈఆర్వోలు ఈ ప్రక్రియలో సహకరించనున్నారు. దీంతో అందరికీ ఒకేసారి నోటీసులు ఇవ్వకుండా దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నోటీసులు అందుకోనున్న మొత్తం ఓటర్ల సంఖ్యను విభజించి ప్రతి రోజూ కొంతమందికి మాత్రమే నోటీసులు జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
వారంలోగా వివరణ ఇవ్వాల్సిందే..
ఇక నోటీసులు అందుకునే ఓటర్లందరినీ ఈఆర్వోలు విచారణకు పిలవరు. రాతపూర్వక వివరణను వారం రోజుల్లోగా సమర్పించాలని నోటీసు జారీ చేస్తారు. ఈ విషయంలో నోటీసులో ముద్రించి ఉంటుంది. తీవ్ర వ్యత్యాసాలున్న ఓటర్లను మాత్రమే ఈఆర్వోలు విచారణకు పిలవనున్నారు. విచారణ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి తగిన సంఖ్యలో టేబుళ్లు, సిబ్బందిని నియమించుకోవాలని ఈఆర్వోలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటీసుల జారీ ప్రారంభం..
కొన్ని జిల్లాల్లో బుధవారం నాటికి నోటీసుల జారీ ప్రారంభించినట్టు సీఈఓ సి.సుదర్శన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గురువారం నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో నోటీసుల ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో నోటీసులను ఇంగ్లిష్, తెలుగు భాషల్లో, మిగిలిన ప్రాంతాల్లో తెలుగు భాషల్లో ముద్రించి జారీ చేస్తున్నారు.


