సీడబ్ల్యూసీ సమావేశంలో మీరాకుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
అవసరమైన ప్రచారం.. ఇతర సహకారానికి ముందుంటాం
కీలకమైన రాష్ట్రాల్లో తెలంగాణ నేతలు అక్కడే మకాం వేసేందుకు సిద్ధం
యువతకు మరింత చేరువయ్యేలా రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు
సీడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి సత్తా చాటాలని, అందుకు అవసరమైన అన్నిరకాల సహకారం అందించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వగా, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ వ్యూహాలు, జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి కీలకమైన రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు, పీసీసీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారన్నారు. అధిష్టానం ఆదేశిస్తే.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించే ప్రచారం కోసం అక్కడే మకాం వేసి పూర్తిస్థాయిలో పనిచేస్తారని సీఎం తెలిపారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, 6 గ్యారంటీలను ఆయా రాష్ట్రాల ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారాన్ని రూపొందిస్తామన్నారు.
బీజేపీ విధానాలను తిప్పికొట్టాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ, అయోధ్య రామాలయంలో చందాల చోరీ వంటి విషయాల్లో బీజేపీ తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అదే సమయం యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు, సమరశీల పోరాటాలు చేపడుతున్నామని వివరించారు. భవిష్యత్ ఎన్నికల్లో యువతే కీలకపాత్ర పోషించనున్నందున, వారి సమస్యలపై నిరంతరం దృష్టి సారిస్తున్నామని చెప్పారు.


