హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా మురళి-సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే కాంగ్రెస్ క్రమశిక్షన కమిటీ ఆగ్రహం వ్యక్తం నేపథ్యంలో అధిష్టానం ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీశారు. అదే సమయంలో టీపీసీసీ నుంచి పూర్తి నివేదిక కోరారు.
కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..
కొండా సుస్మిత కామెంట్ పై స్పందించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఉన్నాయన్నారు. పార్టీ లక్ష్మణ రేఖను ఎవరు అతిక్రమించిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీలో ఉన్న మల్లు రవి వ్యాఖ్యానించారు.
పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్న తర్వాత కొండా సుస్మిత పై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కూడా షబ్బీర్ అలీ, కొండా మురళి వివాదంలో వారితో చర్చించి సమస్యను పరిష్కరించామని, ఇటీవల రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే నోటీసులు ఇచ్చామని కూడా ఆయన తెలిపారు.


